జగన్ అంటే ఓకే... మరి మంత్రులో?

January 19, 2016 | 11:15 AM | 4 Views
ప్రింట్ కామెంట్
AP-Assembly-MLAs-including-ministers-not-reveals-assests-niharonline

చట్టసభలో  ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు తమ తమ ఆస్తులను వెల్లడించిన దాఖలాలు చాలా తక్కువ. స్పీకర్లు సైతం ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆస్తులు వెల్లడించని నేతలు ఎంతో మంది ఉన్నారు.  అయితే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకముందే తనంతట తానే మీడియా ముందుకొచ్చి ఆస్తులను వెల్లడిస్తారీ కుప్పం ఎమ్మెల్యే. ఎప్పటికప్పుడూ ఆస్తులను వెల్లడించి అందరికన్నా ముందుండి ఆదర్శంగా నిలుస్తారు.

అయితే ఆయన సహచరుల వ్యవహార శైలి మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పటిదాకా కేవలం 46 మంది మాత్రం తమ ఆస్తుల చిట్టాలను అసెంబ్లీకి సమర్పించారు. పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తన ఆస్తులను వెల్లడించలేదు. ఆయన ఆస్తులపై కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ చెప్పుకోదగిన అంశం ఏంటంటే... డిప్యూటీ సీఎంలు అయిన కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప సహా కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రులు కూడా ఆస్తుల వివరాలను తెలిపేందుకు విముఖత చూపారంట. ఈ మేరకు ఆస్తులు వెల్లడించిన వారి జాబితాను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు  ప్రకటించారు. వారిలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారాయణ, శిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, పరిటాల సునీతలతో పాటు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విప్ చింతమనేని ప్రభాకర్ కూడా తమ ఆస్తులను వెల్లడించలేదు. జగన్ భయపడుతున్నాడంటే ఓ అర్థం ఉంది కానీ, అధికార సభ్యులు కూడా ఆస్తుల విషయంలో అయిష్టత కనబరుస్తున్నారంటే వెనకాల ఏదో మతలబు ఉన్నట్లు జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లే అవుతుంది కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ