అలిగి ఆనాడే అరవిందు సన్యసిస్తే...

March 09, 2015 | 05:29 PM | 153 Views
ప్రింట్ కామెంట్
arvind_kejriwal_quit_AAP_niharonline

హస్తిన ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభంజనానికి కళ్లెం వేసి, హవా చాటిన ఏకైక వీరుడు అరవింద్ కేజ్రీవాల్. ఒంటరిగా ఏంచేయగలడని విర్రవీగిన పార్టీలకు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని కొలుకోలేని దెబ్బకొట్టి సమాధానం చెప్పిన వ్యక్తి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుకోవాలనే సామెతను అప్లై చేసి చూపాడీ సామాన్య నేత. అలాంటి ఆయన కొంతకాలం క్రితం ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అదేంటంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగాలని. ఈ విషయాన్ని కేజ్రీవాల్ సహచరుడు అశుతోష్ వెల్లడించాడు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ పార్టీలో అన్నీ తానై వ్యవహారాలు సాగిస్తున్నాడంటూ సొంత పార్టీ నేతల నుంచి గతేడాది జూన్ లో కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకున్నాడని ‘ది క్రౌన్ ప్రిన్స్. ది గ్లాడియేటర్ అండ్ ది హోప్’ పేరిట రాసిన పుస్తకంలో అశుతోష్ తెలిపాడు. ‘‘ఆ రోజు సమావేశంలో కేజ్రీవాల్ ముఖం వాడిపోయింది. కన్నీరు కార్చారు. ఏదో లేచి మాట్లాడాలని లేచిన ఆయన ఏమీ మాట్లాడకుండా కూలబడ్డారని పేర్కొన్నాడు. ఆ వెంటనే తను, మహిళా నేత అంజలి పరుగున వెళ్లి ఆయనను ఓదార్చినట్లు ఆయన తెలిపాడు. ఆ సమయంలో అంజలి కలుగజేసుకుని ‘మనమంతా సిగ్గుపడాలి. ఇదేనా మనం ఆయనకు ఇచ్చే గౌరవం’ అందని పుస్తకంలో చెప్పాడు. ఆ తర్వాత తేరుకున్న కేజ్రీవాల్ తనను ఆప్ కన్వీనర్ గా తొలగించి వేరే వారిని ఎన్నుకోవాలని సూచించారట. అయితే ఆ మరుసటి రోజే యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు ఆయన ఇంటికి వెళ్లి నచ్చజేప్పారని అశుతోష్ వివరించారు. కేజ్రీవాల్ పై సేమ్ ఇలాంటి ఆరోపణలు చేసినందుకే వారిద్దరిని ఇటీవల పార్టీ పీఏసీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇక అదనపు బాధ్యతలు అని పేర్కొంటూ కేజ్రీవాల్ కూడా జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ నాడు రాజకీయ సన్యాసానికి కేజ్రీవాల్ సిద్ధపడి ఉంటే... చీపురు పరిస్థితి ఎమయ్యేదో కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ