అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ చేసిన పాపాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పుడు మోయాల్సివస్తుందటున్నారు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. ఢిల్లీ ప్రత్యేక కోర్టు బుధవారం మన్మోహన్ సింగ్ కు సమన్లు జారీచేసిన నేపథ్యంలో జవదేకర్ స్పందిస్తూ... ఇది కాంగ్రెస్ చేసిన స్కాం. కాంగ్రెస్ చేసిన పాపానికి మాజీ ప్రధాని మన్మోహన్ జీ ఎదుర్కొంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఇందులో మన్మోహన్ లాంటి మేధావి పేరు చేర్చాల్సి వచ్చినందుకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. హస్తం పార్టీకి ఇది మరో మచ్చ... ఆ పార్టీకి మద్ధతిచ్చే వాళ్లంతా పునరాలోచన చేసుకోవాలని జవదేకర్ సూచించారు. నేర పూరిత కుట్ర, నమ్మక ఉల్లంఘన, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద కోర్టు మన్మోహన్ తోపాటు మాజీ కార్యదర్శులు పీసీ పరేఖ్, అలోక్ పెర్తి, కుమార మంగళం బిర్లా, సుభేందు అమితాబ్, డి.భట్టాచార్యలకు సమన్లు పంపింది. కాగా, సమన్లు జారీకావటం పట్ల చింతిస్తున్నట్లు మన్మోహన్ తెలిపారు. ఈ విషయంలో తాను చట్టపరమైన పరిశీలనకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. యూపీఏ రెండవసారి అధికారం చేపట్టినప్పుడు బొగ్గుశాఖను ఆయనే పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో హిందాల్కో సంస్థకు కోల్ క్షేత్రాల కేటాయింపులు సిఫారుసులు జరిగినట్లు బయటపడటంతో మన్మోహన్ ఇరుకున్నారు.