జీహెచ్ఎంసీ కోసం టీ సర్కార్ చేసిన కిరికిరి

February 04, 2016 | 11:03 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Setback on ex officio votes HC irked by TS rule change-niharonline

జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీసియో సభ్యుల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. ఈ హోదాలో గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కుంది. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, కార్పొరేటర్ల సీట్లు కాస్తంత తక్కువగా వచ్చినా, ఎక్స్ అఫీసియో సభ్యుల ఓట్లతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదిపింది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఓటు హక్కుతో పనిలేకుండా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీలందరికీ ఎక్స్ అఫీసియో హోదా కట్టబెడుతూ జీవో జారీ చేసింది. అయితే హడావుడిగా తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ సర్కారుకు గట్టి షాక్ తగిలింది.

                                       ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యం బుధవారం బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే, గ్రేటర్ పరిధిలో ఓటరుగా ఉంటేనే సదరు ఎమ్మెల్సీకి ఎక్స్ అఫీసియో హోదా ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నిబంధనను మారుస్తూ గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీలందరికీ ఎక్స్ అఫీసియో హోదాను కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పింది. దీనిపై గురువారం మరోమారు జరగనున్న విచారణలో ప్రభుత్వం తన తరపున వాదనను వినిపించనుంది. మరి ప్రభుత్వ వాదనపై న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందా? తీర్పుతో ఆయా ఓట్లను గల్లంతు చేస్తుందా అన్నది కాసేపట్లో తెలుస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ