సాధారణంగా నేతలు రాజకీయాల్లో ఎంత సీరియస్ గా ఉంటారో, ప్రైవేట్ కార్యక్రమాల్లో ఫుల్ జోష్ తో పాల్గొంటారు. నెల్లూరు ఆనం వివేకానందలాంటి వారైతే ఓ అడుగు ముందుకేసి షాపు ఓపెనింగ్ లకు వచ్చిన హీరోయిన్లతో చనువుగా మూవ్ కావటం, బయటి పంక్షన్లో చిందులేయటం చూస్తుంటాం. కానీ, ఇక్కడో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం జమ్ము ప్రభుత్వం పై గరం గరం వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి హీరోతో పోటీ పడి మరీ స్టెప్పులేసి ఆశ్చర్యపరిచారు.
జమ్ము మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నిన్న సరికొత్త అవతారం ఎత్తారు. అచ్చం సినిమా హీరోలా స్టెప్పులేసిన అబ్దుల్లా, బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ కు ఏమాత్రం తీసిపోనని నిరూపించారు. ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ ఏర్పాటు చేసిన ‘ఎన్టీడీవీ ఇండియన్ ఆప్ ద ఇయర్ 2015’ అవార్డుల వేదికపై ఆయన హుషారుగా స్టెప్పులేశారు. బాలీవుడ్ తాజా హిట్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ’ లోని ‘మల్హరీ’ పాటకు ఆయన వేసిన స్టెప్పులతో ఆ వేదిక హోరెత్తిపోయింది. వేదికపై ‘బాజీరావ్ మస్తానీ’ హీరో రణవీర్ సింగ్ తో కలిసి హుషారుగా స్టెప్పులేశాడు అబ్దులా. 78 ఏళ్ల ఈ మాజీ సీఎం 30 ఏళ్ల రణవీర్ కంటే వేగంగా కాలు కదిపి ఆ కార్యక్రమానికి హాజరైన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రస్తుతం అబ్దుల్లా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.