ఆయనోక దేశ ప్రధాని. ఇరు దేశాల మధ్య మైత్రి సంబంధాల కోసం క్రుషిచేస్తున్నట్లు చాలా సందర్భాలలో చెప్పుకోచ్చాడు. అలాంటింది ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంతో కాలంగా మత్స్యకారుల విషయంలో ఇరు దేశాల మధ్య నలుగుతున్న అంశానికి మరోసారి అగ్గి అంటించినట్లయ్యింది. భారత మత్స్యకారులు తమ జలాల్లోకి ప్రవేశిస్తే, వారిని నిర్దాక్షిణ్యంగా చంపిపడేస్తామని శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ్ సింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని అలా చంపేందుకు అక్కడి చట్టం అనుమతిస్తుందని కూడా ఆయన చెబుతున్నాడు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న తంతి అనే ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వేడెక్కిస్తున్నాయి. ‘ఎవరైనా నా ఇంటిపై దాడికి ప్రయత్నిస్తే వారిని నేను కాల్చేస్తా. ఈ ఘటనలో అతను చనిపోతే, నాకు చట్టపరమైన రక్షణ ఉంటుంది. మత్స్యకారుల విషయంలోనూ అంతే. మా వాదనకు బలమైన కారణాలు ఉన్నాయి. జాఫ్నా ప్రాంతంలో మా నీరు ఉంది. చేపల వేటకు ఇక్కడికి భారతీయులు వస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో భారత మత్స్య కారులను మా ప్రాంతంలో అడుగు పెట్టనివ్వం’ అని ఆ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. గతంలో లంక సైన్యం అమాయకులపై కాల్పులు జరిపిన ఘటనను ప్రస్తావించగా, అది మానవహక్కుల ఉల్లంఘన కిందకు రాదని , సైన్యం పడవలను ఆపాలని చేసిన హెచ్చరికలను వారు పెడచెవిన పెట్టారని సముదాయించుకున్నారు.