వాగ్దానం చేసేటప్పుడు ధనమూలం ఇదం జగత్ అనేది మర్చిపోతే పదవీ స్వీకారం వరకు బాగానే ఉంటుంది. ప్రజల మనస్సు దోచుకునేందుకు తోచిన రీతిలో హామీ ఇచ్చిన అక్కడి ఆప్ నాయకుడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఇప్పుడిప్పుడే భూమ్మీదకు దిగుతున్నారు. ప్రజలే ఆ పుణ్య కార్యం నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోని సామాన్యుల ద్రుష్టిని మళ్లీంచేందుకు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అక్కర కొస్తాయి. సింగపూర్, ఇస్తాంబుల్, ప్రపంచస్థాయి, నంబర్ వన్, ఆకాశహార్య్మాలు, మెట్రోలు ఒకెత్తయితే తనదారిలో ముళ్ల మాదిరి కనిపించిన వారి శిరచ్ఛేధం, అంగచ్ఛేధం వగైరాలు బహు నేర్పుగా అమలు చేయడం మరో పద్ధతి. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల తాజా ఉదంతం ఈ కోవలోనిదే!. ప్రశ్నించే లక్షణాలు, నైతికత వగైరాలు పుణికిపుచ్చుకున్న ఈ లౌక్యం లోపించిన ఇద్దరూ అరవిందుడి కౌటిల్యానికి బలైపోయారు. అగ్నివేష్, యోగేంద్ర యాదవ్ ఇద్దరూ కూడ సెల్ ఫోన్ సంభాషణల ప్రతిపాదికగా కడగండ్ల పాలయ్యేరు. సెల్ ఫోన్ అంటే కర్ణపిశాచి... దీన్ని నిష్ఠగానే ఆప్ అధినేత ఆవాహన చేసి ఫలితం దక్కించుకున్నాడు.