నటీనటులు : సూర్య,సమంత,నిత్యమీనన్,అజయ్,శరణ్య, చార్లీ, హర్షవర్థన్, గిరీష్ కర్నాడ్ తదితరులు
సాంకేతిక వర్గం :
ఛాయాగ్రహణం: తిరు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, పాటలు: చంద్రబోస్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, బ్యానర్ : 2 డి ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: సూర్య కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.
విభిన్న సినిమాలు తీసే ఓ దర్శకుడు, వైవిధ్యభరితమైన పాత్రలు చేసే ఓ హీరో... కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. 24 లా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం ట్రావెలింగ్ అన్న కథాంశం చాలా సినిమాల్లో వచ్చినప్పటికీ దానిని విక్రమ్ కుమార్ హ్యాండిల్ చేస్తున్నాడు అంటేనే దానికో ప్రత్యేకత ఏర్పడింది. స్వయంగా సూర్య ప్రొడ్యూస్ చేసిన 24 చిత్రం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్ర ఫలితం ఏంటో రివ్యూలోకి వెళ్లాక డిసైడ్ చేద్దాం.
కథ :
శివ, ఆత్రేయ ఒకే రూపంకానీ, క్షణ కాలం తేడాలో పుట్టిన కవలలు. శివ కుమార్ (సూర్య) ఓ మంచి శాస్త్రవేత్త. తన భార్య ప్రియ (నిత్యా మీనన్), నెలల వయసుండే కొడుకుతో కలిసి ఓ ప్రశాంతమైన పరిసరాల్లో జీవిస్తూ, ఓ వాచీని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు. కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళే అవకాశం ఉండడమే దాని ప్రత్యేకత. అయితే అలాంటి వాచీని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు ఆత్రేయ (సూర్య). దుష్టుడైన సోదరుడి చేతిలో అది పడకూడదన్న ప్రయత్నంలో శివ, ప్రియ ప్రాణాలు కోల్పోతారు. అదే ప్రమాదంలో ఆత్రేయ కోమాలోకి వెళ్తాడు. అయితే ఆ వాచీని, తమ కుమారుడిని ఎవరో తెలియని ఓ యువతి (శరణ్య) కి అప్పజెప్పుతారు శివ-ప్రియలు. కట్ చేస్తే... 26 ఏళ్ల తరువాత, తల్లి శరణ్యతో, ప్రేయసి సత్య(సమంత)లతో సంతోష జీవితం గడిపుతుంటాడు మణి (సూర్య). ఓ వాచీ రిపేర్ సెంటర్ నడుపుకునే మణికి అనుకోకుండా తన ఇంట్లో ఉన్న ఆ చేతి గడియారం శక్తి గురించి తెలుస్తుంది. అప్పుడే కోమాలోంచి వచ్చిన ఆత్రేయ కూడా వాచీ కోసం వెతికే పనిలో పడతాడు. ఈ ఇద్దరి మధ్య ఆ వాచీ కోసం జరిగే వార్ చివరకు ఏమైంది అన్నదే క్లుప్తంగా 24 కథ.
ఫ్లస్ పాయింట్లు:
సూర్య లేకపోతే 24 సినిమా లేదు ఇది ఈ మధ్య ఇంటర్వ్యూలలో దర్శకుడు విక్రమ్ కుమార్ చెబుతున్న మాటలు. నిజమే సినిమా చూశాక సూర్యని తప్ప ఆ పాత్రలో మరోకరిని ఊహించుకోలేం అనిపిస్తుంది. అంతలా లీనమయ్యాడు సూర్య. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో అతను పండించిన విలనిజం గుర్తుండిపోతుంది. అదే టైంలో అమాయకపు సైంటిస్ట్ శివ పాత్రలో, సరదాగా ఉండే మణి పాత్రలో కామెడీతో పాటు అద్భుతమైన వేరియేషన్ చూపాడు. క్లైమాక్స్ లో ఆత్రేయ మణిల మధ్య వచ్చే మైండ్ గేమ్ పై ప్రేక్షకుడు లీనమయిపోతాడు. అంతలా సూర్య ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లు సమంత ఎప్పటిలాగే క్యూట్ గా తన పని కానిచ్చేసింది. నిత్య మీనన్ ఉన్నది కాసేపయినా ఆమె పాత్ర ప్రధానమైనదే. శరణ్య, అజయ్, సుధ, గిరీష్ కర్నాడ్ వారి వారి పాత్ర పరిధిలో నటించారు. టెక్నికల్ అంశాల విషయానికొస్తే... వాచీ గురించి వచ్చే హర్సిలీ ఎపిసోడ్ 20 నిమిషాలు హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ తిరు పనితనం అంతలా ఉంది. రెహ్మన్ పాటలు విన్నప్పటికన్నా స్క్రీన్ పై చూసినప్పుడు బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఎఫెక్ట్స్‌తో కూడా సినిమాకు మంచి ఫీల్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. తన సొంత బ్యానర్‍లో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, సూర్య, నిర్మాణ విలువలతో పరిచయం చేశాడు.
మైనస్ పాయింట్లు :
పాత రివెంజ్ డ్రామా సినిమాలా కథ అనిపిస్తుంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లో స్టోరీలో ఆసక్తిని కలిగిస్తాయి. అయితే మరీ టూ మచ్ ట్విస్ట్ లు కాస్త విసిగిస్తాయి కూడా. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కాస్త సిల్లీగా ఉన్నప్పటికీ సినిమా సీరియస్ కథలో ఎంటర్ అయినప్పటి నుంచి అవేం పట్టవు. టెక్నికల్ గా ఇలాంటి సినిమాలు ఎప్పటికో కానీ రావు. సో... ఇలాంటి వాటికి వంక పెట్టడం కష్టం.
చివరగా :
మనం లాంటి క్లాస్ సినిమా తీశాక విక్రమ్ కుమార్ ఇలాంటి స్టోరీతో వస్తాడని ఎవరూ ఊహించలేరు. అదే టైంలో వరుస ప్రయోగాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ లేని సూర్య ఈ సినిమాతో డిస్టింక్షన్ లో పాసయ్యాడు. సిల్లీ సిల్లీ అంశాలు ఉన్నప్పటికీ కథలో ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. కాలంతో మణి ఆడుకునే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. రెగ్యులర్ అంశాలతో కాకుండా కొత్త ఆలోచన, కథనం, ప్రజంటేషన్ ఇలా అన్ని విషయాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ చూపిన అద్భుతమైన ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశం. చివరగా... కాలంతో ప్రయాణం చేస్తూ చేసిన ఈ ప్రయోగం అద్భుతం. తప్పక చూడాల్సిన సినిమా.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment