సైజ్ జీరో ఓ రియల్ కథ

November 26, 2015 | 02:29 PM | 5 Views
temper
Artist Name :
అనుష్క శెట్టి
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
November 27, 2015

Interview Details :

ఒక యోగా ట్రైనర్‌గా తమ శరీరాకృతి కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే వ్యక్తులను చాలామందిని చూసాను. అలాంటివారి జీవితాల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కిన చిత్రమే 'సైజ్ జీరో' అంటోంది టాలీవుడ్ స్వీటి అనుష్క. ఆమె టైటిల్ పాత్రలో నటించిన చిత్రం "సైజ్ జీరో". రేపు అంటే నవంబర్ 27న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి, ఆమె బరువు కోసం ఎంతగా కష్టపడిందీ తదితర విశేషాల గురించి అనుష్క చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే..!!

 

సైజ్ జీరో కథ మీకెలా అన్పించింది..

మా కథా రచయిత అయిన కనికా థిల్లాన్ తనకు పరిచయమున్న ఒక కుటుంబంలోని ఓ అమ్మాయి నిజజీవితం నుంచి స్ఫూర్తి పొంది "సైజ్ జీరో" కథను సిద్ధం చేసింది. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయిని వారి కుటుంబం ఏ విధంగా ట్రీట్ చేస్తుంది. పెళ్లివరకూ సన్నగా ఉండాలని నానారకాలుగా ఇబ్బంది పెడుతుంది అనేది క్లుప్తంగా చిత్ర కథాంశం.

కథను ఎలివేట్ చేయాలంటే స్టార్ అవసరం కదా...

ఇటువంటి కథలు ఎక్కువమంది జనాలకు చేరువయ్యేలా చేయాలంటే స్టార్ హీరోయిన్ అవసరం. అందుకోసమే నన్ను సంప్రదించారు. కథ బాగా నచ్చడంతో నేనూ సరేనన్నాను. తొలుత మేకప్‌తో కవర్ చేద్దామనుకొన్నాం. అయితే ఫోటోషూట్ చేసిన తర్వాత నా బాడీ క్యారెక్టర్‌కు సూట్ అవ్వలేదనిపించింది. అందుకే తర్వాత 17 కేజీలు పెరిగాను.

ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా ఏమైనా చేశారా...?

"సైజ్ జీరో"లో అధికబరువున్న అమ్మాయిగా నటించడం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నేను యోగా నేర్పించే సమయంలో నా వద్దకు చాలామంది వచ్చేవారు. వాళ్ల శరీరాకృతి కారణంగా ఎప్పుడూ చాలా ఆందోళనకు లోనవుతుండేవారు. "సైజ్ జీరో"లో నా నటనకు స్ఫూర్తి వాళ్లే.  కెరీర్ పీక్ టైంలో ఇలాంటి క్యారెక్టర్ చేయడంపైన...?

ఇదే విషయాన్ని చాలామంది అడుగుతున్నాను. ఈ కథ విన్నాక కూడా సినిమా చేయకపోతే చాలా బాధపడాల్సి వచ్చేది. నా మనసుకు హత్తుకున్న కథ ఇది. ఒక అమ్మాయి మానసికంగా ఎంత దృఢంగా ఉండాలనే విషయాన్ని ఎంతో హృద్యంగా చెప్పిన సినిమా. "బాహుబలి, రుద్రమదేవి" చిత్రాల తర్వాత ఒక నటిగా పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా 'సైజ్ జీరో'.

వ్యంగ్యంగా ఉంటుందా... లావు అనేది సబ్జెక్టు కదా...

లావున్న అమ్మాయి ప్రేమకథ అంటే.. లావుగా ఉన్న అమ్మాయిపై కుళ్ళు జోకులతో నింపేయలేదు. అధిక బరువు ఉన్నంత మాత్రాన తక్కువగా చూడాల్సిన అవసరం లేదు చెప్పనున్నాం. అలాగని ఇదేదో మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ అమితంగా ఆకట్టుకొనే చిత్రమిది.

తిండి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు...

హీరోయిన్ అంటే ఫిట్‌గా ఉండటం కంపల్సరీ కదా. అందుకని నిన్నమొన్నటివరకు తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనేదాన్ని. ఏం తిన్నాసరే అందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయ్ అని కేలిక్యులేట్ చేసుకొని మరీ తినేదాన్ని. అయితే.. 'సైజ్ జీరో' కోసం బరువు పెరిగే క్రమంలో అలాంటి కేలిక్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి మనసుకు నచ్చిన తిండిని మనస్పూర్తిగా తినేదాన్ని.

దర్శకుడు ప్రకాష్ గురించి...

ప్రకాష్ కోవెలమూడి మనసున్న దర్శకుడు. ఏదైనా కథ తన మనసుకి నచ్చితే తప్ప దర్శకత్వం చేయాలనుకోడు. కథ పట్ల తనకు కమాండ్ ఉంది. ఆ కారణంగా ఏ సన్నివేశంలో ఏ పాత్రధారి ఏవిధంగా ప్రవర్తించాలనే విషయంలో ప్రకాష్‌కు క్లారిటీ ఉంది. దాంతో మా అందరికీ నటీంచడం చాలా సుళువైపోయింది.

మీరు సైజ్ జీరో కావాలనుకుంటున్నారా...?

"సైజ్ జీరో" అనేది ఒకప్పుడు ఫ్యాషన్ కావచ్చు. అలాగని అందరూ సైజ్ జీరో" ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకోవడం తప్పు. ఎవరి ఐడెంటిటీ వాళ్లకు ఉంటుంది. నేనైతే "సైజ్ జీరో" ఫిజిక్ కోసం అస్సలు ప్రయత్నించను. ఉన్నంతలో ఫిట్‌గా ఉండడమే నాకిష్టం.

సోషల్ మీడియా వైపు రావట్లేదు...

ప్రెజంట్ హీరోయిన్లందరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు, నాకు కూడా ఉండాలనే ఉంటుంది కానీ.. సోషల్ మీడియాలోకి ఒక్కసారి వచ్చామంటే, మన అభిమానులందరికీ సమాధానాలు ఇస్తూ ఉండాలి. నాకు అంత టైమ్ లేదు. షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్లానా, హ్యాపీగా పడుకున్నానా అన్నట్లుగా ఉంటుంది నా వ్యవహారశైలి.

కీరవాణి గారంటే మీకు ప్రత్యేకమైన అభిమానమని అంటుంటారు...

ఇండస్ట్రీలో నాకు బాగా సన్నిహితులైనవారిలో కీరవాణి ఒకరు. ఒక సంగీత దర్శకుడిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే.. ఆయనింటికి వెళ్లి ఒక్కసారి ఆయన్ను మనసారా కౌగిలించుకొంటే మనసులో ఉన్న బాధంతా ఒక్కసారిగా దూరమైపోతుంది.

గాసిప్స్ గురించి ఏమంటారు...?

నా గురించి చాలా గాసిప్పులు వస్తుంటాయి. నేనెప్పుడు వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. మా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఆ గాలి వార్తల గురించి ప్రశ్నించలేదు. అలా రాసేవారిపై నాకు కోపం లేదు. కాకపోతే.. ఆ విధంగా తప్పుడు రాతలు రాసే వాళ్లు కొంచెం కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే బాగుండు అని మాత్రం అనిపిస్తుంటుంది అని ముగించారు.

goldnsilver

తాజా వార్తలు