కాపు ఐక్య గర్జన సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖరాశారు. తుని ఘటనతోపాటు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నేతృత్వంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూలంకశంగా చిరు ఆ లేఖలో వివరించారు. రెండు పేజీల లేఖలో 18 నెలల పాలనను, అందులోని లోపాలను ఎత్తిచూపేందుకు ప్రయత్నించారు.
ముఖ్యంగా తునిలో చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన కలిగించాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ, సామాజిక సంఘటనలు దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాపులు, బీసీలే కాకుండా రైతులు, మహిళలు రోడ్లెక్కే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. తక్షణం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని లేఖలో చిరంజీవి డిమాండ్ చేశారు.
కాపు గర్జనతో మొదలు పెట్టి పెట్రో బారెల్ రేటు వరకూ అన్ని విషయాలూ ఆయన స్టైల్లో ఈ లేఖలో ప్రస్తావించేశారు. అసలు ఖర్చులు ఎలా ఆపాలి, సంక్షేమాన్ని ఎలా పైకి లేపాలి లాంటి సూచనలు కూడా ఉన్నాయ్. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఉదారతని ఆయన ఎలా అర్థంచేసుకున్నారో కూడా ఈ లేఖలో కనిపిస్తోంది. స్థానిక జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలన్నీ ఉన్నాయ్. వాటితోపాటు అసలు ఏం చెప్పాలనుకున్నారనే కన్ ఫ్యూజన్ కూడా ఉందనుకోండి ! లేఖ సినిమాటిక్ గా ఉండటం వల్ల వచ్చిన సమస్య ఇది ! ఇక చివరగా లెటర్ హెడ్ లో చిరు పర్మినెంట్ అడ్రస్ తెలంగాణ అని పేర్కొవటం విశేషం. అంటే ఫ్యూచర్ లో ఆయన ఆంధ్రకి తరలే ఉద్దేశం లేదని అనుకోవాలా?