తరుణ్ కు స్కెచ్ వేసింది మాజీ స్నేహితుడే!

May 20, 2016 | 11:02 AM | 19 Views
ప్రింట్ కామెంట్
tarun-gogoi-himantha-biswasarma-niharonline

అస్సాం ఘన విజయం బీజేపీలో నూతనోత్సాహం నింపింది. మిగతా రాష్ట్రాల ఫలితాలను పక్కనబెడితే ఇక్కడి విజయం మాత్రం ఆ పార్టీకి నిజంగా ప్రత్యేకమే. ఈశాన్య భారతంలో ఇంతవరకు జెండా ఎగరేయని కమలం అక్కడ వికసించడంతోపాటు, వరుసగా గెలిచి గద్దె మీద కూర్చున్న తరుణ్ గొగోయ్ కి భంగపాటు కలిగించింది. అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న యువనేత సర్బానంద సోనోవాల్ ను బీజేపీ తన పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు కేవలం కొద్ది రోజులు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రచారంలోనూ ఆయనకు ఫ్రీ హ్యాండిచ్చింది జాతీయ నాయకత్వం.

                ఇక అవినీతి మకిలి అంటని నేతగా పేరు తెచ్చుకున్న సోనోవాల్ పార్టీ పురోభివృద్ధికి, గెలిచేందుకు కఠోరంగా శ్రమ పడ్డారు. అయితే కేవలం ఒక్క సోనోవాల్ తోనే బీజేపీకి విజయం దక్కలేదు. కాంగ్రెస్ ఘోర పరాభవానికి, ఆ పార్టీ మాజీ నేత రచించిన వ్యూహమే కారణమన్నది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. గతేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు హిమంత విశ్వశర్మ. అంతకుముందు కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరించడమే కాదు, స్వయానా ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ కి ఆప్తుడు కూడా. కీలక అంశాల్లో నిర్ణయాలు విశ్వశర్మను సంప్రదించాకే గోగోయ్ తీసుకునేవాడు. కానీ, మారిన రాజకీయ పరిణామాలు, ఆపై గోగోయ్ వ్యవహరశైలి మారటంతో కలత చెంది పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయం కండువా కప్పేసుకున్నారు. అంసతృప్తి వెల్లగక్కిన సమయంలో కారణాలపై ఆరా తీయని కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వశర్మ వాదనను పట్టించుకోకుండా, గొగోయ్ కే మద్దతు పలికింది. దాని పర్యవసానమే ఇప్పుడు ఇలా దారుణంగా ఓటమిపాలవటానికి కారణమైంది. సోనోవాల్ లోని నిజాయతీ, విశ్వశర్మ వ్యూహాలే అసోంలో బీజేపీ విజయానికి బాటలు వేశాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ