ఇద్దరు ప్రముఖ నేతలు. వారిద్దరు బద్ధశత్రువులు. అయితే అది ఒకప్పుడు. మారిన పరిస్థితులు వారిని ఒకే గూటికి (పార్టీకి) చేర్చాయి. కానీ, పాత వాసన పోదు కదా. ఒకే పార్టీలో ఉంటూ, ఒకే వేదికపై కలిశారు. ఉప్పు-నిప్పులా తీవ్ర విమర్శలు చేసుకున్న నేతలు పక్కపక్కన కూర్చున్నారు కూడా. నెల్లూరు జిల్లా ప్రధాన రాజకీయ నేత అయిన ఆనం వివేకానంద రెడ్డి, తెలుగుదేశం సీనియర్ నేత అయిన చంద్రమోహన్ రెడ్డి గురించే ఇదంతా. ఆదివారం వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సంవాదం జరిగింది. అది కూడా అధినేత చంద్రబాబు సమక్షంలోనే కావటం విశేషం.
ముందుగా ఆనం వివేకానంద రెడ్డి ప్రసంగిస్తూ, "జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలు. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకునేలా కృషి చేద్దాం" అని చెప్పారు. దానికి సోమిరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "గత ఎన్నికల్లో మూడు సీట్లే గెలిచామని చెబుతున్నారు. సరే. 1989లో మీరు టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు ఒక్క సీటు కూడా రాలేదు. ఆపై 1994లో (ఆనం సోదరులు కాంగ్రెస్ లో ఉన్నారు) జిల్లాలో మొత్తం సీట్లను మేం గెలుచుకున్నాం" అని గుర్తు చేశారు.
తాను సోమిరెడ్డి నాయకత్వంలోనూ పనిచేస్తానని ఆనం వెల్లడించగా, టీడీపీలో కేవలం చంద్రబాబు నాయకత్వం మాత్రమే ఉంటుందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి నెల్లూరు టీడీపీలో తిరుగులేని నేతైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగుదేశంలో చేరిన మరో పవర్ ఫుల్ నేత ఆనం వివేకానంద రెడ్డి మధ్య జరిగిన ఈ సంభాషణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది, బాబు సమక్షంలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో రాజకీయంగా వీరు కలిసి ప్రయాణించడం కష్టమే సుమీ!