భూసేకరణ పై బాంబు పేల్చిన మోదీ

August 31, 2015 | 05:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
narendra-modi-land-ordinance-bill-maan-ki-baat-niharonline.jpg

మోదీ మానస పుత్రికగా భావించిన భూసేకరణ చట్టం మూలన పడనుంది. భూసేకరణ సవరణ ఆర్డినెన్స్ ను  తిరిగి జారీ చేయటం లేదని ఆయన స్వయంగా ప్రకటించి బాంబ్ పేల్చారు. ఎన్డీఏ ప్రభుత్వం భూసేకరణ సవరణ ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయకూడదని నిర్ణయించటంతో గతంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసిన భూసేకరణ చట్టం అమలు జరుగుతుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ ఆదివారం తన మన్‌కీ బాత్ ప్రసంగంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. భూసేకరణ సవరణ చట్టం విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేసి రైతులను భయాందోళనకు గురి చేయటంతో పాటు వారిని గందరగోళంలో పడవేశారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఆమోదం పొందిన భూసేకరణ సవరణ బిల్లును ప్రతిపక్షం మెజారిటీలో ఉన్న రాజ్యసభ తిరస్కరించటం తెలిసిందే. దీనితో భూసేకరణ సవరణ చట్టంపై ఎంతో పట్టుదలను ప్రదర్శించిన నరేంద్ర మోదీ ఆర్డినెన్స్ ద్వారా దీనిని అమలు చేసేందుకు ప్రయత్నించారు.

                                      ఇప్పటికి పలుమార్లు భూసేకరణ సవరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇప్పుడీ అర్డినెన్స్ సోమవారంతో ముగిసిపోతోంది. నరేంద్ర మోదీ ఆదివారం ఆకాశవాణిలో నెలవారీ మనసులోని మాట ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. ‘భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలని పలు రాష్ట్రాలు సూచించాయి. గ్రామాలకు రోడ్లువేయాలన్నా, గ్రామీణ యువకులకు ఉపాధి కల్పించాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ఈ చట్టానికి సవరణలు ఎంతో అవసరం ఉంది’ అని అన్నారు. భూసేకరణ చట్టంలో పదమూడు మార్పులు చేయవలసి ఉండిందని, వాటికి సంబంధించిన ఆదేశాలను ఈరోజు జారీ చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల కోసమే భూసేకరణ చట్టాన్ని సవరించాలనుకున్నాము, కానీ కొందరు తప్పుడు ప్రచారం చేయటం ద్వారా రైతులను భయపెట్టారని ప్రధాన మంత్రి దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి ఈరోజు జోడిస్తున్న పదమూడు అంశాలు రైతులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం కలిగించేందుకు సంబంధించినవని మోదీ ప్రకటించారు. మొత్తానికి భూసేకరణపై ప్రతిపక్షాలతోపాటు మిగతా పక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవ్వటంతో వెనక్కి తగ్గినట్లు అర్థమవుతోంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ