Interview Details :
షూటింగ్ ల్లో యాక్షన్, కట్ మధ్య జీవిస్తుంటాం. ఏ మాత్రం అవకాశం వచ్చినా సెట్ లోనే సరాదాగా గడపటానికి ప్రయత్నిస్తుంటాం. ఒకరి మీద ఒకరు జోకులేసుకోవడం, అందరూ కలసి ఒకరినే ఏడిపించడం..ఏదయితేనేం..పని వత్తిడి తెలియకుండా ఉండేందుకు ఏదో ఒక అల్లరి పనులు చేస్తుంటాం. అని అన్నాడు మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్..’రేయ్’, ‘పిల్లానువ్వులేని జీవితం’ చిత్రాలు తర్వాత ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. షూటింగ్ గురించి సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చిన ముచ్చట్లు...
నన్ను బాగా ఏడిపించింది...
రామోజీ ఫిల్మ్ సిటీలో పిల్లా నువ్వులేని జీవితం చిత్రం కోసం పాటను షూట్ చేస్తున్నారు. నేను, రెజీనా కలిసి చేయాల్సిన సింపుల్ స్టెప్స్ అవి. షూటింగ్ జరుగుతుండగా ఫిల్మ్ సిటీ సందర్శనకు వచ్చిన వాళ్లంతా చుట్టూ గుమిగూడారు. దాంతో నా మైండ్ బ్లాంక్ అయింది. వాళ్ల ముందు డ్యాన్స్ వేయలేకపోయాను. నేను డ్యాన్స్ బాగా వేయలేకపోతే...నాకు డ్యాన్స్ బాగా రాదని, అంటారేమోననే అనుమానం మొదలైంది. దాంతో డ్యాన్స్ సరిగా చేయలేకపోయాను. ‘ఇంత చిన్న స్టెప్పులు కూడా వేయలేకపోతే ఎలా? బాబూ’ అంటూ ఏడిపించసాగింది. క్రౌడ్ ని చూసిన ప్రతిసారి నాకు ఆ సీన్ గుర్తుకు వస్తుంది.
సయామీ11.. రెజీనా 14...
సీన్ పరంగా ఎమోషన్ పండించడానికి కొన్ని షాట్స్ ను నాలుగైదు యాంగిల్స్ లో తీస్తుంటారు. రేయ్ లో సయామీ ఖేర్ నన్ను కొట్టే సీన్ ఉంది. అన్నీ యాంగిల్స్ తీయడం పూర్తయ్యేసరికి తను నన్ను 11 సార్లు కొట్టింది. అలాగే పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో రెజీనా నన్ను కొట్టే సీనుంది. ఆ సీన్ కోసం రెజీనా నన్ను 14 సార్లు కొట్టింది.
గాగుల్స్.. మేకప్ మేన్...
సెట్ లో ఎప్పుడూ జోవియల్ గా ఉండటం నాకు అలవాటు. ఓ సారి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. బోర్ కొట్టింది. షాట్ పూర్తి కాగానే గాగుల్స్ తీసి మేకప్ మేన్ చేతిలో పెట్టా. ఎవరో పిలిచారని తను గాగుల్స్ ను అక్కడే పెట్టి పక్కకి వెళ్లాడు. నేను వెంటనే వాటిని తీసి దాచేశా. ఏం తెలియనట్లు కూర్చున్నా. షాట్ రెడీ సార్ అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పాక ‘గాగుల్స్ ఇవ్వు’ అని మేకప్ మేన్ ను అడిగా. అతను దాన్ని వెతికిన తీరు నాకు ఇప్పటికి గుర్తొచ్చినా నవ్వు వస్తుంది. సెట్ మొత్తం వెతికాక నిదానంగా వచ్చి ‘అవి కనిపించడం లేదు సార్’ అన్నారు. ‘అయ్యో ..అవి లేకుంటే సీన్ కంటిన్యూటి దెబ్బతింటుంది. పైగా అవి నావి కూడా కావు. డైరెక్టర్ గారివి..ఇప్పుడెలా?’ అని గాభరా పడుతున్నట్లు నటించా. అతనిలో షివరింగ్ మొదలైంది. మధ్యాహ్నం వరకు ఏడిపించి ‘ఏ చోటూ మేరీ పాస్ హై’ అంటూ చూపించా. అంతే అతనికి నవ్వుకి బదులు ఏడుపు వచ్చినంత పనైంది.
తొలిగాయం...
అమెరికాలో ‘రేయ్’ సినిమాకి సంబంధించి సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మోకాలిపై డ్యాన్స్ వేసే మూమొంట్ ఉంటుంది. ఉన్నట్లుండి మోకాలిపై బరుపు పడిందేమో బాగా వాచింది. డాక్టర్ దగ్గరకెళితే హెయిర్ లైన్ క్రాక్ వచ్చింది. రెండు నెలలు రెస్ట్ తప్పదన్నారు. దాంతో యూనిట్ అందరం అమెరికా నుండి తిరిగి వచ్చేశాం. వెళ్లిన రెండో రోజే అలా జరగడం జీర్ణించుకోలేక పోయాను. అప్పుడు నుంచి ఔట్ డోర్ షూటింగ్ వెళ్లేటప్పుడంతా దేవుడికి దణ్ణం పెట్టుకుంటా..
24 గంటలు...
నటీనటులు సమయాన్ని పట్టించుకోకుండా షూటింగ్ చేస్తారని నాకు తెలుసు. మా మావయ్యలు రాత్రింబగళ్లు షూటింగ్ చేసేవారని అమ్మ చెప్పేది. రేయ్ సినిమా కోసం ఓ రోజు ఉదయం 9 నుండి మరుసటి రోజు ఉదయం 9 వరకు షూటింగ్ చేయాల్సి వచ్చింది. టఫ్ ఫ్లోర్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. బాగా ఆలసిపోయాను. అప్పుడు పెద్ద మావయ్య చిరంజీవిగారు ఫోన్ చేసి బాగా కష్టపడు..బాగా చేయ్ తేజూ అని నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ మాటలు ఇచ్చిన ఉత్తేజాన్ని మాటల్లో చెప్పలేను.