స్వాతి, నవీన్ చంద్ర ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'త్రిపుర'. 'గీతాంజలి' ఫేం రాజకిరణ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం తెరకెక్కింది. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం.రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో నవంబర్ 6న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో 27న విడుదలవుతుంది.ఓ హోటల్ బాయ్ రేంజ్ నుంచి ఇవాళ నిర్మాత స్థాయికి ఎదిగారు చిన బాబు. ఈ సందర్భంగా నిర్మాత చినబాబు 'త్రిపుర' గురించి చెప్పిన విశేషాలివి...
త్రిపుర కాన్సెప్ట్ ఏంటీ?
అమాయకపు పల్లెటూరి అమ్మాయి స్వాతి. ఆమెకు వచ్చిన కలలన్నీ నిజమవుతుంటాయి. ట్రీట్మెంట్ కోసం సిటీ వస్తుంది. అక్కడ డాక్టర్ నవీన్ చంద్రతో ఆమె వివాహం జరుగుతుంది. గతంలో వచ్చిన కలలో డాక్టర్ కూడా ఉంటారు. తర్వాత ఏం జరిగిందనేది చిత్రం చూసి తెలుసుకోవాలి.
గీతాంజలి, త్రిపుర మధ్య తేడా ఏంటి..?
గీతాంజలి.. హారర్ కామెడీ చిత్రం. త్రిపుర.. థ్రిల్లర్ కామెడీ, కుటుంబ కథా చిత్రం. పెళ్లికి ముందు, తర్వాత జీవితం ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య అలకలు, ప్రేమానురాగాలు.. ఇలా నవరసాలు ఉన్న చిత్రమిది. దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. సప్తగిరి చేసిన వినోదం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
స్వాతి కోసమే కథ రాశారా..?
లేదండీ. 'గీతాంజలి' తర్వాత దర్శకుడు రాజకిరణ్, నేను కలసి చిత్రం చేయాలనుకున్నాం. కథ కంటే ముందు 'త్రిపుర' పేరు పెట్టేశాం. కథ రాసుకున్న తర్వాత స్వాతి అయితే పాత్రకు న్యాయం చేస్తుందని అంతా భావించాం. ఆమెను కలవడం, ఓకే చెప్పడం జరిగాయి. మరో కథానాయిక ఆలోచన కూడా మాకు రాలేదు. స్వాతి అంతే అద్బుతంగా నటించింది.
విడుదలకు ముందే లాభాల్లో ఉన్నారట..?
అవునండీ. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడు ఖర్చుపెట్టిన బడ్జెట్ ఒకటి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగ సెట్ వేశాం. హంపి, బాదామిలలో ఒక్కో పాట చిత్రీకరించాం. కథను నమ్మి ఖర్చు చేశాం. అంచనాలు బాగుండడంతో బిజినెస్ బాగా జరిగింది. శాటిలైట్ హక్కులను మూడున్నర కోట్లకు కొన్నారు. హ్యాపీ.
చిత్రంపై అంచనాలు ఏర్పడానికి కారణం ఏంటి?
కథ. స్వాతి గత రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. అలాగే 'గీతాంజలి' తర్వాత రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున చిత్రం కావడం, కోన వెంకట్, వెలిగొండ స్క్రీన్ ప్లే.. మంచి అంచనాలు ఏర్పడడానికి కారణమయ్యాయి.
మీరు సినిమా చూశారా..?
చూశానండి. చాలా హ్యాపీ. నవంబర్ 6న ప్రేక్షకులు చిత్రం చూసి ఎలా ఉందో చెప్పాలి.
ఎన్ని ధియేటర్లలో విడుదల చేస్తున్నారు..?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 600లకు పైగా ధియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్ ప్రేక్షకులలో కూడా చిత్రంపై మంచి అంచనాలున్నాయి. నైజాంలో 'శ్రీమంతుడు', 'రుద్రమదేవి' చిత్రాలను విడుదల చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ 'త్రిపుర'ను పంపిణీ చేస్తుంది. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా చిత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి అంచనాలతో విడుదల కావడం సంతోషంగా ఉంది.
తమిళంలో 27న విడుదల చేయడానికి కారణం..?
తెలుగు, తమిళ భాషల్లో 27న విడుదల చేయాలనేది మా ప్రణాళిక. తెలుగులో కంచె, బెంగాల్ టైగర్, అఖిల్, శంకరాభరణం తదితర చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చోటు చేసుకున్నాయి. లక్కీగా థియేటర్లు లభించాయి. బిజినెస్ అంతా ముందే పూర్తవడంతో 6న విడుదల చేస్తున్నాం.
తదుపరి చిత్రాలు..?
ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్వాతి అంగీకరిస్తే మళ్లీ ఆమెతో చిత్రం చేయడానికి రెడీ. 'త్రిపుర' తరహాలో మరో చిత్రం నిర్మించాలనుకుంటున్నా అంటూ ఇంటర్వ్యూ ముగించారాయన.
కెరీర్ అస్తవ్యస్తంగా ఉన్న టైంలో 'పటాస్' చిత్రంతో మరిచిపోలేని విజయాన్ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఏడాది కరెక్ట్ హిట్ అందుకున్న హీరో ఆయనే. ఇప్పుడు తాజాగా షేర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 30) విడుదలవుతుంది. గతంలో ఈయనతోనే అభిమన్యు, కత్తి లాంటి చిత్రాలు తెరకెక్కించిన మల్లిఖార్జున్ అనే దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. థమన్ అందించిన మ్యూజిక్ గానే బాగానే ఉంది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ నీహార్ ఆన్ లైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ మీకోసం...
షేర్ కథ ఏంటి..?
ఇదొక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. నా గత సినిమాల్లో ఉండే ట్విస్టులు, భారీ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండవు. ఇందులో ఓ సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. తన తండ్రికి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో సహాయం చేస్తుంటాడు. మైండ్ లో ఒకటి పెట్టుకొని బయట మరొకటి చేసే క్యారెక్టర్ తనది. సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఉంటే మంచిదే.. కాని భారీగా అంచనాలు పెట్టుకోకుండా ఓ సాధారణ సినిమా చూడడానికి వెళ్తున్నామని చూస్తే ఆడియన్స్ ఖచ్చితంగా అలరిస్తుంది.
షేర్ పటాస్ ఒకే టైంలో షూటింగ్ ప్రారంభమయ్యాయి కదా. మరి స్క్రిప్ట్ లో ఏమైనా ఛేంజ్ లు ఉంటాయా?
షేర్ సినిమా పటాస్ కు ముందుగానే ఓకే చేసిన సబ్జెక్టు. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. పటాస్ సినిమా రిలీజ్ అయిన తరువాత షేర్ సినిమా స్క్రిప్ట్ లో ఎంటర్టైన్మెంట్ కాస్త పెంచాం. నాకు బ్రహ్మానందం గారి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ శాతం ఉంటుంది.
మల్లిఖార్జున్ గారితో సినిమాలు చేయడానికి గల కారణం..?
మల్లితో అభిమన్యు, కత్తి, రెండు సినిమాలు చేసాను. నా కెరీర్ ప్రారంభం నుండి ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. నేను ఏ దర్శకుడైనా.. స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు తనలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో.. చూస్తాను. కొత్త దర్శకులకు కూడా వారి నమ్మకాన్ని చూసే అవకాసాలిస్తాను. మల్లి లో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమా చాలా బాగా డైరెక్ట్ చేసాడు. టీం అందరిలో ఎక్కువ కష్టపడింది తనే. ప్రతిది దగ్గరుండి చూసుకున్నాడు. చాలా ఎఫర్ట్ పెట్టి చేసాడు. షేర్ తో మల్లిఖార్జున్ కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.
ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లట్లేదు?
అలా ఏం లేదు. నాకు విభిన్న చిత్రాలు చేయడమంటేనే ఇష్టం. ఓం సినిమా మూడు సంవత్సరాలు నా లైఫ్ పెట్టి చేసాను. 3డి టెక్నాలజీ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. కాని మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ ఎక్కువ ఉండడం వలనే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే ఇక ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. స్క్రీన్ ప్లే, నేరేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని చేస్తాను.
హిట్, ఫ్లాపుల మధ్య తేడా ఏం గమనించారు?
నా దృష్టిలో సక్సెస్, ఫెయిల్యూర్ కు మధ్య డిఫరెన్స్ పోయింది. విజయం వచ్చినప్పుడు తక్కువ ఆలోచిస్తాను. ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ తప్పు చేసామా.. అని ఎక్కువగా ఆలోచిస్తాను. తరువాత అలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాను.
షేర్ ఆడియో వేడుకలో చాలా ఎమోషనల్ అయినట్లున్నారు..?
నాకు ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలంటే ఇష్టం. సినిమాల్లో నా పాత్ర గురించి ఎవరు మాట్లాడినా పర్లేదు కాని నా నిజ జీవితం గురించి మాట్లాడితే నచ్చదు. కుటుంబం పట్ల చాలా జాగ్రత్త తీసుకొని ఉంటాను. ఎవరైనా నన్ను పాయింట్ అవుట్ చేసి చూపిస్తే అసలు నచ్చదు. చాలా ఎమోషనల్ అయిపోతాను. మిగతా విషయాలు అసలు పట్టించుకోను.మీ అందరికి తెలుసు నేనేంటో....
మొదట ఓకే చేసిన హీరోయిన్ ను మార్చడానికి కారణం..?
షేర్ టీం తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఎవరు తృప్తి పడలేదు. రీషూట్ చేసింది కూడా 10 రోజులు మాత్రమే.. తనతో పాటలు కూడా షూట్ చేయలేదు. కేవలం టాకీ పార్ట్ మాత్రమే చేసాం.
ఎన్టీఆర్ రషెస్ చూసి ఏం అన్నారు..?
నా ప్రతి సినిమా రషెస్ చూస్తాడు. పటాస్ చూసాడు అలానే ఈ సినిమా కూడా చూసాడు. మేమిద్దరం కలిసి ఏం మాట్లాడుకున్నా.. అది మా మధ్యనే ఉంటుంది.
ఎన్టీఆర్ హీరోగా మీ బ్యానర్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది..?
ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఆ విషయంలో త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాను.
కొత్త సినిమాలు ఏవైనా కమిట్ అయ్యారా?
సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనుంది. ప్రాజెక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారికంగా తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
గుణ టీమ్ వర్క్స్ పతాకంపై డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన రుద్రమదేవీ 3డి చిత్రం ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 9న విడుదల అవుతుంది. ఇక ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించాడు. ఇక చిత్రం రిలీజ్ సందర్భంగా అల్లుఅర్జున్ ప్ర్యతేకంగా మీడియాతో ముచ్చటించాడు. ఈ విశేషాలు నీహార్ ప్రేక్షకుల కోసం...
రుద్రమదేవి రిలీజవుతోంది... ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోందా?
తెలుగు సినిమాకి ఇదో కొత్త జోనర్. హిస్టారిక్, బయోగ్రాఫిక్ జోనర్ ఫిలిం ఇది. బయో ఎపిక్ అనాలి. ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్న క్యూరియాసిటీ ఉంది.
మీ రాకతోనే ప్రాజెక్టు స్థాయి పెరిగింది అనుకోవచ్చా?
నేను ఔటాఫ్ ది వే వెళ్లి ఆ క్యారెక్టర్ చేశా. నేనేం చేసినా నా ఇంటెన్షన్ మంచి కోసమే. మన తెలుగు కల్చర్ గురించి చెప్పే సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఇంటెన్షన్‌తో చేశాను.
మీ అంతట మీరుగానే గుణశేఖర్‌ని కలిసి నటిస్తానని అడిగారుట కదా?
నేను రెగ్యులర్‌గానే గుణశేఖర్‌గారిని కలుస్తుంటాను. ఆ సందర్భంలోనే రుద్రమదేవి కథ చెప్పారు. షూటింగ్ అంతా అయిపోయింది. కానీ గోన గన్నారెడ్డి క్యారెక్టర్ వేరే ఎవరూ చేయలేదు.. అని అనుకుంటున్న టైమ్‌లో నేనే వెళ్లాను. ఆ పాత్రను నాకు తగ్గట్టుగా మార్చుకోగలిగితే చేస్తానని అన్నా. ఆయన చాలా హ్యాపీ ఫీలై, ఆ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దారు.
ఎవరూ చేయలేదు.. అన్న డైలమాలో ఉన్నపుడు మీరే ఎందుకు చేశారు?
గుణశేఖర్ మన తెలుగు కల్చర్‌కి సంబంధించిన ఓ చక్కని సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాకి ఎవరూ సపోర్ట్ చేయడంలేదు ఏంటి? అని నేను ఫీలై ముందుకు వచ్చాను. అలాగే ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది నచ్చింది. ఇంత ప్యాషనేట్‌గా ఆయన చేస్తున్న ప్రయత్నం ఆకట్టుకుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా ఫీలై చేశాను. అన్నీ మనీ లెక్కలే వేయకూడదు. అందుకే నేను నటించాను.
మీరు చేసింది కరెక్టే అన్న గట్ ఫీలింగ్ ఎప్పుడు కలిగింది?
ఇందులోకి ఓ మంచి ఇంటెన్షన్‌తో దిగాను. నిజానికి ఒరిజినల్‌గా గోన గన్నారెడ్డి క్యారెక్టరైజేషన్ నాకోసం రాసినది కాదు. వేరే ఏజ్ గ్రూప్‌కి రాసుకున్నది. నేనొక యంగ్ హీరోని. నాకు తగ్గట్టే ఆ క్యారెక్టర్‌ని మార్చాలి. డైలాగ్స్ సహా అన్నీ రెడీ అయ్యాక నాకు వ్యక్తిగతంగా కిక్కిచ్చింది. ఇతనికి సూటవ్వుద్దా? అనే లెవల్ నుంచి ఇతనికే సూటవ్వుద్ది అనే లెవల్‌కి క్యారెక్టర్‌ని మలిచారు. నేనే చేయాలి అనిపించేలా మార్చారు.
గోన గన్నారెడ్డి ఏజ్డ్ అని అంటున్నారు.. మరి అలాంటప్పుడు యంగ్ హీరో యాప్ట్ కాదు కదా?
రామాయణాన్ని బాలరామాయణంగా బాల నటీనటులతో తీసిన అనుభవజ్ఞుడు గుణశేఖర్. అందుకే రుద్రమదేవి చిత్రంలో పాత్రలన్నిటినీ యంగ్ పీపుల్‌తోనే తెరకెక్కించారు. నేను, రానా, క్యాథరిన్, నిత్యా అన్నీ యంగ్ క్యారెక్టర్లే.
హిస్టారికల్ అనగానే క్యారెక్టర్ల ఔట్‌ఫిట్ ఎలా? ముందే ప్రిపరేషన్ ఎలా చేశారు?
రుద్రమదేవికి రిఫరెన్స్ పిక్చర్స్ ఏవీ లేవు. గోన గన్నారెడ్డి అనే క్యారెక్టర్ ఉంది తప్ప రిఫరెన్స్ పిక్చర్స్ ఏవీ లేవు. 16వ శతాబ్దం నుంచి పెయింటింగ్స్ ఏవీ అందుబాటులో లేవు. గోన గన్నారెడ్డి అనగానే పాపులర్ దొంగ. ఓ రాబిన్‌హుడ్ తరహా క్యారెక్టర్. ఇతనికి నల్లని డ్రెస్ ఔట్‌ఫిట్ కావాలి. రఫ్‌గా ఉంటాడు. చినిగిపోయిన బట్టలు ఉంటాయి అని డిజైన్ చేసుకున్నాం. దొంగ ఇలా ఉంటాడు అని సైకలాజికల్ ఫీలింగ్‌తో రీసెర్చ్ చేశాం.
కానీ హెయిర్ స్టయిల్ మోడ్రన్‌గానే ఉంది? అప్పట్లో లాంగ్ హెయిర్ ఉండేది!
అందుకు కథలో కూడా రీజన్ ఉంది. అప్పట్లో లాంగ్ హెయిర్ లేని వాళ్లకు బుర్ర సుంకం అని పన్ను వేసేవారు. అందుకే పొడవాటి గిరజాలతో కనిపించేవారు. కానీ ఇందులో గన్నారెడ్డి రెబల్ క్యారెక్టర్. పొట్టి హెయిర్‌తో ఇలానే ఉంటాను అని ఎదిరించే విప్లవకారుడు. అందుకే ఆ హెయిర్‌తో కనిపించాడు. ఇది నా ఇంటర్‌ప్రెటేషన్.
ఓ మంచి ఆలోచనతో ఈ పాత్ర చేశారు? వెనక్కి లాగినవాళ్లు ఉంటారు కదా!
ఎందుకు ఈ క్యారెక్టర్ చేయడం అవసరమా? హీరోగా చేసేప్పుడు అని వెనక్కి లాగారు చాలామంది. కానీ నేను ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఉంటూనే ఇలాంటి మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు చేసేవారు. ఎన్టీఆర్ గారు 200వ సినిమాకి కూడా ఓ క్యారెక్టర్ చేసేశారు. అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మంచి క్యారెక్టర్లకు విలువనిచ్చేవారు. హాలీవుడ్‌లో బ్రాడ్ పిట్ లాంటివాళ్లు అలానే చేస్తున్నారు. నిత్యామీనన్ కూడా పాత్ర నచ్చితేనే రెడీ అంటుంది. నేను నటిని. మంచి పాత్రలు ఏవి వచ్చినా చేస్తానని ముందుంటుంది.
రానా, మీరు ఫ్రెండ్సు కాబట్టి కలిసి నటించారా?
ఈ చిత్రంలో రానాకి నాకు కాంబినేషన్ సీన్స్ ఏవీ లేవు. ఒక సీన్ తప్ప.. మేం ఫ్రెండ్సే కదా అని చేసిందేం లేదు. ఆ అవసరం రాలేదు.
మీ పాత్ర భాష, యాస ఎలా ఉంటుంది?
గోన గన్నారెడ్డికి కొంత రాయలసీమ, కొంత పాలమూరు ప్రాంతాలతో టచ్ ఉంది. అయితే ఎక్కువ తెలంగాణతో టచ్ ఉన్న మనిషి. అరదుకే తెలంగాణ యాస ఉండాలని అనుకున్నాం. అయితే తెలంగాణ యాస అన్నిచోట్లా అర్థం కాదు. అందుకే అందరికీ అర్థమయ్యేలా ఆ పాత్రతో మాట్లాడించారు. తెలంగాణం మాట్లాడితే ప్రత్యేకత ఉంటుందని భావించాం. రెగ్యులర్ భాషనే తెలంగాణ భాషలో రాయిస్తే చాలా బ్యూటీ వచ్చింది. చారిత్రకం కాబట్టి కొంత గ్రాంధికం ఉండాలి. కానీ దొంగ, బందిపోటు కాబట్టి గ్రాంధికం తీసేయొచ్చు అనుకున్నాం. కొంత కలోకియల్ భాష మాట్లాడించాం. కలోకియల్ తెలంగాణ భాష వినిపిస్తుంది.
రుద్రమదేవి తెలుగు రాణి, ఇతర భాషల్లో ఎందుకు చూడాలి?
రుద్రమదేవి కథ తెలుగుకే పరిమితం కాదు. తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర అన్నిటినీ కలుపుకుని సామ్రాజ్యం విస్తరించి ఉంది. అందులో వరంగల్ రాజధానిగా పరిపాలించింది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సినిమా ఇది. ఆడాళ్లు ఎందుకు రూల్ చేయకూడదు? అనేది యూనివర్శల్ పాయింట్. ఆ రోజుల్లో ఒక లేడీ పరిపాలన అంటే ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి? అన్నదే సినిమా. అందుకే ఏ భాషలో అయినా చూడొచ్చు.
మీ క్యారెక్టర్ విషయమై చిరు మీకు ఏం సలహా ఇచ్చారు?
సలహా ఏం లేదు. ఇందులో ఓ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. ఆ వాయిస్ ఓవర్ ఎవరు చెబితే బావుంటుందని గుణశేఖర్ ఆలోచిస్తుంటే చిరంజీవిగారు అయితే బావుంటుందని నేనే చెప్పాను. ఒక హిస్టారికల్ సినిమాకి ఆయన వాయిస్ అయితే బావుంటుందని అన్నాను. ఆయన చిరుని అడగగానే ఓకే చేసేశారు.
బాహుబలి తర్వాత ఇలాంటి చారిత్రక కథాంశంలో మీరు భాగం అవ్వడం అదృష్టం అనుకోవచ్చా?
బాహుబలిని దీనిని పక్కపక్కన పెట్టి చూస్తున్నారు. ఎటాచ్ చేస్తున్నారు. కానీ అది జానపదం, రుద్రమదేవి హిస్టారికల్. అప్పట్లో రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణం రాజుగారు.. వాళ్లు క్యారెక్టర్ చేస్తే అలా గుర్తుండిపోయేవి. శ్రీకృష్ణుడు, అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు అలా గుర్తుండిపోయే పాత్ర గోన గన్నారెడ్డి.
బాహుబలి, శ్రీమంతుడు తర్వాత మీరు గమనించిన మార్పు?
బాహుబలి, శ్రీమంతుడు, సినిమా చూపిస్త మావ, భలే భలే మగాడివోయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నీ మంచి సినిమాలొస్తున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. ఇది మంచి సీజన్.
వరుసగా పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి.. పోటీలో రిలీజ్ మంచిదేనా?
సినిమా బావుంటే నాలుగైదు సినిమాలు ఒకేసారి రిలీజైనా ఆడుతాయి.
సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్ టైమ్‌లో గోనగన్నారెడ్డి ఆఫర్ వచ్చిందని విన్నాం!
అవును. నెలరోజుల్లో సన్నాఫ్ సత్యమూర్తి మొదలవుతుంది అనగా ఈ అవకాశం వచ్చింది.. ఏం చేయమంటారు? అని త్రివిక్రమ్‌ని అడిగాను. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు.
ఇతర మార్కెట్లను కలుపుకునే సినిమాలు చేయరా? బాలీవుడ్ వెళ్లరా?
భవిష్యత్‌లో బాలీవుడ్, సౌత్ కలిపి సినిమాలు వస్తాయి. పాన్ ఇండియన్ సినిమాలు తెరకెక్కుతాయి. అయితే బాలీవుడ్‌కి వెళ్లి లాంగ్ రన్‌లో కొట్టేయడం అంటే కుదరదు. ఇలా వెళ్లి అలా రావడమే. టాలీవుడ్ వదిలేసి వెళ్లి అక్కడ సినిమాలు చేయాలనుకుంటేనే వెళ్లాలి. కానీ అది కుదరదు. ఇక్కడ సాధించింది అంతా విడిచిపెట్టి వెళ్లలేం. మన హీరోలంతా అక్కడికి వెళ్లి మంచి సినిమాలు చేశారు. కానీ ఇక్కడే ఫోకస్ పెట్టారు.
చిరు 150వ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా?
చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నా.
మీ ఇంట్లోనే బోలెడంత కాంపిటీషన్?
మంచిదేగా, పోటీ స్పిరిట్ ఉండాల్సిందే.
20 ఏళ్ల తర్వాత బన్ని?
40 ఏళ్ల తర్వాత కూడా మంచి నటులు కావాలి.
ముంబై విలన్లను, ఇతర భాషల నటుల్ని తెచ్చుకుంటున్నాం అని మనవాళ్లు విమర్శిస్తున్నారు?
అది కొంతవరకూ కరెక్టే. కానీ కొన్ని క్యారెక్టర్లు వాళ్లే చేయాలి. పైగా వాళ్లకు ఉన్న ఫిజికల్‌గా స్ట్రక్చర్ మనకు ఉండదు. అయితే మన తెలుగు నటీనటులకు ప్రోత్సాహం కావాలి. నా వంతుగా కొంత ప్రయత్నిస్తున్నా. కుదిరితే తెలుగువాళ్లను పెట్టుకుందాం అని అంటున్నా.
భవిష్యత్ సినిమా ఎలా ఉండాలి?
న్యూ ఏజ్ సినిమాలు తీయాలి. రుద్రమదేవి ఆ తరహా సినిమానే. ఈ నెల 9న రిలీజ్‌కి వస్తున్న రుద్రమదేవి చిత్రాన్ని 3డిలో చూసి ఆస్వాదించండి. ఓ అద్భుతమైన హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
బోణీ చిత్రంతోనే మెగా ఫ్యామిలీ నుంచి సరైన వారసుడొచ్చాడు అనిపించుకున్నాడు. డాన్స్ లతోపాటు డైలాగ్ డెలివరీలో స్టార్ లకు ఏమాత్రం తీసిపోకుండా మామలకు తగ్గ అల్లుడిగా దూసుకెళ్తున్నాడు. మొదటి చిత్రం పిల్లా.. నువ్వులేని జీవితం హిట్ కావటంతోపాటు వెనువెంటనే భారీ ప్రాజెక్టులు సైన్ చేసి సెన్సేషన్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. త్వరలో హరీష్ శంకర్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందు సాయిధరమ్ ఇంటర్వ్యూ మీకోసం...
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కొత్త పాయింట్ ఏంటి?
ఎమోషన్ రొమాన్స్ సన్నివేశాల్లో కొత్తదనం కో్సం ప్రయత్నించా. నా పాత్ర కోసం దర్శకుడితో కలిసి బోలెడంత డిష్కస్ చేశాను. ఇందులో కొత్త సాయి ధరమ్ ని చూస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఏదైనా డిగ్రీ చదువుతున్నామా? అన్నట్టే ఉంది. నా జీవితంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. ఓ మరచిపోలేని అనుభూతి.
కథ గురించి?
గబ్బర్ సింగ్ తరహాలోనే ఈ చిత్రం కూడా హరీష్ శైలిలో సాగే కమర్షియల్ ఎంటర్ టైనర్. అదే టైంలో నిర్మాత దిల్ రాజు టేస్ట్ కు తగ్గట్టు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు పెద్ద పీట వేశారు. కుటుంబ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. మొత్తంగా ఇదో పూర్తి స్థాయి ఎంటర్ టైనింగ్ ప్యాకేజ్.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
సుబ్రహ్మణ్యం పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. డబ్బు కోసం డిఫరెంట్ కోణంలో వసూళ్లు చేసే వాడు సుబ్బు. పాత్ర ఆధారంగా చేసుకొని కథలోని ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. సుబ్రమణ్యంకి డబ్బు అవసరం ఏమిటి? అతడు అమెరికా ఎందుకు వెళ్ళాడు? ఇలాంటి ప్రశ్నల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. నా గత రెండు చిత్రాల కంటే వైవిధ్యంగా కథాంశం ఉంటుంది.
హరీష్ శంకర్ తో మీ ప్రయాణం?
హరీష్ ‘మిరపకాయ్’ సినిమా తీసినప్పట్నుంచి బాగా తెలుసు. ఈ సినిమా ఆరంభానికి ముందే... నేనిప్పుడు ఫ్లాపిచ్చిన డైరెక్టర్ ని - గబ్బర్ సింగ్’ డైరెక్టర్ ను కాను అని అన్నారు. కథ వినగానే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. వెంటనే చేసేద్దాం అని నిర్ణయించుకున్నా. హరీష్ తో కలిసి పనిచేయడం అంటే ఓ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
రెజీనాతో వరుసగా రెండో సినిమా కదా?
రెజీనా ఓ మంచి ఫ్రెండ్. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటూంటాం. స్నేహితులమే కాబట్టి ఆన్ సెట్స్ సరదాగానే గడిచిపోయింది. నాకు బేసిగ్గా రొమాన్స్ సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బంది. అలాంటివి చేయాల్సి వచ్చినపుడు రెజీనా నేను ముందే డిస్కస్ చేసుకొని సీన్ సరిగ్గా రావడానికి మా వంతుగా ఏమేం మార్పులు చేయొచ్చో ముందే అనుకునేవాళ్లం.
దిల్ రాజుతో వరుస సినిమాలు? కారణం?
ఆయన మంచి కథలతో రెడీగా ఉన్నారు. అవన్నీ నాకూ నచ్చాయి. దీంతో వరుసగా కమిటయ్యా. పిల్లా నువ్వులేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ - అనిల్ రావిపూడి సినిమా - శతమానం భవతి అన్నీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్లోనే.
మామయ్య హిట్ సాంగ్ రీమేక్ చేశారు గా?
గువ్వ గోరింకతో .. సాంగ్ ఎనర్జిటిక్ సాంగ్. ఈ సినిమాలో ఒక మెలోడీలా కనిపిస్తూనే మంచి ఎనర్జీనిచ్చే పాట రావాల్సిన సందర్భం ఒకటి ఉంది. దానికి మావయ్య సినిమాల్లోని ఈ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని ఎంచుకున్నాం. మావయ్య సాంగ్ స్థాయిని అందుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మా వరకూ ఓ ప్రయత్నం అంతే.
బాడీ లాంగ్వేజ్ గురించి వస్తున్న కామెంట్లు?
మావయ్యల బాడీ లాంగ్వేజ్ ను ఫాలో అవ్వడం ఇమిటేట్ చేయడం లాంటివి అస్సలు చేయను. కానీ, చిన్నప్పట్నుంచీ మావయ్య వాళ్ళను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన వాడిని కావడంతో వాళ్ళ మ్యానరిజమ్స్ కొన్ని నాకూ వచ్చాయి. అంతే తప్ప కావాలని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయను.
చిరు సినిమాల్లో ఏదైనా రీమేక్ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారా?
అలాంటి ఆలోచనే చేయను. చిరంజీవిని అందుకోవడమంటే అంత ఈజీ కాదు. ఇలా మన సినిమాలు చేస్తూ పోవడమే కానీ మావయ్య సినిమాలు రీమేక్ చేయడమనే ఆలోచనను దగ్గరకు రానివ్వను.
మెగా ఫ్యామిలీలోనే మీకు చాలా పోటీ ఉందిగా?
పోటీ గురించి నేను ఆలోచించను. ఎవరికి వారే. వారి వారి టాలెంట్ ను అనుసరించి మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీ మొత్తం అందరినీ ఆదరిస్తుంది. ఒకేరోజు మా సినిమాలు రిలీజైనా బావుంటే జనాలు ఆదరిస్తారు. పోటీలో అలా సినిమాలు రిలీజ్ కావడం మంచిదే.
అప్ కమింగ్ ప్రాజెక్టులు?
‘తిక్క’ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అనిల్ రావిపూడితో చేస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్ కెళతాం. అలాగే ఆ తర్వాత ‘శతమానం భవతి’ ప్రారంభం కానుంది. అన్నింట్లో నావంతు నటనను నేను కనబరుస్తాను అంటూ ముగించాడు సాయి ధరమ్ తేజ్.
వెన్నెలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్థానంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న చైతూ ను ఆటోనగర్ సూర్య గా ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరోగా చూపించాడు. విలక్షణమైన తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు దర్శకుడు దేవాకట్టా. డైలాగుల్లో ఉండే ఎమోషన్, వాటిల్లో ఉండే డెప్త్ అతడి ఆయుధాలు. ఇప్పుడు మంచు విష్ణు హీరోగా డైనమెట్ చిత్రంతో రేపు (సెప్టెంబర్ 4)న మన ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ కి దేవా కట్టా చెప్పిన విషయాలు...
డైనమెట్ కథ ఏంటి?
సమకాలీన సమస్యని ప్రతిబింబించే కథాంశమిది. డైనమైట్ కి తమిళ మాతృకతో పోలికే ఉండదు. ఒక అమ్మాయి సమస్యని తన సమస్యగా భావించి హీరో ఏం చేశాడన్నదే సినిమా. ఎనిమీ ఆఫ్ ది స్టేట్ మిషన్ ఇంపాజిబుల్ తరహా చిత్రమిది. అద్భుతమైన రన్ తో ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రను ఎంతో ప్రేమతో తీర్చిదిద్దా. జేడీ అవ్వడం వల్లే అలా చేశానేమో! విష్ణుకి జేడీకి మధ్య మైండ్ గేమ్ తరహా సన్నివేశాలు సినిమాకే హైలైట్.
రీమేక్ చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
ఆటోనగర్ సూర్య తర్వాత కొత్తగా కథలు రాసుకుంటున్న టైమ్ లో అరిమానంబి రీమేక్ చేద్దాం.. చూడు అన్నారు విష్ణు. అందులో క్యారెక్టరైజేషన్ నచ్చింది. అయితే అందులోని ఎలిమెంట్స్ ఉపయోగించుకుని నేను కొత్తగా రాసుకున్నా. అవసరమైనంత స్వేచ్ఛనిచ్చాడు విష్ణు. పక్కా స్క్రిప్టు ప్రణాళికతో 56రోజుల్లో పూర్తి చేశాను. మనసుకు చేరువైన చిత్రమిది. వాస్తవానికి రీమేక్ చేయాలనుకోను. కానీ ఇది నచ్చి చేసిన సినిమా.
విష్ణుని కొత్త కోణంలో చూపిస్తున్నట్లున్నారు?
అవును.. కాలేజీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రాలు స్నేహితులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే ఓ కుర్రాడి జీవితంలో మలుపులే సినిమా.
హీరోయిన్ క్యారెక్టర్ గురించి?
హీరోయిన్ ఒరియంటల్ చిత్రం కావటంతో కష్టపడి వెతికాం. ఆటైంలో విష్ణు ప్రణీత పేరు సజెస్ట్ చేశాడు. తెలుగమ్మాయి కాకపోయినా సినిమా కోసం బాగా కష్టపడింది. ఇంతకు ముందు సినిమాలకంటే ఇందులో పరిణితి చెందిన నటన కనబరుస్తుందని ఖచ్ఛితంగా చెబుతున్నా.
విలన్ గా జేడీ చక్రవర్తి ఎంపిక చేయడంలో ఉద్ధేశం?
నాకు కథ లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నప్పుడు మదిలో మెదిలిన రూపం జేడీయే. బహుశా ఆయన కోసమే ఈ చిత్రం నా చేతికొచ్చిందేమో అనిపించింది. షూటింగ్ టైంలో కూడా నా కాంసంట్రేషన్ మొత్తం ఆయనపైనే ఉంది. పవర్ ఫుల్ గా ఆయన క్యారెక్టర్ ని తీర్చి దిద్దాను.
మొత్తం చిన్న సినిమాలే చేస్తున్నారే?
పెద్ద హీరోతో పెద్ద సినిమాల విషయంలో దర్శకుడు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటే తప్ప సినిమాలకు పరాజయాలు ఉండవు. కానీ చిన్న సినిమాకి అలా కాదు. ప్రతి క్షణం ఆత్రుతగా పనిచేయాలి. నాకు అలా కష్టపడటం ఇష్టం.
మరి ఆటోనగర్ సూర్య టైంలో మీపై వచ్చిన ఆరోపణలు?
ఆటోనగర్ సూర్యకి కేవలం 9కోట్లు మాత్రమే ఖర్చయ్యింది. కానీ 25కోట్లు ఖర్చయ్యిందని ప్రచారం చేసి దర్శకుడినైన నా సామర్థ్యాన్ని లూటీ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయడమే నా సామర్థ్యం.
బాహుబలికి డైలాగ్ లు రాశారు కదా?
బాహుబలికి ఒకే ఒక్క సన్నివేశానికి మాటలు రాశా. కానీ రాజమౌళి పెద్ద క్రెడిట్ ఇచ్చారు. నా ప్రస్థానం నచ్చి ఆయన మెచ్చుకున్నారు. ఆటోనగర్ సూర్య టీజర్ లో డైలాగ్ ని మెచ్చుకున్నారు.
అప్ కమింగ్ చిత్రాల గురించి?
ప్రస్తుతం నాలుగు కథలున్నాయి. వాటికి ఎవరు సరిపడితే వారినే ఎంపిక చేసుకుంటాను అంటూ సెలవు తీసుకున్నారు.
మాస్ ప్రేక్షకులకు రారాజు రవితేజ. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఎప్పుడూ రెడ్ బుల్ తాగిన వాడిలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. తన దగ్గరికి స్క్రిప్ట్ తో వచ్చే ఏ దర్శకునికి కూడా నో చెప్పకుండా కొత్తవారిని సైతం ఎంకరేజ్ చేస్తుంటాడు. అందుకే రవితేజ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకం. ఇక ఆరేళ్ల క్రితం ఆయన హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ వచ్చింది. అది బ్లాక్ బస్టర్. రవితేజ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు డబుల్ కిక్ ఇచ్చేందుకు కిక్ 2 తో వస్తున్నాడు. ఇది సీక్వెల్ కాదంటున్నాడు మాస్ రాజా. కంపోర్ట్ కోసం ఓ యువకుడు పడే తాపత్రయమే ఈ చిత్రమట. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ కి రవితేజ ఇచ్చిన ఇంటర్వ్యూ...
తొలుత సీక్వెల్ అన్నారు?
కిక్ కథ వేరు. దీని కథ వేరు. రెండూ వేర్వేరు కథలు, క్యారెక్టర్లు. కాకపోతే కిక్ లోని షేడ్ లు ఇందులోని పాత్రలపై కాస్త కనిపిస్తాయి.
ఇంతకీ కథ ఏంటీ?
ఓ వ్యక్తి తన కంఫర్ట్ కోసం కథని ఎలా నడిపించాడన్నదే సినిమా. రాబిన్ హుడ్ తరహాలో కనిపిస్తా. నా కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా.
సినిమా కోసం చాలా చేంజ్ అయ్యారు?
ఈ సినిమా కోసమే బరువు తగ్గలేడు. ఆరోగ్యం కోసం బరువు తగ్గాను. 82 కేజీల నుంచి 72 కేజీలకు తగ్గా. ఆ ప్రాసెస్ లో ఉండగా కిక్2 సెట్స్ కెళ్లింది .. కాబట్టి తక్కువ బరువుతో కనిపించానంతే.
కిక్ 2 గురించి అప్పుడే అనుకున్నారా?
అలాంటిదేం లేదు. కాకపోతే ఎండింగ్ ని బట్టి కిక్ 2 ఉంటుందని అంతా అంచనా వేశారు. అదే ప్రచారమైంది. ప్రచారమైందే ఇప్పడు నిజమైంది. వక్కంతం చెప్పిన ఓ లైన్ ఆకట్టుకుంది. దాన్నే డెవలప్ చేస్తే కిక్ 2 అయ్యింది. అదీ సంగతి. ఇంకో విషయమేంటంటే కిక్ 3 కి కూడా ప్లాన్ వేస్తున్నాం.
ఇందులో హైలెట్స్?
తొలికాపీ ఇంకా చూడలేదు. కానీ అందరికీ నచ్చే సినిమా ఇది. మనోజ్ పరమహంస కెమెరా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అస్సెట్స్. డబుల్ కిక్ షురూ..
ఈ మధ్య తెలుగు సినిమా ఖ్యాతి ఖండాతరాలు దాటింది. దీనిగురించి?
బాహుబలితో తెలుగువాడి గౌరవం ఉత్తరాదిన పెరిగింది. బాహుబలి శ్రీమంతుడు కొత్త మార్కెట్ కి తలుపులు తెరిచాయి. ఇది మంచి పరిణామం.
కొత్త సినిమాలు ఏమైనా చూశారా?
బాహుబలి, శ్రీమంతుడు ఈ రెండు సినిమాలతో పాటు రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మావ చూశాను. చాలా బావుంది. రాజ్ తరుణ్ చాలా బాగా నటించాడు. నవతరం దూసుకు రావాలి.
అన్నట్టు పూరితో మళ్లీ సినిమా ఎప్పుడు ఉంటుంది?
ఇడియట్ తర్వాత ఇడియట్ 2 చేద్దామనుకున్నా కుదరలేదు. కిక్ 2 తర్వాత కుదిరినా కుదరొచ్చు. పూరితో పనిచేసి చాలా కాలమైంది. వచ్చే ఏడాది కలిసి పనిచేసే అవకాశం ఉంది.
మల్టీ స్టారర్లపై మీ అభిప్రాయం?
మల్టీస్టారర్లకు సిద్ధమే. వెంకీ తో వీరూపోట్ల దర్శకత్వంలో చేయాల్సింది. కానీ కుదరలేదు.
తదుపరి ప్రాజెక్టులు ?
సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో రిలీజవుతుంది. తదుపరి ప్రాజెక్టు ఇంకా ఏవీ నిర్ణయించలేదు.
యంగ్ జనరేషన్ మిమల్ని బాగా ఇమిటేట్ చేస్తున్నట్టున్నారు?
యువహీరోలు నన్ను ఇమ్మిటేట్ చేయడం కాదు. నాది ఫ్రీ యాక్టింగ్ స్టయిల్. అది అలవాటు చేసింది పూరీగారు. ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. కానీ, వాళ్లు నన్ను ఇమిటేట్ చెయ్యకుండా వాళ్లకో స్టైల్ క్రియేట్ చేసుకుంటే మంచింది అంటూ ముగించాడు మాస్ రాజా.