గల్లీ స్థాయి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ హైదరాబాద్ లో కీలక నేతగా ఎదిగారు దానం నాగేందర్. మంత్రి పదవులు సైతం దక్కించుకుని ఢిల్లీ నేతలకూ ప్రీతిపాత్రుడయ్యారాయన. తన గ్యాంగ్ తో ఒకప్పుడు హైదరాబాద్ ను శాసించిన దానంకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టారో అక్కడికే మళ్లీ చేరారు. అసలు ఆయనకు గడ్డు కాలం ఎందుకు నడుస్తోంది. ఒకప్పుడు దానం అంటే భయంతో ఆమడ దూరంలో ఉండే నేతలే ఇప్పుడు ఎదురుగానే పంచ్ లు వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఉప్పల్ లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను తరిమితరిమి కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ దానంను పూర్తిస్థాయిలో నమ్మడం లేదని తెలుస్తోంది. ఆయన ఏటైంలోనైనా టీఆర్ఎస్ లో చేరవచ్చని హస్తం నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే దానంకు కేవలం ఖైరతాబాద్ ప్రచార బాధ్యతలను అప్పజెప్పటంతోపాటు ఇతర డివిజన్లలో జోక్యం చేసుకోవద్దని కూడా సూచించిందట.
అయితే అవేం పట్టించుకోకుండా దానం తన పని తాను చేసుకుపోతున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గానే పాల్గొంటున్నారు. అయితే అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన నోట పవన్ కళ్యాణ్ మాట వచ్చింది. హైదరాబాద్ నగరానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేవలు అవసరం అని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. కాపులు, బలహీనవర్గాలను ఎంపీ కవిత చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. పవన్ ను మేకప్, పేకప్ అని ఆమె విమర్శించిందంటూ మండిపడ్డారు. కాబట్టి ఇకనైనా పవన్ మేల్కోవాలని దానం సూచించారు. సొంత పార్టీలో దిక్కులేని టైంలో ఇలా ఈ టైంలో పవన్ జపం చేయటం వల్ల వచ్చే లాభం ఏంటో? కొంపదీసి త్వరలో జనసేన తీర్థం పుచ్చుకుంటారా ఏంటీ అని తోటి సహచరులే ఆయనపై జోకులు వేసుకునే పరిస్థితి అక్కడ నెలకొందట.