వామ పక్షాల జెండారంగు ఎర్రగా ఉంటుంది. వారు నాస్తికత్వాన్ని ఆలింగనం చేస్కుంటారనేది లోక విదితం. తీక్షణంగా పరిశీలిస్తే ఆ పార్టీ నాయకుల పేరులందు రకరకాల దేవుళ్ల పేర్లు అనగా నారాయణ, రాఘవులు వగైరా వినిపిస్తాయి. ఇక భాజపా వారి జెండా రంగు కాషాయం. వీరిద్దరి మధ్య సయోధ్య లేని కాషాయ ధార నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల నాయకులు కీలక స్థనాల్లో ఉంటూ వారి మార్జాల దాంపత్యపు కీచులాటలతో, సరసాలతో వినోదాన్ని పంచడం పరిపాటి. మన రాష్ట్రపు వెంకయ్య ప్రభుత్వంలో పలుకుబడి కలిగి ఉండీ తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసు లేక మాటల గారడీ చేస్తూ, అపుడపుడు నీళ్లు నములుతూ కొండొకచో ముఖం చాటేస్తున్నాడని కమ్యూనిస్టు సోదరులు వెంక్యను టార్గెట్ చేసేస్తున్నారు... ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేస్తూ ర్యాలీ తీసిన సీపీఐ కార్యకర్తలను అనంతపురంలో పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వారిని పరామర్శించేందుకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అక్కడికి వెళ్లారు. వారిని కలిసిన ఆయన అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఈ రాష్ర్టం అభివృద్ధి చెందుతుంది అనే న్యాయమైన డిమాండ్‌తో ప్రశ్నిస్తే వారిని జైల్లో పెట్టడం ఏం న్యాయమని ఆయన అడిగారు. ఇదే అదనుగా ఆయన వెంకయ్య నాయుడిపై సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ తేవడం తన బాధ్యత అని గతంలో మీసాలు మెలేసిన వెంకయ్యనాయుడు ఇచ్చిన మాట నిటబెట్టు కోలేదనీ, అందుకే మీసాలు కత్తిరించుకోవాలని ఎద్దేవా చేశారు.