కొత్త వాదన: ఎన్టీఆర్ కు టీటీడీపీ పగ్గాలు?

January 21, 2016 | 10:43 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Jr-NTR-TTDP-head-tnsf-niharonline

గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పంపకం టీడీపీ నేతల మధ్య చిలికి చిలికి గాలివాన గా మారుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీట్ల ఎంపికలో అన్యాయం జరుగుతుందంటూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య మెరుపు ఆందోళన చేపట్టింది.  టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీ తన అనుచరులతో కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కటౌట్లను చించేశారు.  టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ కలసి టికెట్లను అమ్ముకుంటున్నారని వారి ఆరోపణ.

అయితే ఆపై ఓ వినూత్న డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. నందమూరి వంశంలో మూడో తరానికి చెందిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ తెలంగాణ శాఖ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యతో పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అభిమానులకు న్యాయం చేసే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి మరోవైపు హైదరాబాదుకు చెందిన పార్టీ నేత నైషధం సత్యనారాయణమూర్తి కూడా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు ఇదే వాదనతో నిరసనకు దిగారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఆందోళన జరిగిన కొద్దిసేపటికే శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు టీఎన్ఎస్ఎప్ ఇంచార్జీ మదన్ మోహన్ రావు ప్రకటించారు. గ్రేటర్ బరికి సంబంధించి అక్బర్ బాగ్ టికెట్ ను ఆశించిన శ్రీకాంత్ రెడ్డి, టికెట్ దక్కకపోవడంతో తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి ఆందోళనకు దిగారని ఆయన ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డి చేసింది పార్టీ వ్యతిరేక చర్యగానే పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదినాయకత్వం నుంచి అందిన ఆదేశాల మేరకే శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.

                   నందమూరి ఫ్యామిలీలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలకు ఈ డిమాండ్ కు లింక్ ఉందనే అనుకోవచ్చు. జూనియర్ కి సపోర్ట్ గా టీటీడీపీ తమ్ముళ్లు తెచ్చిన ఈ కొత్త వాదన తెరపై ఎక్కువ కాలం సాగుతుందా? లేక ఇక్కడితోనే పుల్ స్టాప్ పడుతుందా కాలమే నిర్ణయించాలి. అయినా నందమూరి వారి రాజకీయాలు అర్థం కానీ వారు ఎవరుంటారు చెప్పండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ