మతం జోలికి పోకుండా సేవ చేయలేమా?

March 24, 2015 | 03:08 PM | 61 Views
ప్రింట్ కామెంట్
Rajnath_Singh_about_conversations_niharonline

దేశంలో మైనారిటీలకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మత మార్పిళ్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి మత మార్పిళ్ల నిరోధక చట్టంపై చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ‘మత మార్పిళ్లు లేకుండా ప్రజలకు సేవ చేయలేమా? సేవ చేయాలని అనుకునే వాళ్లు మతమార్పిడికి పాల్పడకుండా ఆ పని చేయాలి. దీనికి పరిష్కారం కనుక్కోలేమా? దీనిపై ప్రభుత్వం ఏదైనా చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమాజం బాధ్యతగా వ్యవహరించి ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించాలి’ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల మైనారిటీ కమిషన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇతర దేశాల్లో మైనారిటీలే మతమార్పిళ్ల నిరోధక చట్టం కావాలని కోరుతున్నారని, భారత్‌లోనూ ఆ చట్టం రావాలని, దానిపై చర్చ జరగాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు. దీనిపై ఆలోచించాలని మైనారిటీ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. మైనారిటీల రక్షణకు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావం నెలకొందని, దాన్ని తొలగించడమే తమ సర్కారు లక్ష్యమన్నారు. అన్ని మతాల వారు సామరస్యంగా మనగలిగే దేశంగా భారత్‌కు మంచి పేరుందని, దాన్ని ప్రజలంతా కలిసికట్టుగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ