ఏపీలో రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని గత కొద్దిరోజులుగా వినిపించినవి కేవలం ఆరోపణలే కాదని తుని ఘటన రుజువు చేస్తుందా? కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి ఆ వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంతో జగన్ నిరసన కార్యక్రమాలు చేయించబోతున్నాడా ? ప్రభుత్వ వర్గాల్లో అప్పట్లో నెలకొన్న ఈ అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. తునిలో రేగిన మంటలు జగన్ రేపినవేనని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది.
కాపు అభివృద్ధి కోసం ఓ వైపు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తున్నా… వైసీపీ అధినేతకు సన్నిహితంగా ఉంటున్న నాయకులు ఇలాంటి ప్రయత్నాలు చేయడం వెనుక మర్మమేంటనే అంతుబటట్టడం లేదు. కాపులను ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి… ఆ తరువాత శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని జగన్ పార్టీ కుట్ర పన్నిందని ఇంటలిజెన్స్ వర్గాలకు కూడా సమాచారం అందిందని తెలుస్తోంది. అయితే ఇంత సమాచారం ఉన్నా కాపు సభ పై పోలీసులు డేగ కన్ను వేయకపోవటం పెను నష్టాన్నే మిగిల్చింది. 25 వాహనాలతోపాటు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు మంటపెట్టడంతోపాటు దాదాపు 30కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇక ఈ కుట్ర వెనుక జగన్ హస్తం ఉందని మంత్రులతో సహా చంద్రబాబు చెప్పటం ఈ అంశానికి మరింత బలం చేకూరుస్తుంది. రాజకీయ నిరుద్యోగులను రంగంలోకి దించి ప్రభుత్వంకి ఊపిరి సలపకుండా చెయ్యాలన్నదే జగన్ ఆలోచన అని వారు అంటున్నారు. ఇంటలిజెన్స్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపల జగన్ కి చెందిన మీడియా వెహికిల్స్ అక్కడ ముందునుంచి ఉండటమే అందుకు కారణమని స్వయంగా చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు.
కులాల మధ్య పోరు మొదలైతే… అది అంతిమంగా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. అధికారం కోసమో, ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టాలనే ఈ ప్రయత్నాల వెనుక ఒకవేళ ఆయన గనక నిజంగా ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెను ముప్పుగా మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.