Interview Details :
రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా, మమత రహుత్ ప్రధాన పాత్రల్లో గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వలో అనూద్ నిర్మించిన హార్రర్ థ్రిల్లర్ ‘కాలింగ్‌బెల్’. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా వస్తున్న రెస్పాన్స్‌కి థియేటర్స్ కూడా పెంచారు. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు పన్నా రాయల్‌తో ఇంటర్వ్యూ.
‘కాలింగ్ బెల్’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. నేను ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. సినిమాకి ఒక్కరు వచ్చి నెక్స్‌టైమ్ పదిమందిని తీసుకెళ్తున్నారు. మాస్ ఆడియన్స్‌కి ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఒక చిన్న మూవీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో వర్కవుట్ అవుతోందంటే అదే సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. నైజాం ఏరియాలో మాత్రమే సరైన థియేటర్స్ దొరక్క కొంచెం రెస్పాన్స్ కాస్త వీక్‌గా వుంది తప్ప ఈస్ట్, వెస్ట్, వైజాగ్, విజయవాడ, గుంటూరు నుంచి చాలా గుడ్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న వైజాగ్‌లో వినాయక్‌గారి విమాక్స్ థియేటర్‌లో ఆల్ షోస్ హౌస్‌ఫుల్స్ అయ్యాయి. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శంకర్ ఫోన్ చేసి రెస్పాన్స్ చాలా బాగుందని చెప్పారు. ఇంతకుముందు చేసిన మూడు సినిమాల వల్ల తను లాస్ అయ్యానని, ఈ సినిమా తనకు మంచి ప్రాఫిట్స్ ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు తనని అందరూ కాలింగ్ బెల్ శంకర్ అని పిలుస్తున్నారని చెప్పారు. ఇప్పుడున్న సినిమాల్లో ‘కాలింగ్ బెల్’రెవిన్యూ పరంగా సూపర్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. మాకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రెవిన్యూ పరంగా ఎక్కడెక్కడ బాగుంది?
షేర్ వైజ్ చూస్తే నెల్లూరు, వైజాగ్ టాప్‌లో వుంది. ఈస్ట్, వెస్ట్‌లలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో వారంలో మరో 12 థియేటర్లు పెంచాం. దీనికి నేను చాలా హ్యాపీగా వున్నాను.
మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
నేను బేసిక్‌గా విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌ని. 10 సంవత్సరాల నుంచి ఫ్రీ లాన్సర్‌గా గ్రాఫిక్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నాను. బాంబేలో కూడా పనిచేశాను. న్యూక్ అనే సాఫ్ట్‌వేర్‌లో పది మంది వుండే మా టీమ్ డిజిటల్ డొమైన్ అనే కంపెనీ ద్వారా ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ట్రైన్ అయింది. కింగ్‌కాంగ్ లాంటి సినిమాలు ఈ సాఫ్ట్‌వేర్‌లో చేశారు. విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వర్క్ చేస్తూ ఒక పెద్ద మూవీ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ప్రాజెక్ట్‌కి ముందు నీకు ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి, నీ టాలెంట్‌ని ప్రూవ్ చేసే ఒక చిన్న సినిమా చెయ్యమని పెద్దలు సలహా ఇవ్వడంతో ఈ సినిమా చేశాను.
ఈ సినిమా చెయ్యడంలో ప్రొడ్యూసర్ కోఆపరేషన్ ఎలా వుంది?
ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనూద్‌గారు. మొదట ఒక చిన్న ప్రాజెక్ట్‌గా అనుకున్నాం. షూటింగ్ జరిగేటపుడు సీన్స్ బాగా రావడం చూసి అనూద్‌గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొదట20 కాల్షీట్స్‌లో సినిమాని పూర్తి చేద్దామనుకున్నాం. కానీ, మా ప్రొడ్యూసర్ 52 కాల్షీట్స్ వరకు తీసుకెళ్ళారు. గ్రాఫిక్స్ పరంగా, స్టోరీ పరంగా ఆయనకి బాగా నచ్చి ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా టెక్నికల్ సపోర్ట్ కూడా బాగా వుండేలా నాకు మంచి సహకారాన్ని అందించారు.
థియేటర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా వుంది?
ఆడియన్స్ రెస్పాన్స్ అల్టిమేట్ అని చెప్పాలి. ఒక చిన్న సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ కూడా వుంటుందా అని ఆశ్చర్యపోయాను. రిపీటెడ్‌గా థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా వున్నాను.
మీరు ఎలాంటి సినిమాలు చెయ్యడానికి ఇష్టపడతారు?
ఫ్రాంక్‌గా చెప్పాలంటే సోషియో ఫాంటసీ, హార్రర్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌లలోనే సినిమాలు చేస్తాను. లవ్ సినిమా చెయ్యమని చెప్పినా అందులో హార్రర్ ఎలిమెంట్ మిక్స్ చేస్తాను. ఫ్యూచర్‌లో నేను చేసే సినిమాలు ఇవే. కానీ, అడ్వంచరస్ మూవీ, ఆడియన్స్‌ని థ్రిల్ చేసే సినిమాలు చేస్తాను. వెంట వెంటనే సినిమాలు చెయ్యకుండా సెలెక్టివ్‌గా చేస్తాను. ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ డిజప్పాయింట్ అవకుండా వుండే సినిమాలు చెయ్యాలన్నది నా కోరిక.
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేశారు?
నేను ఎవ్వరి దగ్గరా పనిచెయ్యలేదు. డైరెక్షన్ అంటే ఇలా వుంటుంది అని సెట్‌లోకి కూడా వెళ్ళి చూడలేదు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. ఒక సీన్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్ వుండాలి అనేది డైరెక్టర్ మాకు చెప్తారు. దానికి తగ్గట్టు మేం డిజైన్ చేసి చూపిస్తాం. అలా వర్క్ చేయడం వల్ల నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి?
నా సినిమాలో నటించమని చాలా మంది హీరోలను సంప్రదించగా నేను కొత్తవాడినని, చిన్న బడ్జెట్ సినిమా అని ఎవరు నటించడానికి ముందుకు రాలేదు. కానీ సినిమా విడుదలయ్యాక సినిమా సీక్వెల్ చేస్తే నటిస్తామని ఫోన్స్ చేసారు. రవివర్మ, మమత, వ్రితి ఖన్నా వారి పరిధిలో బాగా నటించారు. సినిమాలో ప్రణతిగారు పాడిన రెండు పాటలు హైలైట్ గా నిలిచాయి.
నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుతానికి నా చేతిలో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 3 మెయిన్ ప్రాజెక్ట్స్. ఒకటి పెద్ద ప్రాజెక్ట్ ఉంది. కానీ కాలింగ్ బెల్ మూవీ చూసిన వారు సీక్వెల్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. నేను కాలింగ్ బెల్ కథను మూడు భాగాలుగా రాసాను. కాలింగ్ బెల్ సీక్వెల్ తోపాటు మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. రెండిటిలో ఒకటి ఫైనల్ చేసి ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు పన్నా రాయల్.