సమయం వచ్చినప్పుడు స్పందిస్తానన్న జనసేన అధినేత గళం విప్పాడు. రాజధాని భూసేకరణలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరుపై గర్జించాడు. భూములు కోల్పోయే రైతులకు అండగా నేనుంటా అంటూ ముందుకు వచ్చాడు. భూసేకరణ పేరుతో బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటే రైతుల తరపున పోరాటానికి తాను సిద్ధమేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న ఆయన గుంటూరు జిల్లా బేతకూడిలో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. స్వచ్ఛందంగా భూములిస్తే ఓకేనని, బలవంతంగా మాత్రం లాక్కోరాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన సూచించారు. అలా చేసిన పక్షంలో ఆమరణ దీక్షకు సైతం తాను సిద్ధమని హెచ్చరించారు. వైఎస్ హయాంలో భూములు అమ్మేశారని, ఇదే మళ్లీ పునరావృతమవుతోందన్నారు. ‘‘రాజధాని కోసం 8 వేల ఎకరాలు సరిపోతాయని నా అంచనా. మరి 33 వేల ఎకరాలు ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీకే నిధులు లేనప్పుడు.. రాజధానికి ఎలా వస్తాయని సూటిగా పలు ప్రశ్నలను ఆయన ప్రభుత్వానకి సంధించారు. ఇలా అయితే అసలు సింగపూర్ అంతటి రాజధాని అయ్యేదెప్పుడని చెప్పుకొచ్చారు. ఇంకా రైతుల రుణమాఫీ పూర్తికాలేదని, ప్రజల సంపదను కార్పొరేట్లకు పంచవద్దని చెప్పిన పవన్ కల్యాణ్ ‘మీరు భయపడవద్దు.. మీకు నేను అండగా వున్నా’అని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను చేయాల్సింది చేస్తానని ఘాటుగా హెచ్చరించారు. రైతుల కన్నీళ్లతో ఏర్పడే రాజధాని వద్దని, ఆనందంగా ఇస్తేనే భూములు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. తక్షణమే ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలను కోరుతున్నట్లు తెలిపారు. రైతుల బాధను చూడటానికే ఇక్కడకు తాను వచ్చానని, రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు. ఏపీకి గొప్ప రాజధాని కావాలని తాను కూడా ఆశిస్తున్నానని, డెడ్ లైన్ పేరుతో రైతుల భూములు లాక్కోవద్దని టీడీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలియజేశారు. ఈ క్షణం నుంచి మీ కోసం పోరాడుతానన్నారు. ముందుగా ఉదయం 8:30 గంటలకు శంషాబాద్ నుంచి విమానంలో పవన్‌కల్యాణ్ గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాలోని ఉండవల్లి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటైన సభలో రైతులు తమగోడును జనసేన అధినేతకు వివరించారు. ఇక బేతకూడిలో జరిగిన సభలో రైతులతోపాటే నేలపైన కూర్చుని ఆయన ముచ్చటించారు.