ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెగ్యూలర్ గా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న పర్యటనలకు, అంతకు ముందు ప్రధానమంత్రులు జరిపిన విదేశీ పర్యటనలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రతి విదేశీ పర్యటన నుంచి దేశం కంటే వ్యక్తిగతంగా గరిష్ఠ రాజకీయ ప్రయోజనం పొందడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా మోదీ అనుసరిస్తున్న ఈ విధానంలో తప్పు లేదు.
పాకిస్థానీ నేతలు పర్వేజ్ ముషారఫ్, భుట్టోలు నివసించే దుబాయి నగరంలో మోదీ బహిరంగ సభ నిస్సందేహాంగా భారత్‌కు ఒక ప్లస్ పాయింట్. ఆబుధాబిలో కార్మిక క్యాంపు సందర్శన, దుబాయిలో నమో మర్హాబ బహిరంగ సభ - మోదీ పర్యటన సందర్భంగా ప్రధాన ఆకర్షణీయ కార్యక్రమాలు. ప్రధాని మోదీ గల్ఫ్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన ఈ ఎడారి దేశాలలోని భారతీయ ప్రవాసుల సంక్షేమానికి సంబంధించి కొన్ని విధానపరమైన ప్రకటనలు చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశించారు. అయితే మోదీ అటువంటి అంశాలను కనీసమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం కాస్త నిరాశపర్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు పక్కన బెడితే ఓవరాల్ గా తనకు ముందు ప్రధానమంత్రిగా ఉన్న వారు దుబాయికు రాకపోవడం పై విమర్శ, ఆబుధాబిలో దేవాలయానికి స్ధలం కేటాయింపు, లేబర్ క్యాంపు సందర్శన మోదీకి రాజకీయ లబ్ధిని సమకూర్చే విషయాలు. పరస్పర నిఘా సమాచార మార్పిడి, సైబర్ నేరాలు, దావూద్ ఇబ్రహీం ఆర్ధిక మూలాల నిర్మూలన, ఉగ్రవాదంపై పోరాటంలో సమష్టి కృషి మొదలైనవి దౌత్యపరంగా మోదీ సాధించిన విజయాలు.