ఐదురోజుల అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త మిత్రులను కూడగట్టగలిగారు. అంతర్జాతీయ ద్వైపాక్షిక వేదికలపై మన జాతీయ స్వరాలను మరింత ప్రభావవంతంగా వినిపించగలిగారు. అద్భుతాలు అని చెప్పలేంగానీ, అరుదైన విషయాలను ఆయన సాధించగలిగారు. ఈ సందర్భంగా మోదీ సాధించిన ఆ అయిదు విజయాలు ఏంటంటే...
- మనదేశం పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశమని పెట్టుబడిదారులకు స్వర్గమని ప్రపంచీకరణ గీతాన్ని మరోసారి వినిపించగలిగారు. ప్రవాస భారతీయ ప్రతిభా జలాశయంలో జలకమాడగలిగారు. అగ్ర కంపెనీలకు చెందిన సీఈవోలు మన దేశానికి చెందిన వారు కావటంతో ఈ పని మరింత సులువు తరం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
- ఇక అగ్రరాజ్యంతో కుదిరిన ఆయుధాల ఒప్పందం. అమెరికాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాన్ని ధ్రువీకరించడం ద్వారా మన రక్షణ పాటవం పెరగడానికి దోహదం చేయగలిగారు. ద్వైపాక్షిక అంతర్జాతీయ సమావేశాలలోను, అధికార, అనధికార సమ్మేళనాలలోను కూడ, ఉగ్రవాద ప్రమాదాన్ని ప్రస్తావించడం ద్వారా అంతర్జాతీయ సమాజానికి మరోసారి ప్రమాద స్ఫురణను కల్పించడం మోదీ పర్యటనలోని మరో ప్రధానాంశం. బీభత్సకాండను స్పష్టంగా నిర్వచించడానికి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనడానికి వలసిన శాశ్వత అంతర్జాతీయ వ్యవస్థను నెలకొల్పడానికి వీలుగా నియమావళిని అంగీకరించాలని సమితికి, ప్రపంచ దేశాలకు, అమెరికాకు మోదీ పదేపదే విజ్ఞప్తి చేశారు. టెర్రరిజాన్ని పురికొల్పుతున్న పాకిస్తాన్ వంటి దేశాలు, ఇలాంటి బీభత్స ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్న చైనా వంటి దేశాలు భుజాలు తడుముకోవడం మోదీ సాధించిన వ్యూహాత్మక విజయం.
- అంతర్జాల అనుసంధాన వ్యవస్థను మనదేశమంతటా విస్తరింపజేయడం ద్వారా ఐదు లక్షలకు పైగా గ్రామాలను దృశ్యకరణ తరంగ డిజిటల్ అనుసంధానం చేయడానికి విప్లవాత్మక పథకాలను సిద్ధం చేసి వచ్చారు. కొత్త సంస్థలుగా ఏర్పడి భారత్‌కు పెట్టుబడులను సమకూర్చడం వల్ల, భారత్‌లో కొత్త సంస్థలను స్థాపించి పెట్టుబడులను పెంచడం వల్ల ఉపాధి అవకాశాలను పెంచాలన్నది సిలికాన్ సాంకేతిక విజ్ఞాన సభలలో మోదీ చేసిన మరో ప్రతిపాదన. ఇలా అమెరికాలోని తూర్పుతీరం న్యూయా ర్క్ నుండి పశ్చిమ తీరం కాలిఫోర్నియా వరకూ వాణిజ్య, దౌత్య, మైత్రీ, సౌహార్ద్ర యాత్రను ఒకేసారి చేసిన మొదటి ప్రధాని బహుశా నరేంద్ర మోదీ యే కావొచ్చు.
- చిన్న దేశాలతో మైత్రీ సంబంధాలను పునరుద్ధరించుకొనడానికి మోదీ యత్నించడం ఈ విదేశ పర్యటనలోని మరో ప్రధాన అంశం. బ్రిటన్‌కు పొరుగు దేశమైన ఐర్లాండ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. బ్రిటన్‌కు ఐర్లాండ్‌కు మధ్య గల భౌగోళిక విభేదాలు మాత్రమే ప్రధానంగా ప్రచారమయ్యాయి. మనదేశం వలెనే ఐర్లాండ్ కూడ గతంలో బ్రిటన్ దురాక్రమణకు గురి కావడం చరిత్ర. ఐర్లాండ్ ద్వీపంలోని ఉత్తర ప్రాంతం ఇప్పటికీ బ్రిటన్‌లో భాగంగా ఉంది. దక్షిణ భాగం ఐర్లాండ్‌గా స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. అమెరికాకు వెడుతూ నరేంద్ర మోదీ ఒక రోజు ఐర్లాండ్‌లో ఆగడం చిన్న దేశాలకు సైతం మనం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఇటీవల పర్షియా సింధుశాఖ ప్రాంతంలోని చిన్న దేశం ఐక్య అరబ్ దేశాల యుఏఈ ని సందర్శించిన మోదీ ఐర్లాండ్‌ను ఇప్పుడు పలకరించడం అంతర్జాతీయ సమానత్వ సూత్రానికి అనుగుణమైన దౌత్యం. స్వతంత్ర దేశాల మధ్య సమానత్వం ప్రాతిపదికగా మైత్రిని పెంపొందించడం క్రీస్తుశకం 1945లో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి వౌలిక ధ్యేయాలలో ఒకటి. చిన్న దేశమైన ఐర్లాండును సందర్శించడమే కాకుండా, సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనను బలపరచవలసిందిగా కూడ ఐర్లాండ్ ప్రధాని ఎండాకెన్నీని నరేంద్ర మోదీ అభ్యర్థించడం చిన్న దేశాలను సైతం సమానత్వం ప్రాతిపదికగా సమ్మానించే, సంభావించే భారతీయ పరంపరకు మరో నిదర్శనం.
- అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు భద్రతా మండలి ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం లభించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవేదనను వ్యక్తం చేయడంతో సరిపెట్టుకోక ఆచరణాత్మక వ్యూహానికి సైతం మోదీ అమెరికాలో శ్రీకారం చుట్టి వచ్చారు. నాలుగు దేశాల కూటమి-గ్రూప్ ఆఫ్ ఫోర్- జి4- ప్రభుత్వ అధినేతల సమావేశాన్ని ఐక్యరాజ్య సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఈ శ్రీకారం. బ్రెజిల్, జర్మనీ, జపాన్ ప్రభుత్వాధినేతలైన దిల్మా రొస్సెల్, అంజిలా మార్కె, షింజో ఏబ్ మోదీ తో కలిసి శాశ్వత సభ్యత్వం కోసం సమష్టి గళమెత్తడం ఈశ్రీకారం. మనదేశానికి మాత్రమే కాక జర్మనీ, బ్రెజిల్‌కు, జపాన్‌కు కూడ మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరడం మోదీ దౌత్యవ్యూహంలో భాగం. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలైన జర్మనీ, జపాన్‌లు సైతం మనతో కలిసి ఒత్తడి ప్రారంభించడం వల్ల అమెరికా గొప్ప అసౌకర్యానికి గురవుతోంది. బ్రిటన్ ఇదివరకే మన శాశ్వత సభ్యతానికి మద్దతు పలికింది. ఫ్రాన్స్ కూడ బహిరంగంగా మనకు బాసటగా నిలబడడం మోదీ అమెరికా యాత్ర వల్ల లభించిన కొత్త ప్రయోజనం.
చివరగా.... అమెరికా అధ్యక్షునితో చర్చించిన అన్ని అంతర్జాతీయ సమస్యలనూ-టెర్రరిజం, పర్యావరణ పరిరక్షణ, సమితి సంస్కరణలు, అణుభద్రత, వంటి అంశాలను- ఐర్లాండు ప్రభుత్వ అధినేతతో కూడ ముచ్చటించడం మన ప్రభుత్వ సమానత్వ నీతికి చారిత్రక సాక్ష్యం. జైహింద్...