ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహారాష్ట్రలో వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ అక్బరుద్దీన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గత ఆదివారం నాగ్‌పూర్ లోని ఒక సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ... సభలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో శివసేన తన అధికార పత్రిక సామ్నాలో అక్బరుద్దీన్ పై మండిపడింది. రిజర్వేషన్ కావాలంటే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రయత్నించుకోమంటూ ఓ కథనం రాసింది. అంతేకాదు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఒవైసీపై ఫడ్నవీస్ ప్రభుత్వం కేసు నమోదు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. భారతదేశాన్ని తమ మాతృభూమిగా ముస్లిలందరూ గౌరవించాలని కోరింది. మహారాష్ట్రలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్న ఒవైసీకి తీవ్రవాదులు హింసాత్మక చర్యల వల్ల ఎంతమంది హిందువులు నష్టపోయారో తెలుసా అంటూ ప్రశిస్తూ ఆ కథనంలో పేర్కొంది.