ప్రపంచమంతా ఇప్పుడు మోదీ నామస్మరణ జపిస్తోంది. వరుస విదేశీ పర్యటనల్లో అది రుజువుగా కనిపిస్తుంది కూడా. ఇక వచ్చే నెల ప్రధాని మోదీ యూకే పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు మోదీ ఎక్స్ ప్రెస్ పేరిట ఓ బస్సును యూకే మొత్తం తిప్పాలని అక్కడి ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికావటమే కాదు... యాత్రను ప్రారంభించారు కూడా. ఆదివారం సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి మరీ ఈ యాత్రను ప్రారంభించగా మొదటగా అది లిటిల్ ఇండియా గా పేరుగాంచిన ఈలింగ్ రోడ్ లోని వెంబ్లే పట్టణంలో కాసేపు సేదతీరింది.
ఇక ‘యూకే వెల్ కమ్స్ మోదీ’ కార్యక్రమాల నిర్వహకుడు మయూరి పార్ మర్ మీడియాతో మాట్లాడుతూ... ఇన్నాళ్లు మోదీకి సంబంధించి చాయ్ మీద చర్చ జరిగింది. ఇక మీద మేము నిర్వహించే ఈ బస్సు యాత్ర మీద జరగాలి. అంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నామీ యాత్ర అని ప్రకటించారు. మొత్తం 400 కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు ఇప్పటిదాకా మోదీ ప్రసంగించే సభకు సభ్యత్వం నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. నవంబర్ 13న వాంబ్లే స్టేడియంలో నిర్వహించబోయే వేడుకలు ఒలంపిక్స్ సంబురాల వేడుకల తరహాలోనే ఉంటాయని ఆయన ప్రకటించారు. దాదాపు 250 పట్టణాల నుంచి 65 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని వారు అంచనా వేస్తున్నారు. ఇక ఆయన పర్యటనపై భారతీయులతోపాటు అక్కడి అధికారులు కూడా సర్వత్రా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.