గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి లెక్కలు వారివి. కనీసం కోసం ప్రతిపక్షాలు పడరాని పాట్లుపడుతుంటే, పరువు కోసం అధికారపక్షం వెంపర్లాడుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టండని, హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రచార సారథి కేటీఆర్ కోరుతున్నాడు. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరిస్తే తప్ప పరిష్కారం కానటువంటి రేంజ్ లో సమస్యలు ఉన్నాయంటూ చెప్పుకోస్తున్నాడు. అయితే పనిలో పనిగా గ్రేటర్ అభివృద్ధి తమతోనే సాధ్యమంటున్న బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని మోదీకే ఆయన చురకలంటించారు.
ప్రధాని అయ్యాక కనీసం హైదరాబాద్ ముఖం కూడా చూడని మోదీకి హైదరాబాద్ ప్రజలు ఓటు ఎలా వేస్తారో చెప్పాలన్నారు. నల్లధనంను విదేశాల నుంచి రప్పిస్తానన్న మోదీ ఆ పనిచేశారా? అని ప్రశ్నించారు. నల్లధనం విషయం పక్కన బెడితే అధికారంలోకి వచ్చాక విదేశాల్లోనే గడుపుతున్న మోదీని భారత్‌కు రప్పించాల్సిన పరిస్తితి ఉందని ఎద్దేవా చేశారు.
నిజానికి కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. గ్రేటర్ లో కాస్తో కుస్తో పట్టు ఉంది బీజేపీకే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ లాంటి కీలకనేతలు కూడా మజ్లిస్ కన్నా టీఆర్ఎస్ పైనే ఎక్కువ దృష్టిసారించి విరుచుకుపడుతున్నారు. ప్రతీ మీటింగ్ లలో కేసీఆర్ అండ్ కో నే టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ బీజేపీపై పడటం పెద్ద వింతే కాదులెండి. కానీ, ఓవైపు ప్యాకేజీలు ప్రకటించినప్పుడల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీని ఆకాశానికెత్తేస్తుంటే, కేటీఆర్ మాత్రం విరుచుకుపడటం చెప్పుకోదగిన మ్యాటరే.