రాం జెఠ్మలానీ... దేశంలోనే పేరున్న క్రిమినల్ లాయర్. ఏదైనా కేసును జెఠ్మలాని వాదిస్తున్నారంటే, న్యాయమూర్తులు కూడా కాస్తంత ఆసక్తి కనబరుస్తారు. బీజేపీ నేతగానే కాక కేంద్ర న్యాయ శాఖ మంత్రిగానూ పనిచేసిన జెఠ్మలాని తదనంతర కాలంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రమంలో మొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కేజ్రీ తరఫున ఆయన వకాల్తా పుచ్చుకున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గత నెలలో రాసిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది.
సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు కొందరు నేషనల్ హెరాల్డ్ కేసులో పీకల్లోతు కూరుకుపోయారు. తన జీవిత కాలంలోనే సోనియా తొలిసారిగా కోర్టు మెట్లెక్కారు. కొడుకు, పార్టీ నేతలతో కలిసి ఆమె ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వెళ్లారు. అయితే బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె కోర్టు నుంచి ఇంటికి చేరారు. సోనియా గాంధీ కోర్టు మెట్లెక్కిన తీరు జెఠ్మలానిని బాగా కలచివేసినట్లుంది. సోనియా కోర్టుకు వెళ్లి వచ్చిన రెండు రోజులకు బాగా ఆలోచించిన జెఠ్మలాని, ఆమెకు ఓ లేఖ రాశారు.
‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో మీ తరఫున వకాల్తా పుచ్చుకుంటాను. అందుకు నాకు ఫీజు కూడా అవసరం లేదు. కేసు నుంచి మిమ్మల్ని, మీ కుమారుడిని బయట పడేస్తా’’ అని ఆయన ఆ లేఖలో సోనియాకు తెలిపారు. ‘‘మీ పార్టీలో పేరొందిన లాయర్లు చాలా మందే ఉన్నారు. అయినా, సేవలు అందించేందుకు నేను సిద్ధమే’’ అని కూడా జెఠ్మలాని ఆఫర్ చేశారు. జెఠ్మలాని ఆపర్ కు సోనియా ఇప్పటిదాకా స్పందించలేదు.