సినిమాలకు నేను దూరం కాలేదు

May 04, 2016 | 12:12 PM | 0 Views
temper
Artist Name :
దాసరి నారాయణ రావు
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
May 04, 2016

Interview Details :

“నటనకు నేను దూరం కాలేదు. కేవలం కొంచెం గ్యాప్‌ మాత్రమే తీసుకున్నాను. లోగడ నేను దర్శకత్వం వహించిన ‘పరమవీరచక్ర’’, మంచి పాత్ర, మంచి పెర్ఫార్మెన్స్‌ చేసిన ‘ఎర్రబస్సు’ చిత్రాలు నన్ను నిరాశపరచడమే ఆ గ్యాప్‌ తీసుకోవడానికి కారణం” అని దర్శకరత్న దాసరి నారాయణరావు స్పష్టంచేశారు. మే4 (బుధవారం) ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పాత్రికేయులతో దాసరి కొద్దిసేపు ముచ్చటించారు.

పవన్‌ సినిమాతో సహా మూడు లైన్లో ఉన్నాయి

ప్రస్తుతం మూడు సినిమాలను చేయాలనుకుంటున్నాం. లోగడ ప్రకటించినట్లుగానే వాటిలో పవన్‌కల్యాణ్‌తో ఒక సినిమాను నిర్మించబోతున్నాను. దీనికి కథ సిద్ధంగా ఉంది. స్క్రిప్ట్‌ వర్క్‌లో త్రివిక్రమ్‌ కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకు దర్శ కుడు ఎవరనే విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచాం. మరో సందర్భంలో ప్రకటిస్తాం. ఇక అందరూ కొత్తవాళ్ళతో ఓ సినిమాను రూపొందించబోతున్నాం. దీనికి నేనే దర్శకత్వం వహిస్తాను. పూర్తిస్థాయి ప్రేమకథతో ఆ చిత్రాన్ని మలచనున్నాం. ఇక మూడో చిత్రానికి వేరే దర్శకుడ్ని ఎంపిక చేయాలనుకుంటున్నాం. ఎవరు మంచి స్క్రిప్ట్‌ తీసుకుని వస్తే అలాంటి దర్శకులకు అవకాశం కల్పిస్తాం.

పవన్‌ది మాటమీద నిలబడే వ్యక్తిత్వం

అంకితభావం, మాటమీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్‌కల్యాణ్‌. అలాంటి వ్యక్తి రాజకీయ ప్రవేశం ఆనందదాయకం. అయితే రెండు, మూడు సినిమాల తర్వాత నటనకు దూరమవుతానని ఆయన ప్రకటించడంపై నా అభిప్రాయం ఏమిటంటే…రెండు పడవలపై ప్రయాణం చేయకూడదనేది నా భావన.

వాస్తవిక పరిస్థితులే నేపథ్యం

ప్రేమకథల్లో మారిన ట్రెండ్‌, మారని ట్రెండ్‌ అనే రెండు రకాలున్నాయి. మనిషి కనిపించగానే ఐ లవ్‌ యు చెప్పే కథలను నేను తీయను. యూత్‌కు బాగా దగ్గరగా ఉండే కథను రూపొందిస్తాను. ప్రతి అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఎదురయ్యే వాస్తవిక పరిస్థితులే నేను తీయబోయే సినిమాకు కథావస్తువు. ఈ కథ నేను ఇప్పుడు రాసుకుంది కాదు. కొన్నేళ్ళ క్రితం రామానాయుడుగారితో కలసి చేయాలనుకున్న సినిమాకు సంబంధించి లోగడ రాసుకున్న కథ ఇది. ఇంకా చెప్పాలంటే…రామానాయుడికి చాలాబాగా నచ్చిన కథ. ఆయన అనారోగ్య కారణంతో అప్పట్లో చేయలేకపోయాం.

అభిరుచిలో మార్పొచ్చింది

ప్రేమ అంటే తల్లిదండ్రులను తిట్టడం, వెటకారంగా మాట్లాడటం కాదు. అలాంటి సినిమాల వల్ల ప్రేక్షకులు సినిమాలు చూడటం మానేశారు. అలాగే ఆరు ఫైట్లు, ఆరు పాటలుంటే ప్రేక్షకులు సినిమాలు చూస్తారనుకుంటే పొరపాటే. గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. ఇందుకు ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సినిమాచూపిస్త మావ’, ‘కళ్యాణవైభోగమే’, ‘క్షణం’, ‘ఊపిరి’ వంటి చిత్రాలు చక్కటి ఉదాహరణలుగా నిలుస్తాయి.

నిర్మాతలు అవగాహనతో రావాలి

సినిమాకు సంబంధించి ఎలాంటి అవగాహన కానీ అనుభవం కానీ లేకుండా నూతన నిర్మాతలు సినిమాలను తీస్తున్నారు. గతంలో నిర్మాతకు ప్రతీ శాఖపై అవగాహన ఉండేది. నేడు స్క్రిప్ట్‌ అంటే ఏంటో తెలియని నిర్మాతలు కూడా ఉన్నారు. అనుభవరాహిత్యంతో సినిమాలు చేయడం వల్లనే ఫలితాలు చాలా నిరాశజనకంగా ఉంటున్నాయి.

మహాభారతం నా చివరి సినిమా

మహాభారతాన్ని ఐదు భాగాలుగా తెరకెక్కించాలన్నదే నా ఆశయం. ఇప్పటికే రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవభాగం స్క్రిప్ట్‌ సిద్ధమవుతోంది. ఈలోగా ఎవరో ‘మహాభారతం’ సినిమాను తీయబోతున్నట్లు విన్నాను. ఏదిఏమైనప్పటికీ, దర్శకుడిగా నా చివరి సినిమా అదే అవుతుంది. దాదాపు 50 ఏళ్ళుగా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇంత సుదీర్ఘకాలం కొనసాగడం ఎంతో సంతృప్తినిచ్చింది. అందుకే ఆ చిత్రం తర్వాత దర్శకత్వానికి దూరం కావాలనుకుంటున్నాను.

రోడ్డు ఎక్కడం కరెక్ట్‌ కాదు

సినిమాలు సరిగ్గా ఆడకపోతే పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయాలనడం కరెక్ట్‌ కాదు. నలభై ఏళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్సే పిలిచి సినిమా లకు ఫైనాన్స్‌ ఇచ్చేవారు. ఒకవేళ బయ్యర్స్‌ నష్టపోతే హీరోలు తాము చేయబోయే తదుపరి సినిమాకు పారితోషికాన్ని తగ్గించుకునేవారు. ఈ పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కొత్తగా వచ్చింది కాదు. హీరో, దర్శకుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా హిట్‌ అయితే వారు చేయబోయే తదుపరి సినిమాను ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఆ సినిమాకు ఇరవై, ముఫ్ఫై శాతం నష్టం వస్తే దర్శక, నిర్మాతలు, హీరోలు ఏమీ చేయనక్కరలేదు. అదే సినిమా ఘోరంగా ఫెయిలయితే మాత్రం కొంత నష్టాన్ని పూడ్చాలి. గతంలో రజనీకాంత్‌ అల్లు అరవింద్‌ ఇదే విధంగానే ఇచ్చారు. ఈ మధ్యకాలంలో పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, వినాయక్‌, శ్రీనువైట్ల కూడా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులిచ్చారు. మనల్ని నమ్మి సినిమా కొంటున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డబ్బు అడగడమూ తప్పుకాదు, ఇవ్వడమూ తప్పు కాదు. రోడ్డుకు ఎక్కడం మాత్రం కరెక్ట్‌ కాదు.

సినిమా హబ్‌గా హైదరాబాద్‌

హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. దీనికోసం తమిళ, కన్నడ, ఉత్తరాది భాషల సినీరంగాలతో పాటు బాలీవుడ్‌ పరిశ్రమకు సంబంధించిన సినిమాల చిత్రీకరణ కోసం ఇక్కడకు రావాలన్నదే ఈ కార్యాచరణ ఉద్దేశ్యం.సుమారుగా రెండు వేల ఎకరాల్లో సినిమా హబ్‌ను ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం దీనికి కమిటీ వేసి మా సలహాల కోసం పిలిస్తే కచ్చితంగా వెళ్తాను.

సినిమాను నేడు ఎక్కడైనా తీయవచ్చు

సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలని ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చు. దానికోసం పరిశ్రమను షిప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. నేటి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను ఎక్కడైనా తీయవచ్చు. అలానే సినిమాకు సంబంధించిన కొన్ని ఫంక్షన్లను ఫలానా చోటే చేయాలనే నిబంధన ఏమీలేదు. సౌలభ్యాన్ని బట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు.

చిన్న చిత్రాలకు ఒక షో

చిన్న చిత్రాలను విడుదల చేయాలంటే థియేటర్ల సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే రోజుకు నాలుగు ఆటల ప్రదర్శనను ఐదు ఆటలుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రత్యేకించి నాలుగు గంటల షోను చిన్న చిత్రాలకు కేటాయించాలని నిర్ణయించారు. అలా వేయకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే దానికి ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ కావాలి. చిన్నఊర్లో ఉన్న థియేటర్‌ కూడా ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ కిందకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ” ఇంటర్వ్యూని ముగించారు.

goldnsilver

తాజా వార్తలు