సుప్రీం

May 09, 2016 | 05:01 PM | 15 Views
Rating :
సుప్రీం

నటీనటులు : సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, రవిశంకర్, కబీర్ తదితరులు

సాంకేతిక వర్గం : సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : శిరీష్, దర్శకత్వం : అనిల్ రావిపూడి

ప్రస్తుతం ఉన్న మెగా హీరోల్లో మాస్ హీరోగా గుర్తింపు పడిన సాయిధరమ్ తేజ్ ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ‘పటాస్‌’తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీంగా మన ముందుకు వచ్చాడు. మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మరి ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దామా?

కథ : అనగనగా ఓ ఊర్లో తరాలుగా జాగృతి ట్రస్ట్ సంస్థ పరిధిలోని వందల ఎకరాలను నమ్ముకొని వేలమంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ పరిధిలోని భూములను తన సొంతం చేసుకునేందుకు విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) అనే బ్యాడ్ మాన్ ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ట్రస్ట్ ఓ రాజ కుటుంబీకులదనీ, వారి తరపు వారు ఇంకా బతికే ఉన్నారని తెలియడంతో విక్రమ్ ప్లాన్‍కు అడ్డంకి పడుతుంది. ఇక ఈ కథకు ఏమాత్రం సంబంధం లేని బాలు (సాయిధరమ్ తేజ్), హైద్రాబాద్‌లో ట్యాక్సీ నడుపుకుంటూ తండ్రితో కలిసి జీవిస్తుంటాడు. అతడి జీవితంలోకి రాజన్ పేరుతో ఓ ఎనిమిదేళ్ళ బాలుడు వస్తాడు. రాజన్ వచ్చాక బాలు కథ పూర్తిగా మారిపోతుంది. తనకే సంబంధం లేని జాగృతి ట్రస్ట్ కథలోకి బాలు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. అసలు బాలుకి, అక్కడి ప్రజలకు సంబంధం ఏంటీ? ఈ రాజన్ అనే బాలుడెవరు? ఆ బాలుడికీ జాగృతి ట్రస్ట్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఒక బాధ్యతను తనపై వేసుకున్న బాలు లవర్ బెల్లం శ్రీదేవీ(రాశిఖన్నా) సాయంతో దాన్ని ఎలా విజయవంతంగా పూర్తి చేశాడు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ఫ్లస్ పాయింట్లు: ఇక ఎప్పట్లానే మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ అంతే ఎనర్జీతో నటించి సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్ళాడు. డ్యాన్సుల్లో, డైలాగ్ డెలివరీలో సాయిధరమ్ తేజ్ సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. చాలా రోజుల తర్వాత హీరోయిన్ కు ఓ ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. బెల్లం శ్రీదేవీగా ఫన్ తో కూడిన పోలీస్ క్యారెక్టర్లో రాశిఖన్నా బాగా నటించింది. కథకు చాలా కీలకం అయిన పాత్రలో బాల నటుడు మైఖేల్ గాంధీ అద్భుతమైన ప్రతిభ చూపి కట్టిపడేశాడు. పోసాని, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, షేకింగ్ శేషు, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్ అంతా సినిమాకు అవసరమైనప్పుడల్లా కామెడీని పండిస్తూ అందరూ తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు. సినిమా పరంగా చూసుకుంటే, ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. సెకండాఫ్‌లో సింగిల్ పాయింట్‌లో నడిచే సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రధాన బలం. ఫన్ ట్రాక్ తప్పకుండా మంచి ఫ్లోలో నిలబెడుతూ కాపాడడం సినిమా పరంగా ప్లస్ పాయింట్స్. సాంకేతిక అంశాల విషయానికొస్తే... సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు టెక్నికల్‌గా ఓ బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఒడిశా నేపథ్యంలో వచ్చే ఓ ఛేజ్ సీన్ సినిమాటోగ్రాఫర్ పనితనానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలన్నీ సాదాసీదాగానే ఉన్నాయి. ‘ఆంజనేయుడు నీ వాడు’ అనే పాట బాగుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బాగుంది. కొన్నిచోట్ల ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్‌లో వేగం తగ్గించాల్సింది. దిల్‌రాజు బ్యానర్ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

మైనస్ పాయింట్లు : ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే అసలు కథంతా. రోటీన్ కథే అయినప్పటికీ మొదటి పావుగంటలోనే తెలిసిపోవడం గురించి చెప్పుకోవాలి. అయితే ఇంటర్వెల్ వరకూ సినిమాను పకడ్బందీగా తీసుకొచ్చినా, అక్కడొక ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమా మొత్తం సింగిల్ పాయింట్‌లో సాగిపోతూ అక్కడక్కడా నెమ్మదించినట్లు కనిపించింది. ఇక సినిమాలో పెద్దగా లాజిక్ అన్న అంశానికి చోటే లేదు. పూర్తిగా ఫన్ ఎలిమెంట్‌నే నమ్ముకున్నారు.

చివరగా : కమర్షియల్ సినిమా+ఫన్ ఎలిమెంట్ కలిస్తే హిట్. ఇదే ఫార్ములాను పటాస్ కు ఫాలో అయ్యాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సుప్రీం విషయంలో అదే ఫాలో అయ్యాడు. ఓ చిన్నకథకు కామెడీ టచ్ ఇచ్చి ఫుల్ ఎంటర్ టైనర్ ని అందించాడు అనిల్. రోటీన్ కథే అయినా, లాజిక్ లతో సంబంధం లేకుండా పోయినా, సినిమా స్పీడ్ గా వెళ్లిపోవటంతో ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ కాడు. చివరగా... సుప్రీం వీకెండ్ కామెడీతో హాయిగా నవ్వించే ఎంటర్ టైనింగ్ రైడ్.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు