తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించి ఒక రోజు గడవనే లేదు అప్పుడే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడం పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నియామకం ఏక పక్షంగా జరిగిందని అసంతృప్తి చెందారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ల, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ నియామకం జరిగిందని అన్నారు. తెలంగాణాలో ఉన్న నేతలందరిపై సర్వే చేయించి బలమైన నేతలకు ఈ పదవి అప్పగించి ఉంటే బాగుండేదని అన్నారు. తనను ఈ విషయం చాలా బాధించిందని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్ ను నియమించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వడం వెనక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.