స్థానిక అధికార పార్టీ వారికి పరదేశ పార్టీ ప్రతినిధిలకు ఉప్పునిప్పులా ఉంటోంది. వీరు విపక్షంలో ఉండి చీటికి మాటికి భగ్గుమనడం తమలపాకుతో వీరు ఒకటంటే తలుపుచెక్కతో నాలుగు టీఆర్ఎస్ వారు తగిలించడం వినోద భరితంగా ఉంది. గవర్నర్ గారి ప్రసంగం సమయంలో నిరసనలను ధ్వనింపచేస్తూ తెలుగు దేశం వారు సోదర కాంగ్రెస్ వారితో కలిసికట్టుగా బావిలో పడడం అనగా వెల్ లోకి దూసుకెళ్ళడం, అదికార పక్షం వారు అడ్డుకట్ట వేసేటపుడు తోపులాట జరిగింది కూడా. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలు జాతీయ గీతాన్ని అవమానించారంటూ తెలుగు తమ్ముళ్లపై సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారంటూ తెలుగు తమ్ముళ్లు విమర్శిచటం తెలిసిందే. తమకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని.. ఒకవేళ తమకు న్యాయం జరగకుంటే.. రాష్ట్రపతి వద్దకు వెళతామని చెప్పటం తెలిసిందే. ఇందులో భాగంగా గవర్నర్‌ను తెలుగుతమ్ముళ్లు కలిశారు కూడా. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ ను కలిశారని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ గడ్డపై పుట్టి.. తెలంగాణ శాసనసభను అగౌరవపరుస్తూ.. జాతీయ గీతాన్ని అవమానించిన వారు గవర్నర్ దగ్గరకు ఎలా వెళతారని నిలదీస్తున్నారు. గవర్నర్‌పై కాగితాలు చించి.. ఉండలు వేసిన వారు.. ఇప్పుడదే గవర్నర్ దగ్గరకు ఏ ముఖం పెట్టుకొని వెళతారంటూ ప్రశ్నిస్తున్నారు. శాసనసభా కార్యకలాపాలు అడ్డుకుంటున్న ఏపీ విపక్షానికి.. ఏపీ మంత్రి కిశోర్‌బాబు హితవు పలుకుతున్న నేపథ్యంలో.. ఆయన చేత తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు పాఠాలు చెప్పాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.