ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తొలిసారి గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె పార్లమెంట్ లో తొలిసారి మాట్లాడారు. ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. పునర్విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది. ఆయా హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందా? లేదా? అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్, పెట్రో కెమికల్ కారిడార్, వైజాగ్ టూ చెన్నై హైస్పీడ్ రైలు సౌకర్యం ఇలా మరిన్ని సౌకర్యాల గురించి ఆమె ప్రస్తావించారు. దీనిపై తాను గతంలో ప్రధానికి రెండుసార్లు ఉత్తరాలు రాశానని ఈసందర్భంగా ఆమె గుర్తుచేశారు. అధికారం చేపట్టి 9 నెలలు గడిచినప్పటికీ కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం శోచనీయమని ఆమె అన్నారు. తక్షణమే హామీలన్నీ నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ నేతలకు ఊపు లభించినట్లయ్యింది. తమ అధినేత్రి పార్లమెంట్ సాక్షిగా ఇలా కేంద్రం పై విరుచుకుపడటం అదికూడా ఏపీ కి సంబంధించిన అంశంపైనే కావటంతో ఇక తామూ ధైర్యంగా రంగంలోకి దిగొచ్చని వారంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. మరోవైపు వెంకయ్యనాయుడు లాంటి నేతలు తొమ్మిది నెలల తర్వాతైనా సోనియాగాంధీకి ఏపీ గుర్తుకురావటం హర్షణీయమంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.