“నటనకు నేను దూరం కాలేదు. కేవలం కొంచెం గ్యాప్ మాత్రమే తీసుకున్నాను. లోగడ నేను దర్శకత్వం వహించిన ‘పరమవీరచక్ర’’, మంచి పాత్ర, మంచి పెర్ఫార్మెన్స్ చేసిన ‘ఎర్రబస్సు’ చిత్రాలు నన్ను నిరాశపరచడమే ఆ గ్యాప్ తీసుకోవడానికి కారణం” అని దర్శకరత్న దాసరి నారాయణరావు స్పష్టంచేశారు. మే4 (బుధవారం) ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పాత్రికేయులతో దాసరి కొద్దిసేపు ముచ్చటించారు.
పవన్ సినిమాతో సహా మూడు లైన్లో ఉన్నాయి
ప్రస్తుతం మూడు సినిమాలను చేయాలనుకుంటున్నాం. లోగడ ప్రకటించినట్లుగానే వాటిలో పవన్‌కల్యాణ్‌తో ఒక సినిమాను నిర్మించబోతున్నాను. దీనికి కథ సిద్ధంగా ఉంది. స్క్రిప్ట్ వర్క్‌లో త్రివిక్రమ్ కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకు దర్శ కుడు ఎవరనే విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచాం. మరో సందర్భంలో ప్రకటిస్తాం. ఇక అందరూ కొత్తవాళ్ళతో ఓ సినిమాను రూపొందించబోతున్నాం. దీనికి నేనే దర్శకత్వం వహిస్తాను. పూర్తిస్థాయి ప్రేమకథతో ఆ చిత్రాన్ని మలచనున్నాం. ఇక మూడో చిత్రానికి వేరే దర్శకుడ్ని ఎంపిక చేయాలనుకుంటున్నాం. ఎవరు మంచి స్క్రిప్ట్ తీసుకుని వస్తే అలాంటి దర్శకులకు అవకాశం కల్పిస్తాం.
పవన్‌ది మాటమీద నిలబడే వ్యక్తిత్వం
అంకితభావం, మాటమీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్‌కల్యాణ్. అలాంటి వ్యక్తి రాజకీయ ప్రవేశం ఆనందదాయకం. అయితే రెండు, మూడు సినిమాల తర్వాత నటనకు దూరమవుతానని ఆయన ప్రకటించడంపై నా అభిప్రాయం ఏమిటంటే…రెండు పడవలపై ప్రయాణం చేయకూడదనేది నా భావన.
వాస్తవిక పరిస్థితులే నేపథ్యం
ప్రేమకథల్లో మారిన ట్రెండ్, మారని ట్రెండ్ అనే రెండు రకాలున్నాయి. మనిషి కనిపించగానే ఐ లవ్ యు చెప్పే కథలను నేను తీయను. యూత్‌కు బాగా దగ్గరగా ఉండే కథను రూపొందిస్తాను. ప్రతి అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఎదురయ్యే వాస్తవిక పరిస్థితులే నేను తీయబోయే సినిమాకు కథావస్తువు. ఈ కథ నేను ఇప్పుడు రాసుకుంది కాదు. కొన్నేళ్ళ క్రితం రామానాయుడుగారితో కలసి చేయాలనుకున్న సినిమాకు సంబంధించి లోగడ రాసుకున్న కథ ఇది. ఇంకా చెప్పాలంటే…రామానాయుడికి చాలాబాగా నచ్చిన కథ. ఆయన అనారోగ్య కారణంతో అప్పట్లో చేయలేకపోయాం.
అభిరుచిలో మార్పొచ్చింది
ప్రేమ అంటే తల్లిదండ్రులను తిట్టడం, వెటకారంగా మాట్లాడటం కాదు. అలాంటి సినిమాల వల్ల ప్రేక్షకులు సినిమాలు చూడటం మానేశారు. అలాగే ఆరు ఫైట్లు, ఆరు పాటలుంటే ప్రేక్షకులు సినిమాలు చూస్తారనుకుంటే పొరపాటే. గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. ఇందుకు ‘భలే భలే మగాడివోయ్’, ‘సినిమాచూపిస్త మావ’, ‘కళ్యాణవైభోగమే’, ‘క్షణం’, ‘ఊపిరి’ వంటి చిత్రాలు చక్కటి ఉదాహరణలుగా నిలుస్తాయి.
నిర్మాతలు అవగాహనతో రావాలి
సినిమాకు సంబంధించి ఎలాంటి అవగాహన కానీ అనుభవం కానీ లేకుండా నూతన నిర్మాతలు సినిమాలను తీస్తున్నారు. గతంలో నిర్మాతకు ప్రతీ శాఖపై అవగాహన ఉండేది. నేడు స్క్రిప్ట్ అంటే ఏంటో తెలియని నిర్మాతలు కూడా ఉన్నారు. అనుభవరాహిత్యంతో సినిమాలు చేయడం వల్లనే ఫలితాలు చాలా నిరాశజనకంగా ఉంటున్నాయి.
మహాభారతం నా చివరి సినిమా
మహాభారతాన్ని ఐదు భాగాలుగా తెరకెక్కించాలన్నదే నా ఆశయం. ఇప్పటికే రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవభాగం స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. ఈలోగా ఎవరో ‘మహాభారతం’ సినిమాను తీయబోతున్నట్లు విన్నాను. ఏదిఏమైనప్పటికీ, దర్శకుడిగా నా చివరి సినిమా అదే అవుతుంది. దాదాపు 50 ఏళ్ళుగా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇంత సుదీర్ఘకాలం కొనసాగడం ఎంతో సంతృప్తినిచ్చింది. అందుకే ఆ చిత్రం తర్వాత దర్శకత్వానికి దూరం కావాలనుకుంటున్నాను.
రోడ్డు ఎక్కడం కరెక్ట్ కాదు
సినిమాలు సరిగ్గా ఆడకపోతే పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయాలనడం కరెక్ట్ కాదు. నలభై ఏళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్సే పిలిచి సినిమా లకు ఫైనాన్స్ ఇచ్చేవారు. ఒకవేళ బయ్యర్స్ నష్టపోతే హీరోలు తాము చేయబోయే తదుపరి సినిమాకు పారితోషికాన్ని తగ్గించుకునేవారు. ఈ పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కొత్తగా వచ్చింది కాదు. హీరో, దర్శకుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా హిట్ అయితే వారు చేయబోయే తదుపరి సినిమాను ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఆ సినిమాకు ఇరవై, ముఫ్ఫై శాతం నష్టం వస్తే దర్శక, నిర్మాతలు, హీరోలు ఏమీ చేయనక్కరలేదు. అదే సినిమా ఘోరంగా ఫెయిలయితే మాత్రం కొంత నష్టాన్ని పూడ్చాలి. గతంలో రజనీకాంత్ అల్లు అరవింద్ ఇదే విధంగానే ఇచ్చారు. ఈ మధ్యకాలంలో పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, వినాయక్, శ్రీనువైట్ల కూడా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులిచ్చారు. మనల్ని నమ్మి సినిమా కొంటున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డబ్బు అడగడమూ తప్పుకాదు, ఇవ్వడమూ తప్పు కాదు. రోడ్డుకు ఎక్కడం మాత్రం కరెక్ట్ కాదు.
సినిమా హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. దీనికోసం తమిళ, కన్నడ, ఉత్తరాది భాషల సినీరంగాలతో పాటు బాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన సినిమాల చిత్రీకరణ కోసం ఇక్కడకు రావాలన్నదే ఈ కార్యాచరణ ఉద్దేశ్యం.సుమారుగా రెండు వేల ఎకరాల్లో సినిమా హబ్‌ను ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం దీనికి కమిటీ వేసి మా సలహాల కోసం పిలిస్తే కచ్చితంగా వెళ్తాను.
సినిమాను నేడు ఎక్కడైనా తీయవచ్చు
సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలని ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చు. దానికోసం పరిశ్రమను షిప్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేటి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను ఎక్కడైనా తీయవచ్చు. అలానే సినిమాకు సంబంధించిన కొన్ని ఫంక్షన్లను ఫలానా చోటే చేయాలనే నిబంధన ఏమీలేదు. సౌలభ్యాన్ని బట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు.
చిన్న చిత్రాలకు ఒక షో
చిన్న చిత్రాలను విడుదల చేయాలంటే థియేటర్ల సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే రోజుకు నాలుగు ఆటల ప్రదర్శనను ఐదు ఆటలుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రత్యేకించి నాలుగు గంటల షోను చిన్న చిత్రాలకు కేటాయించాలని నిర్ణయించారు. అలా వేయకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే దానికి ఆన్‌లైన్ ప్రాసెస్ కావాలి. చిన్నఊర్లో ఉన్న థియేటర్ కూడా ఆన్‌లైన్ ప్రాసెస్ కిందకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ” ఇంటర్వ్యూని ముగించారు.
నటుడిగా స్థిరపడాలంటే అంత ఈజీ కాదనీ, రాజకీయ బ్యాక్‌డ్రాప్ అస్సలు ఉపయోగపదని అంటున్నాడు నారా రోహిత్ అంటున్నాడు. ఇదే నెలలో రెండు సినిమాలతో వస్తున్నాడు ఈ నారా వారబ్బాయి ముందుగా తుంటరిగా రాబోతున్నాడు. తమిళంలో ఎ.ఆర్. మురగదాస్ కథ అందించిన సినిమా 'మాస్ కరాటే'. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుంటరి'గా రీమేక్ చేశారు. నాగేంద్రకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌తో చిట్‌చాట్.
తుంటరిలో మీకు నచ్చిన అంశం?
హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎప్పటినుంచో అలాంటి పాత్ర చేయాలనుకున్నాను. మురుగదాస్ కథ అందించిన తమిళంలో 'మాస్ కరాటే' చూశాక , నాకు బాగా నచ్చింది.
తెలుగులో ఏమైనా మార్పులు చేశారా?
అసలు కథకు మా సినిమాకు చాలా మార్పులు చేశాం. ప్రేమ సన్నివేశాలు పూర్తిగా మార్చేశాం. ఎమోషనల్ సన్నివేశాలు పెంచాం.
దర్శకుడు నాగేంద్ర వరుస ప్లాప్‌లో వున్నాడుగదా?
దర్శకుడు కుమార్ నాగేంద్ర ఇంతకుముందు 'జోరు' చేశారు. ప్లాప్ అయింది. అంతకుముందు ఆయన చేసిన 'గుండెల్లో గోదారి'కి పేరు వచ్చింది. తనలో తగిన ప్రతిభ వుందని తెలిసి తీసుకున్నాం.
బాక్సింగ్ కోసం శిక్షణ తీసుకున్నారా?
ఈ సినిమాలో బాక్సర్‌గా కన్పిస్తా. సినిమాలో ఓ భాగమే. నిజమైన బాక్సర్ కాదు. దీనికోసం ప్రత్యేక శిక్షణ అంటూ ఏమీలేదు. అదికూడా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది.
సినిమాల స్పీడ్ పెంచారే?
వరుసగా చేస్తున్నానని ఎలాంటి గందరగోళంలో లేను. ప్రతి పాత్ర అనుకున్నట్లుగా డిజైన్ చేసి చేస్తున్నా. ఇంతకు ముందు ఏడాదికి ఒక సినిమా చేసేవాడ్ని. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నానంటే సమయం చిక్కింది.
ఒకే నెలలో రెండు చిత్రాలు విడుదల టెన్షన్‌లేదా?
ఇప్పటి స్థితిలో సినిమా లైఫ్.. రెండు వారాలే. సినిమా సినిమాకు రెండు వారాలు గ్యాప్ వుంటే చాలు. అందుకే ఈనెల 11న తుంటరి.. 25న సావిత్రి విడుదల చేస్తున్నాం. రెండూ భిన్నమైన కాన్సెప్ట్‌లే.
సిక్స్‌ప్యాక్ చేస్తానని గతంలో చెప్పారు?
అనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. అయితే జూన్‌లో ఓ సినిమా మొదలవుతుంది. దీనికోసం ఖచ్చితంగా బరువు తగ్గాలి. పాత్ర అలాంటిది. సో... మూడు నెలలు గ్యాప్ వుందికాబట్టి.. సిక్స్‌ప్యాక్ ఆ సినిమాకు చూపిస్తా.
సినిమాలపై రాజకీయ ప్రభావం వుందా?
లేనేలేదు. మా పెద్దనాన్న ముఖ్యమంత్రి కదా! అని నేను అనుకున్నట్లు ఏదీ జరగదు. రాజకీయ ప్రభావమే వుంటే రాజమౌళి వంటి అగ్ర దర్శకులతో పనిచేసేవాడ్ని. నేను కథల్నే నమ్ముతాను.
బాలకృష్ణ వందో సినిమాలో నటిస్తున్నారని వార్త వచ్చింది?
ఆ విషయంలో ఇంకా క్లారిటీలేదు. కానీ సినిమాలో నటించమని అడిగితే ఏ పాత్ర అనేది ఆలోచించకుండా ఖచ్చితంగా చేస్తా.
తదుపరి చిత్రాలు?
'సావిత్రి' తర్వాత 'పండుగలా వచ్చాడు' సినిమా జూన్‌లో విడుదలవుతుంది. ఆ తర్వాత 'అప్పట్లో ఒకడుండేవాడు', 'నీది నాది ఒకే కథ' సినిమాలు చిత్రీకరణ పూర్తయ్యాయి. ఇవి కాకుండా మరో ఆరు సినిమాలు చేయాల్సివుంది అని చెప్పి ముగించారు.
పాత్రల ఎంపిక విషయంలో సౌత్ బ్యూటీ సమంతకు పెద్దకు పట్టింపులు ఉండవు. పెళ్లైన యువతి కేరక్టర్లే కాదు.. ఏకంగా నాగార్జున అమ్మగా కూడా చేసి మెప్పించేయగల కెపాసిటీ ఆమె సొంతం. ప్రస్తుతం ధనుష్ తో నవ మన్మధుడు (తంగమగన్) మూవీలో గృహిణి పాత్ర పోషిస్తోంది ముద్దుగుమ్మ. ఎల్లుండే(శుక్రవారం) ఈ సినిమా రిలీజ్. మరి కేరక్టర్ల విషయంలో ఆమె తీసుకునే జాగ్రత్తలేంటి ? ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ కి ఆమె ఇచ్చి ఇంటర్వ్యూ...
కేరక్టర్స్ ఎంపికలో సమంత స్పెషాలిటీ ఏంటి ?
నేను విభిన్నమైన రోల్స్ ని ప్రిఫర్ చేస్తాను. తంగమగన్ లో చేసిన రోల్ కూడా అలాంటిదే. -
నవమన్మథుడు లో పాత్ర ఎలా ఉంటుంది?
ఇదో పరిణతి చెందిన మధ్య తరగతి గృహిణి పాత్ర. ఇలాంటి రోల్స్ చేయగం కొంచెం కష్టమైన విషయమే. ఈ పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ధనుష్ తో మొదటిసారి నటిస్తున్నారు కదా ?
ధనుష్ లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ తో చేయడం చాలా సంతోషం కలిగించే విషయం. వరుసగా అతనితో మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను. వేట్రిమారన్ తీస్తున్న వాడా చెన్నై రెండు భాగాలుగా రానుంది. ఈ రెండింటిలోనూ నేను నటిస్తున్నాను.
అమీ జాక్సన్ తో కలిసి నటించడంపై?
ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. నిజానికి విజయ్ తో కలిసి తెరి లోనూ ఇద్దరం కలిసి నటిస్తున్నాం. తను చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. అమీ ఒకే షాట్ లో డైలాగ్స్ అన్నీ చెప్పేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది.
మరో హీరోయిన్ తో స్క్రీన్ పంచుకోవడం ఇబ్బంది కాదా ?
ఈ మూవీస్ లో మా ఇద్దరి కేరక్టర్స్ చాలా విభిన్నమైనవి. మేమిద్దరం కలిసి పని చేస్తుంన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. తను నన్ను నేను తనని ఎంతో గౌరవిస్తాం.
డైరెక్టర్ వేల్ రాజ్ గురించి చెప్పండి ?
వేల్ రాజ్ చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు. రికార్డ్ టైంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇలాంటి మూవీని ఇంతమంది యాక్టర్స్ తో 44 రోజుల్లో షూట్ చేయడం మామూలు విషయం కాదు.
ధనుష్ తో కాకుండా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
విక్రమన్ దర్శకత్వంలో సూర్యతో కలిసి 24, అట్లీ దర్శకత్వంలో విజయ్ తో తెరి చేస్తున్నాను. ఇక తెలుగులో నితిన్ తో అ..ఆ.. తో పాటు సూపర్ స్టార్ మహేష్ సరసన బ్రహ్మోత్సవంలో నటిస్తున్నా అంటూ ముగించింది సమంత.
ఏమైందీ వేళ అంటూ మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి, ఆ తరవాత రచ్చ..రచ్చ చేసాడు దర్శకుడు సంపత్ నంది. కానీ ఆ తరువాత మళ్లీ పెద్దగా సందడి లేదు. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ తయారీ చేసి అందించాడు కానీ తెరకెక్కించలేకపోయాడు. ఆపై నిర్మాతగా మారి గాలిపటం అంటూ ఓ యూత్ ఫిల్ సినిమాను అందించే ఫ్రయత్నం చేసాడు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా బెంగాల్ టైగర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనతో నీహార్ ఆన్ లైన్ చిట్ చాట్.
టైటిల్ తోనే మాగ్జిమమ్ హైప్ తెచ్చేశారే?
టైటిల్ అనౌన్స్ చేయగానే అన్ని వైపుల నుంచి మంచి టాక్ వినిపించింది. సినిమా కూడా అలాగే వచ్చింది. ప్రేక్షకులు టైటిల్ ను బట్టి సినిమా మీద పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు.
పెద్ద హీరోతో చిత్రం అంటే ట్విస్ట్ లు, ఎమోషన్లు, ఇలా చాలా ఉన్నాయా?
అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా. గొప్ప కథ, గొప్ప సినిమా తీసా అని నేను చెప్పను. రవితేజ గారి అభిమానులు, ఆయన సినిమాలు లైక్ చేసేవాళ్లు ఏం ఆశిస్తారో అవన్నీ జోడించిన సినిమా.
హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ ఓ రేంజ్ లో ఉన్నట్లు ఉంది?
అందాలు, గ్లామర్ తో సినిమా ఆడదండీ..అలా అయితే ఒక్కో సినిమాలో నలుగురు హీరోయిన్లను కూడా పెట్టుకోవచ్చు. రచ్చ ఆడింది అంటే కారణం ఆ సినిమాలో వున్న పెర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే. అలాంటి స్క్రీన్ ప్లే నే ఈ సినిమాలో కూడా వుంటుంది. ఇక గ్లామర్ అంటారా..అదంతా ఈ సినిమాకు కాదు, ఏ సినిమాకైనా సపోర్టింగ్ ఎలిమెంట్ మాత్రమే.
ట్రైలర్ లో బురద ఫైట్ హింస ఎక్కువ చూపినట్లు ఉన్నారు?
అదేం లేదు. కేవలం నాలుగు నిమషాలు..అది కూడా కొత్తగా వుంటుంది.
బ్రహ్మీ, పృధ్వీ, పోసాని ల గురించి?
సినిమా ఫన్,మాస్ ఎలిమెంట్స్ అంతా హీరో మీదే వుంటాయి..అయితే దానికి పక్కన సపోర్టింగ్ గా ఈ ముగ్గురు వుంటారు.
సినిమా ఫలితాలు తారుమారు అవుతున్నాయి కదా? మరి మీకు టెన్షన్ లేదా?
సినిమా తీరు తెన్నులు మారిపోయాయి. బడ్జెట్ మారింది. వన్ వీక్ లోనే డబ్బులు రావాల్సి వస్తోంది. అందువల్ల డైరక్టర్ బాధ్యత పెరిగింది. మీరన్నట్లు ప్రతి సినిమాను మొదటి సినిమా అన్నంత జాగ్రత్తగా చేయాల్సి వుంది. నాకూ తెలుసు..ఈ సినిమా హిట్ కొట్టి తీరాలి అని. అందుకే ఎంత జాగ్రత్త పడాలో అంతా తీసుకున్నాను. హిట్ కొడుతున్నాను.
నటుడు బోమన్ ఇరానీ పాత్ర గురించి?
ముఖ్యమంత్రి పాత్ర..కాస్త పెద్ద తరహాగా, హుందాగా వుండాలి. అందుకు ఆయనను తీసుకున్నాం,. అంతకు మించి మరేం లేదు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ మారినట్లు ఉంది?
ఈ సినిమాలో రవితేజ చాలా అందంగా కనిపిస్తారు. ఇది చెప్పడం కాదు..అబద్ధం చెప్పి, ఎంత సేపో దాయలేం కదా..ఇప్పటికే టీజర్లు, ట్రయిలర్లు, మేకింగ్ విడియోలు, సాంగ్ విడియోలు అన్నీ వదిలాం..వాటిల్లో చూసే వుంటారుగా
ప్రచారం విభిన్నంగా చేశారు? మరి ఫలితం వస్తుందనుకుంటున్నారా?
నూటికి నూరుపాళ్లు..మేం ఏం ప్రచారం చేసామో, ఏం చెప్పామో అదే సినిమాలో వుంటుంది. మొదట్నించీ చెబుతున్నా, ఓ మాంచి నాన్ వెజ్ మీల్స్ పెడుతున్నాం సగటు ప్రేక్షకుడికి అంటూ ముగించాడు సంపత్ నంది.
ఒక యోగా ట్రైనర్‌గా తమ శరీరాకృతి కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే వ్యక్తులను చాలామందిని చూసాను. అలాంటివారి జీవితాల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కిన చిత్రమే 'సైజ్ జీరో' అంటోంది టాలీవుడ్ స్వీటి అనుష్క. ఆమె టైటిల్ పాత్రలో నటించిన చిత్రం "సైజ్ జీరో". రేపు అంటే నవంబర్ 27న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి, ఆమె బరువు కోసం ఎంతగా కష్టపడిందీ తదితర విశేషాల గురించి అనుష్క చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే..!!
సైజ్ జీరో కథ మీకెలా అన్పించింది..
మా కథా రచయిత అయిన కనికా థిల్లాన్ తనకు పరిచయమున్న ఒక కుటుంబంలోని ఓ అమ్మాయి నిజజీవితం నుంచి స్ఫూర్తి పొంది "సైజ్ జీరో" కథను సిద్ధం చేసింది. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయిని వారి కుటుంబం ఏ విధంగా ట్రీట్ చేస్తుంది. పెళ్లివరకూ సన్నగా ఉండాలని నానారకాలుగా ఇబ్బంది పెడుతుంది అనేది క్లుప్తంగా చిత్ర కథాంశం.
కథను ఎలివేట్ చేయాలంటే స్టార్ అవసరం కదా...
ఇటువంటి కథలు ఎక్కువమంది జనాలకు చేరువయ్యేలా చేయాలంటే స్టార్ హీరోయిన్ అవసరం. అందుకోసమే నన్ను సంప్రదించారు. కథ బాగా నచ్చడంతో నేనూ సరేనన్నాను. తొలుత మేకప్‌తో కవర్ చేద్దామనుకొన్నాం. అయితే ఫోటోషూట్ చేసిన తర్వాత నా బాడీ క్యారెక్టర్‌కు సూట్ అవ్వలేదనిపించింది. అందుకే తర్వాత 17 కేజీలు పెరిగాను.
ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా ఏమైనా చేశారా...?
"సైజ్ జీరో"లో అధికబరువున్న అమ్మాయిగా నటించడం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నేను యోగా నేర్పించే సమయంలో నా వద్దకు చాలామంది వచ్చేవారు. వాళ్ల శరీరాకృతి కారణంగా ఎప్పుడూ చాలా ఆందోళనకు లోనవుతుండేవారు. "సైజ్ జీరో"లో నా నటనకు స్ఫూర్తి వాళ్లే. కెరీర్ పీక్ టైంలో ఇలాంటి క్యారెక్టర్ చేయడంపైన...?
ఇదే విషయాన్ని చాలామంది అడుగుతున్నాను. ఈ కథ విన్నాక కూడా సినిమా చేయకపోతే చాలా బాధపడాల్సి వచ్చేది. నా మనసుకు హత్తుకున్న కథ ఇది. ఒక అమ్మాయి మానసికంగా ఎంత దృఢంగా ఉండాలనే విషయాన్ని ఎంతో హృద్యంగా చెప్పిన సినిమా. "బాహుబలి, రుద్రమదేవి" చిత్రాల తర్వాత ఒక నటిగా పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా 'సైజ్ జీరో'.
వ్యంగ్యంగా ఉంటుందా... లావు అనేది సబ్జెక్టు కదా...
లావున్న అమ్మాయి ప్రేమకథ అంటే.. లావుగా ఉన్న అమ్మాయిపై కుళ్ళు జోకులతో నింపేయలేదు. అధిక బరువు ఉన్నంత మాత్రాన తక్కువగా చూడాల్సిన అవసరం లేదు చెప్పనున్నాం. అలాగని ఇదేదో మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ అమితంగా ఆకట్టుకొనే చిత్రమిది.
తిండి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు...
హీరోయిన్ అంటే ఫిట్‌గా ఉండటం కంపల్సరీ కదా. అందుకని నిన్నమొన్నటివరకు తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనేదాన్ని. ఏం తిన్నాసరే అందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయ్ అని కేలిక్యులేట్ చేసుకొని మరీ తినేదాన్ని. అయితే.. 'సైజ్ జీరో' కోసం బరువు పెరిగే క్రమంలో అలాంటి కేలిక్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి మనసుకు నచ్చిన తిండిని మనస్పూర్తిగా తినేదాన్ని.
దర్శకుడు ప్రకాష్ గురించి...
ప్రకాష్ కోవెలమూడి మనసున్న దర్శకుడు. ఏదైనా కథ తన మనసుకి నచ్చితే తప్ప దర్శకత్వం చేయాలనుకోడు. కథ పట్ల తనకు కమాండ్ ఉంది. ఆ కారణంగా ఏ సన్నివేశంలో ఏ పాత్రధారి ఏవిధంగా ప్రవర్తించాలనే విషయంలో ప్రకాష్‌కు క్లారిటీ ఉంది. దాంతో మా అందరికీ నటీంచడం చాలా సుళువైపోయింది.
మీరు సైజ్ జీరో కావాలనుకుంటున్నారా...?
"సైజ్ జీరో" అనేది ఒకప్పుడు ఫ్యాషన్ కావచ్చు. అలాగని అందరూ సైజ్ జీరో" ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకోవడం తప్పు. ఎవరి ఐడెంటిటీ వాళ్లకు ఉంటుంది. నేనైతే "సైజ్ జీరో" ఫిజిక్ కోసం అస్సలు ప్రయత్నించను. ఉన్నంతలో ఫిట్‌గా ఉండడమే నాకిష్టం.
సోషల్ మీడియా వైపు రావట్లేదు...
ప్రెజంట్ హీరోయిన్లందరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు, నాకు కూడా ఉండాలనే ఉంటుంది కానీ.. సోషల్ మీడియాలోకి ఒక్కసారి వచ్చామంటే, మన అభిమానులందరికీ సమాధానాలు ఇస్తూ ఉండాలి. నాకు అంత టైమ్ లేదు. షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్లానా, హ్యాపీగా పడుకున్నానా అన్నట్లుగా ఉంటుంది నా వ్యవహారశైలి.
కీరవాణి గారంటే మీకు ప్రత్యేకమైన అభిమానమని అంటుంటారు...
ఇండస్ట్రీలో నాకు బాగా సన్నిహితులైనవారిలో కీరవాణి ఒకరు. ఒక సంగీత దర్శకుడిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే.. ఆయనింటికి వెళ్లి ఒక్కసారి ఆయన్ను మనసారా కౌగిలించుకొంటే మనసులో ఉన్న బాధంతా ఒక్కసారిగా దూరమైపోతుంది.
గాసిప్స్ గురించి ఏమంటారు...?
నా గురించి చాలా గాసిప్పులు వస్తుంటాయి. నేనెప్పుడు వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. మా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఆ గాలి వార్తల గురించి ప్రశ్నించలేదు. అలా రాసేవారిపై నాకు కోపం లేదు. కాకపోతే.. ఆ విధంగా తప్పుడు రాతలు రాసే వాళ్లు కొంచెం కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే బాగుండు అని మాత్రం అనిపిస్తుంటుంది అని ముగించారు.
మొదటి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో కుర్రాళ్ల మతులు చెదరగొట్టింది కుర్ర హీరోయిన్ అలియభట్. ఆ చిత్రంలో ఒక్క బికినీ ఆమే ఫేట్ నే మార్చేసింది. బికినీ అందాలతో పిచ్చెక్కిచ్చింది. తర్వాత రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన హైవే సినిమాతో మరో విజయం దక్కించుకుంది. 2 స్టేట్స్ - హంప్టీ శర్మాకి దుల్హానియా సినిమాలతో మెప్పించింది. ఇటీవల విడుదలైన షాందార్ లో పింక్ కల్ ర్ టూ పీస్ వేసి మళ్లీ రచ్చ చేసింది. ప్రస్తుతం సొగసరి నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది. అవి మీకోసం...
మీ గ్లామర్ సీక్రెట్?
నేను చాలా క్యూట్ గా యాక్టివ్ గా ఉంటానని అందరూ అంటుంటారు. కానీ నాకు బద్దకం ఎంత ఎక్కువో వాళ్లకు తెలీదు పాపం. నిద్రపోవడానికి నేనిచే ఇంపార్టెన్స్ మరొకరెవ్వరు ఇవ్వరేమో. సినిమా షూటింగ్ లేనప్పుడు పదిహేను గంటలు ఏక ధాటిగా నిద్రపోతుంటాను. తినడం పడుకోవడమే పనిగా పెట్టుకుంటాను. గ్లామర్ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటాను. గ్లామర్ పెరగడానికి నిద్ర కూడా చాలా అవసరం. బహుషా నా అందం రహస్యం అదే అయి ఉండొచ్చు.
మీ యాక్టింగ్ లో మైనస్ లు మీకు తెలుస్తాయా?
బాగా నటిస్తానని చాలామంది మెచ్చుకుంటుంటారు. అయితే నాకు ఏడవడం సరిగ్గా రాదు. నా ఏడుపు నాకే ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పరిణీతి చోప్రా ట్రాజెడీ సీన్ లలో ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. అందుకే ‘ఇషక్ జాదే’ సినిమా చూశాక తన దగ్గరకు వెళ్లి... ‘నాకు నీ అంత బాగా ఏడవడం నేర్పించు’ అని అడిగాను.
బాయ్ ఫ్రెండ్ గురించి ఏమైనా కలలు?
అందరూ తన లవర్ అందంగా ఉండాలి అర్థం చేసుకునేవాడై ఉండాలి అని చెబుతుంటారు కదా! నాకు మాత్రం నా లవర్ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. మంచి వాసన నన్ను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. అబ్బాయిల విషయంలో కూడా నేను త్వరగా పడిపోయేది దానికే. ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను ఎప్పుడూ మగాళ్ల పర్ ఫ్యూమ్సే వాడతాను. పైగా నెలకొకటి మారుస్తుంటాను!
మీకు బాగా గుర్తుండి పోయే సంఘటన?
నాకు గుర్తులేదు. కానీ, ఆ ఘటన నన్ను ఇప్పటికీ భయపెడుతూ ఉంటుంది. నాకు మూడేళ్లున్నప్పుడు నాన్న గారు (దర్శకుడు మహేష్ భట్) తన సినిమా ఒకటి సేషెల్స్ లో తీయాలని ప్లాన్ చేశారు. తాను ఎలాగూ వెళ్తున్నాను కదా అని ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్లారు. అప్పుడు నేను తప్పిపోయానట. హోటల్ రూమ్ నుంచి నడచుకుంటూ అలా అలా బయటికి వెళ్లిపోయానట. కంగారుపడి వెతికితే ఓచోట రోడ్డుమీద నడుస్తూ కనిపించానట. అప్పుడు వాళ్లకి దొరక్కపోయి ఉంటే ఇప్పుడు నేనెక్కడుండేదాన్నో.
మీ ఫేవరెట్ ఫుడ్?
జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పడి చస్తాను. రోజులో ఎన్నిసార్లు తినమన్నా ఎన్ని తినమన్నా తినేస్తాను. అయితే నేనేదీ వేడిగా ఉంటే తినలేను. కాఫీ దగ్గర్నుంచి ప్రతి ఫుడ్ నీ చల్లారబెట్టుకునే తింటాను. పైగా ఏం తిన్నా అందులో పెరుగు కలుపుకోవడం ఇష్టం నాకు. చైనీస్ - ఇటాలియన్ - మెక్సికన్... తినేది ఏదైనా అందులో పెరుగు కలిపేస్తా. నేనలా చేస్తుంటే నా ఫ్రెండ్సంతా ముఖాలు అదోలా పెడతారు. అయినా నేను మానను.
ఇంట్లో వాళ్లకి మీలో నచ్చనిది?
బయటి నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా? కాళ్లు కడుక్కోవడం. ఆ పని చేశాకే ఏ పనైనా చేస్తా. దీంతో ఇంట్లో వాళ్లు కాస్త అతి చేస్తూన్నానని తిడతారు.
మీకు బాగా ఇష్టమైనది?
నాకు విమాన ప్రయాణాలంటే కూడా యమా ఇష్టం. గాలిలో తేలేటప్పుడు మనసు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. అదో గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం ఎప్పుడూ అలా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉండిపొమ్మన్నా ఓకే నాకు ఇష్టమే.
మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
నేను హిందీ చాలా బాగా మాట్లాడతానని కొందరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. వాళ్లకు అలా ఎందుకనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే... నాకు హిందీ అంత బాగా ఏమీ రాదు. స్కూల్లో హిందీ వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ ఓడిపోయేదాన్ని. మరి నా హిందీ బాగోవడమేమిటో. నా లైఫ్ లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ హైవే లో నా నటన చూసి నాన్నగారు మెచ్చుకోవటం.
యూత్ ఐకాన్ గా మీరూ ఉన్నారు... మీ కామెంట్
నేను అస్తమానం నా స్టయిల్ ను మార్చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకేలా ఉండటం నాకు నచ్చదు. ఏ కొత్త స్టయిల్ కనిపిస్తే దాన్ని ఫాలో అయిపోతుంటా. ఒక్కోసారి అది నప్పక నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను. దాంతో దెబ్బకి దాన్ని మార్చేసి మరో కొత్త స్టయిల్ మొదలుపెడతాను. అలాగే పుస్తకాలు కూడా బాగా చదువుతా. మార్కెట్ లోకి వచ్చే కొత్త పుస్తకాలన్ని సేకరిస్తా. అయితే ఏ రోజు కూర్చుని చదివిన సందర్భాలు లేవు. అలాగే నటిగా నన్ను నలుగురు గుర్తించాలి అన్న ఆరాటం ఉండటం సహజం. అది నాకు కాస్త అతిగానే ఉంది. అందుకోసం ఎంతకైనా తెగిస్తా అంటూ సెలవు తీసుకుంది అందాల అలియా.