స్మృతిని తాకిన హెచ్ సీయూ సూసైడ్ సెగ

January 18, 2016 | 05:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
hcu-students-protest-at-smriti-house-due-to-dalit-student-suicide-niharonline

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ (28) ఆత్మహత్య ప్రకంపనలు ఢిల్లీని తాకాయి. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ కు మద్దతుగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖకు స్పందనగా, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ కారణంగానే రోహిత్ పై సస్పెన్షన్ వేటు వేశారని, ఆ నేపథ్యంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు స్మృతీ ఇరానీ నివాసం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇరానీ కార్యాలయం వద్ద విద్యార్థులు బారీకేడ్లు తొలగించేందుకు ప్రయత్నించగా, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  దీంతో  పోలీసులు వారిని అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు.

మరోవైపు రోహిత్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దత్తాత్రేయ తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ రాసిన లేఖ వల్లే ఈ దారుణం జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారని అదంతా నిజం కాదని ఆయన అంటున్నారు. విశ్వవిద్యాలయంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందినందునే తాను లేఖ రాశానని చెప్పారు. ఏబీవీపీ కార్యకర్తలను దారుణంగా కొట్టినందునే తాను కేంద్ర మానవ మంత్రిత్వ శాఖకు లేఖ పంపించానన్నారు. దీనిపై తనకుగానీ, తన పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. తనపై పెట్టిన కేసుల గురించి ఏమీ వ్యాఖ్యానించనని చెప్పారు. కాగా, తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కూడా రోహిత్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, అదంతా రాజకీయ కుట్ర అని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇక రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మానవ వనరుల శాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ సంఘాన్ని నియమించారు. ఓఎస్‌డీ షకీలా శంషు, డిప్యూటీ సెక్రటరీ సూరత్‌సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సాయంత్రం కమిటీ హెచ్‌సీయూకు చేరుకోనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ