పోల్ గురుకి పదవి కూడా దక్కిందండోయ్

January 22, 2016 | 11:52 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Prashant Kishor appointed as advisor for nitish kumar niharonline

నరేంద్ర మోదీకి, నితీశ్ కుమార్ కు వినూత్న రీతిలో ప్రచారం చేసిపెట్టాడు ప్రశాంత్ కిషోర్. ప్రజలను ఆకట్టుకోవటంలోనే కాదు వారి విజయాల్లో కీలక భూమికే పోషించారు. అప్పటిదాకా ముక్కిమూలుగుతున్న ఎన్నికల ప్రచారం ఈ పోల్ హీరో ఎంట్రీతో పరుగులు పెట్టింది. కొత్త పుంతలు తొక్కి జన నేతలకు విజయం కట్టబెట్టింది. అధికార పీఠాలను అందించింది. ఇప్పుడతనీ క్రేజ్ ఎలా ఉందంటే వచ్చే ఎన్నికల కోసం అతని డేట్స్ బుక్ చేసుకునేందుకు మమతా బెనర్జీ లాంటి కీలకనేతలు పడిగాపులు పడేంతగా... అంతేనా ఆ గుర్తింపే ప్రస్తుతం అతనికి కూడా కేబినెట్ మినిస్టర్ ర్యాంకును సాధించిపెట్టింది.

                                     తన విజయంలో కీలక భూమిక పోషించిన ప్రశాంత్ కిషోర్ ను నరేంద్ర మోదీ మరిచిపోయి ఉండవచ్చు కానీ, నితీశ్ కుమార్ మాత్రం మరిచిపోలేదు. బీహార్ సీఎం హోదాలో ఉన్న తనకు ప్రశాంత్ కిషోర్ ను ‘సలహాదారు’గా నియమించుకున్నారు. అది కూడా కేబినెట్ మినిస్టర్ ర్యాంకులో ప్రశాంత్ ను సలహాదారు పదవిలో నియమిస్తూ నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

                                    నిజానికి ప్రశాంత్ కిషోర్ ఒక ప్రజారోగ్య నిపుణుడు . నరేంద్రమోదీ కోసం ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి తరఫున చేస్తున్న ఉద్యోగానికి 2011లో రాజీనామా చేసి భారత్ తిరిగొచ్చారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు మోదీ ప్రభుత్వాన్ని మారుపేరుగా జాతీయవ్యాప్తంగా ప్రచారం చేయడంలో కిషోర్‌ కీలక పాత్ర పోషించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వినూత్న రీతిలో సాగించిన ప్రచారానికి రూపకల్పన  చేసింది కిషోరే. ముఖ్యంగా ఆయన రచించిన 'చాయ్‌ పే చర్చ' మోదీకి ప్రచారంలో బాగా కలిసివచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచార వ్యూహాలకు పదునుపెట్టే ప్రశాంత్ కిషోర్ బృందంలో ప్రధానంగా యువ ఎంబీఏ, ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఉంటారు.

                                 ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించడం, విజయం ఖాయమన్న సందోహాన్ని కల్పించడం కిషోర్ ప్రచార వ్యూహాల్లో ప్రధానంగా ఉంటాయి. నితీశ్ కోసం 'పర్చా పే చర్చ'ను (పాంఫ్లెట్‌పై చర్చ) తెరముందుకు తెచ్చారు. గత పదేళ్లలో నితీశ్ సర్కార్ పనితీరుపై తమ అభిప్రాయాన్ని తెలుపాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా కోరారు. ఎల్‌ఈడీ మానిటర్లతోపాటు 400 ట్రక్కుల పాంఫ్లెట్లను ఇందుకోసం బిహార్‌లోని అన్ని గ్రామాలకూ పంపారు. కిషోర్ రూపొందించిన కార్యక్రమాలే నితీశ్ నేతృత్వంలోని మహాకూటమికి విజయానికి దోహదపడ్డాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ