ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పరిచయమవుతున్న సినిమా ఆంధ్రాపోరి. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన అనుభవం ఆకాశ్ సొంతం. ఆంధ్రాపోరి సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాశ్ హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ విశేషాలు...
ఆంధ్రాపోరిలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
- చాలా బావుంటుంది. మరో ఆరేళ్ల తర్వాత హీరో అవుదామనుకున్న నేను కథ నచ్చడంతోనే ఈ సినిమాలో నటించాను. హీరో పాత్ర సూపర్బ్ గా ఉంటుంది. ఈ సినిమాలో నేను చిరంజీవి ఫ్యాన్ గా నటిస్తున్నా. నిజానికి చిత్రాల్లో నటించేందుకు నాకు ఇన్స్పి రేషన్ చిరంజీవిగారే కావటం విశేషం. ఇక ఈ చిత్రంలో ఆంధ్రా అమ్మాయిని ప్రేమించే పాత్ర. తన పేరు కూడా నో్రు తిరగకపోవడంతో ఆంధ్రా పోరి అని పిలుస్తుంటాను. నేను తెలంగాణకు చెందిన అబ్బాయిగా నటిస్తున్నా. ఇదొక టీనేజ్ లవ్ స్టోరీ.
సినిమాలో హైలైట్స్ ఏంటి?
చాలా హైలైట్స్ ఉన్నాయి. హీరో పాత్ర మెయిన్ హైలైట్. ప్రసాద్ ప్రొడక్షన్స్ లో నటించడం చాలా పెద్ద హైలైట్. రాజ్ మాదిరాజు డైరక్షన్, ఉల్కాగుప్తా నటన, జోశ్యభట్ల ట్యూన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... అన్నీ హైలైట్ అవుతాయి.
ప్రసాద్ ప్రొడక్షన్స్ లో నటించడం ఎలా ఉంది?
- హీరోగా నా లాంచింగ్ ప్రసాద్ ప్రొడక్షన్స్ లో జరగడం చాలా హ్యాపీ. ఎంతోమంది లెజెండ్స్ పనిచేసిన సంస్థలో నాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా లక్కీ.
మీ నాన్నగారు సినిమా చూశారా? ఏమన్నారు?
- అసలు నాన్నగారు నటించమని చెప్పబట్టే నేను ఈ సినిమాలో నటించాను. ఒరిజినల్ వెర్షన్ టైమ్ పాస్ ను ఆయన ఎప్పుడో చూశారు. ఈ సినిమా చేయకపోతే తప్పకుండా ఏదో మిస్ అవుతావురా అని మా నాన్నగారు అన్నారు. ఆయన మాట విని మంచే చేశానని ఇప్పుడు అర్థమవుతోంది. నాన్నగారు తెలుగు వెర్షన్ ను ఇంకా చూడలేదు. బిజీగా ఉన్నారు.
డైరక్షన్ చేయాలని ఉందా?
- పూర్తి స్థాయి డైరక్టర్ ని కాదలచుకోలేదు. కాకపోతే తప్పకుండా ఒక సినిమాకు డైరక్షన్ చేస్తా.
హీరోగా కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారా?
- లేదండీ. మరో మూడేళ్లు గ్యాప్ తీసుకుంటున్నా. ఫస్ట్ బ్యాంకాక్ కి వెళ్లి ఫైట్లు నేర్చుకోవాలి.ఆ తర్వాత మిగిలిన కోర్సులన్నీ చేయాలి.
తెలంగాణ యాసలో మాట్లాడటం కష్టమనిపించిందా?
- ముందు రాలేదు. కానీ ఉల్కాగుప్తా ఎక్కడినుంచో వచ్చి తెలుగు చాలా బాగా మాట్లాడేస్తుంటే కాసింత రోషం వచ్చింది. నా తెలుగులో ఒక యాసను మాట్లాడలేనా? అనిపించి నేర్చకున్నా. పర్ఫెక్ట్ గా వచ్చింది.
దర్శకనిర్మాతల గురించి చెప్పండి?
- డైరక్టర్ ది పాల్వంచ. అయన సొంత ఊర్లోనే సినిమా చేశాం. మా నిర్మాత టీమ్ అందరితోనూ ఫ్రెండ్లీగా కనిపించడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది.
'రెయిన్ బో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నటి సోనాల్ చౌహాన్. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సోనాల్ 'లెజెండ్' సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె నటించిన 'పండగ చేస్కో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్ తో నీహార్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ...
ఈ సినిమా ఎలా ఉండబోతోంది..?
ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, మ్యూజిక్, యాక్షన్, కామెడీతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. మంచి ఎమోషనల్ మసాలా మూవీ ఇది. సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది.
మీ పాత్ర గురించి..?
ఈ సినిమాలో నేను ఓ ఎన్.ఆర్.ఐ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నా రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందరి మీద అధికారం చెలాయిస్తూ, చాలా పొగరుగా ఉండే పాత్రలో కనిపించనున్నాను. ఈ పాత్రలో నటించడం కొంచెం రిస్క్ అనే చెప్పాలి. కాని నా వరకు ఓ నటిగా వెర్సటయిల్ క్యారెక్టర్స్ లోనే నటించాలనుకుంటాను. ఈ సినిమాలో పాత్ర భిన్నంగా ఉండడంతో నటించాను. నటిగా నాకు ఇదొక మంచి అవకాశం.
మీ కో యాక్టర్స్ రామ్, రకుల్ ప్రీత్ సింగ్ గురించి..?
రామ్ ఒక ఎనర్జిటిక్ స్టార్. ట్రెమండస్ యాక్టర్. తన శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నట్లుగా డాన్స్ చేస్తాడు. మా కొరియోగ్రాఫర్ హెల్ప్ చేసారు కాబట్టి ఆయనతో డాన్స్ చేయగలిగాను. రామ్ తో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ తన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక రకుల్ విషయానికి వస్తే సినిమాలో నాకు చాలా హెల్ప్ చేసింది. మంచి అమ్మాయి. తను కూడా బొంబాయి నుంచి వచ్చింది సో.. ఇద్దరం సినిమాల గురించి బాగా డిస్కస్ చేసుకునేవాళ్ళం.
దర్శకుడు గోపీచంద్ మలినేనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
డైరెక్టర్ గారికి తనకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో బాగా తెలుసు. క్లాస్ ఆడియన్స్ కు, మాస్ ఆడియన్స్ కు ఎలా చేస్తే సినిమా నచ్చుతుందో, రెండింటిని ఎలా బాలెన్స్ చేయాలో ఆయనకి తెలుసు. సినిమాకి అవసరమైన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సింగిల్ హ్యాండ్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. అందరిని మేనేజ్ చేస్తూ తనకు కావలసినట్లుగా ఔట్ పుట్ రప్పించుకున్నారు. చాలా ఓర్పు ఉన్న మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.
షూటింగ్ సమయంలో ఏమైనా మరిచిపోలేని అనుభవాలు ఉన్నాయా..?
ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఎంత మరచిపోవాలనుకుంటున్నా మర్చిపోలేకపోతున్నాను. పోర్చుగల్ లో అల్గార్ అనే ఓ ప్రాంతం ఉంది. బీచ్, హిల్స్ తో ఉండే ఓ స్టన్నింగ్ లొకేషన్ అది. అక్కడ సాంగ్ షూట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు నన్ను ఓ కొండ మీద నిలబడమన్నారు. వెనక్కి చూస్తే 150 అడుగుల లోతు ఉంది. విపరీతమైన గాలి వీస్తుంది. ఆ టైంలో నేను చచ్చిపోతాననుకున్నాను. ఇంకో షాట్ లో రామ్ అదే ప్లేస్ లో నన్ను తన మీద కూర్చోపెట్టుకొని డాన్స్ చేయాలి. చాలా బయపడ్డాను. అదొక మరచిపోలేని సంఘటన.
ఈ హాట్ సమ్మర్ లో మీ హ్యాంగ్ఔట్ ప్లేస్ ఏంటి..?
నాకు బొంబాయి కన్నా హైదరాబాద్ నచ్చింది. ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ కూడా నాకు చాలా నచ్చారు. స్పెషల్ గా నాకు నచ్చే ప్లేసెస్ అనేం లేవు. షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నా హోటల్ రూమ్ కి వెళ్ళిపోతాను. అక్కడే రిలాక్స్ అవుతాను.
మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులయ్యింది. తక్కువ సినిమాలు చేయడానికి కారణాలేంటి..?
నాకు పాత్ర నచ్చితేనే గాని సినిమాలలో నటించలేను. రెయిన్ బో సినిమా తరువాత నాకు ఆఫర్స్ వచ్చాయి కాని అన్ని రొటీన్ గా అనిపించాయి. గ్లామర్ రోల్స్ కన్నా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తేనే గుర్తింపు వస్తుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'షేర్' సినిమాకి సైన్ చేసాను. అనుష్క, ఆర్య నటిస్తున్న 'సైజ్ జీరో' చిత్రంలో నటిస్తున్నాను.
2002 లో రిలీజ్ అయిన 'ఆది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2015 నాటికి 150 కి పైగా సినిమాలలో నటించిన కమెడియన్ కారుమంచి రఘు. మే 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి విలేకర్లతో ముచ్చటించారు.
మీ బ్యాక్ గ్రౌండ్ గురించి..?
నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్ వైఫ్. నాకొక బ్రదర్ ఉన్నాడు. తను ఫాబ్రికేషన్ ఇండస్ట్రీ రం చేస్తున్నాడు. నేను ఎమ్.బి.ఎ కంప్లీట్ చేసి సాఫ్ట్ వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేసేవాడిని. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.
సినిమాలపై ప్యాషన్ తో వచ్చారా..?
1995 నుండి దర్శకులు వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి నాకు మంచి స్నేహితులు. మాకు సినిమా డైరెక్ట్ చేసే చాన్స్ వస్తే నీకు అవకాశం ఇస్తాం రఘు అని చెప్పేవారు. కాని నాకు సినిమాలపై ఆసక్తి ఏమి ఉండేది కాదు. ఏ రోజు సినిమా షూటింగ్ కు వెళ్ళలేదు. సినిమాలలోకి రావాలని అనుకోలేదు. వి.వి.వినాయక్ కు ఆ సమయంలోనే 'ఆది' సినిమా చేసే చాన్స్ వచ్చింది. బేసిక్ గా నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. వారి మనువడు నటించే సినిమాలో అవకాశం రాగానే ఓకే చేసేసాను. అప్పటి నుండి నా సినీ ప్రయాణం మొదలయ్యింది.
కమెడియన్ గా చేయడానికి కారణం..?
అందరితో సరదాగా మాట్లాడతాను. విభిన్నమైన 'యాస' లలో మాట్లాడగలను. తెలంగాణా, శ్రీకాకుళం, రాయలసీమ ఇలా అన్ని యాసలలో కొంచెం పట్టు ఉంది. సో.. ఏ సినిమా చూసిన తను ఇలా మాట్లాడాడు అని కామెంట్ చేసేవాడిని. అందమైన అమ్మాయిలని చూసి అక్క అనేవాడిని. ఒక్కొక్కసారి వారికి కోపం వచ్చేసేది. ఇలా అందరిని టీజ్ చేసేవాడిని. నాలో ఓ కామెడీ యాంగల్ ఉందని వి.వి.వినాయక్ గుర్తించి మొదటి సినిమాలో కమెడియన్ గా చాన్స్ ఇచ్చారు.
మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి..?
2002 లో స్టార్ట్ అయిన నా జర్నీ 2010 వరకు 38 సినిమాలు చేసాను. 2010లో రిలీజ్ 'అదుర్స్' మూవీతో నాకు మంచి పేరు వచ్చింది. అదుర్స్ తరువాత సుమారుగా 120 సినిమాలలో నటించాను. ఒక 2014లోనే పెద్ద హీరోలతో 25 సినిమాలు చేసాను. నా జీవితంలో బిగ్గెస్ట్ అచ్చీవ్మెంట్ అది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాన్, బాలకృష్ణ లతో నటించే అవకాశం రాలేదు. ఈ సంవత్సరం వాళ్ళతో ఖచ్చితంగా నటించే చాన్స్ వస్తుందని భావిస్తున్నాను.
టివి షోస్ కూడా బానే చేసినట్లున్నారు..?
2003లో చాలా టివి షోస్ చేసాను. సుమారుగా 1800 ఎపిసోడ్స్ చేసాను. షార్ట్ ఫిల్మ్స్, మినీ మూవీస్, డైలీ సీరియల్స్ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేసాను. టివి నాకొక స్కూల్ లాంటిది. చాలా నేర్చుకున్నాను. 'జబర్దస్త్' షో తో హోం ఆడియన్స్ కు దగ్గరయ్యాను. ఆ షో లోనే 27 ఎపిసోడ్స్ చేసాను. 27 గెటప్స్ వేసాను. జబర్దస్త్ తో సినిమాలలో మంచి చాన్స్ లు వస్తాయనుకున్నాను. కాని నేను అనుకున్నట్లు జరగలేదు. అందుకే ఆ షో లో కంటిన్యూ చేయలేకపోయాను.
కమెడియన్ గా చేయడం ఎలా అనిపిస్తుంది..?
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ కి కాంపిటిషన్ ఎక్కువ. దాదాపు 120 మంది కమెడియన్స్ ఉన్నారు. ప్రేక్షకులను నవ్వించడం అనేది చాలా కష్టమైన జాబ్. ప్రతి సినిమా కోసం మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. కాని కాంపిటిషన్ ఉంటేనే మనలో స్పీడ్ ఉంటుంది.
ఈ హీరోలతోనే చేయాలని ఏమైనా ఉందా..?
చిన్న, పెద్ద, కొత్త, పాత హీరోలు అనేం ఉండదు. అందరి హీరోలతో చేయాలనుంది. ఎవారికి వారికి వారి రేంజ్ లో అభిమానులు ఉంటారు. అందరి హీరోలతో చేస్తేనే ఆడియన్స్ కి రీచ్ అవుతాం. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాన్, బాలకృష్ణ లతో నటించే అవకాశం రాలేదు. ఈ సంవత్సరం వాళ్ళతో ఖచ్చితంగా నటించే చాన్స్ వస్తుందని భావిస్తున్నాను. త్రివిక్రమ్, బోయపాటి శీను దర్శకులతో సినిమా చేయాలనుంది.
'కిక్2' సినిమాలో ఎలాంటి రోల్ చేస్తున్నారు..?
'కిక్2' లో ఓ ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నాను. సురేందర్ రెడ్డి ఈ యాంగల్ లో నిన్నెప్పుడు చూడలేదు. అధ్బుతంగా నటించావు అని అప్రిసియేషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం పూరి జగన్నాథ్ చేసే ఓ సినిమాలో నెగటివ్ షేడ్ లో కనిపించనున్నాను. దాని కోసం నా బరువు కూడా తగ్గించుకున్నాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
రిలీజ్ అవ్వడానికి 10 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవి కాకుండా రామ్ చరణ్, గోపీచంద్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో నటిస్తున్నాను. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుంది. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తాననే నమ్మకం ఉంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘లయన్’. ఈ సినిమా ఈ నెల14న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత రుద్రపాటి రమణారావుతో ఇంటర్వ్యూ....
‘లయన్’ను ఎలా ఉండబోతుంది?
` తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులను అలరించేలా ఉంటుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ నటనలోని మరో యాంగిల్‌ను చూస్తారు. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌గా, కామెడితో సాగిపోతుంది. సెకండాఫ్ అంతా యాక్షన్‌తో మాసివ్‌గా ఉంటుంది.
‘లయన్’ టైటిల్‌ను పెట్టడానికి కారణం?
` ఈ ‘లయన్’ టైటిల్ పెట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి బాలకృష్ణగారు అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలభై ఆరువేల లయన్ క్లబ్స్. వీరు ప్రపంచ వ్యాప్తంగా తమ సేవను చాటుకుంటున్నారు. అలాగే బాలకృష్ణగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకమ్మ కాన్సర్స్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సేవాకార్యక్రమాలను చేస్తున్నారు.
బాలకృష్ణతో ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు?
` నేను బాలకృష్ణగారికి పెద్ద అభిమానిని. ఆయనతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమా చేయాలని అనుకున్నాను. వేరే దర్శకుడితో వెళ్లి ఆయన్ను కలిశాను. అయితే బాలకృష్ణగారు అలాంటి సినిమాలు చాలా చేశామని, ఏదైనా డిఫరెంట్‌గా చేద్దామని అన్నారు. అలాంటి సమయంలో సత్యదేవగారు చెప్పిన కథ నాకు నచ్చింది. నేను అదే కథను బాలకృష్ణగారికి వినిపించాను. ఆయనకి బాగా నచ్చింది. వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.
కథ వినగానే మీకు ఒక నిర్మాతగా ఏ అంశాలు నచ్చాయి?
` స్క్రిప్ట్ మొత్తమే డిఫరెంట్‌గా ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్ చూస్తే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఏ సీన్‌కి అదే డిఫరెంట్‌గా ఉంటుంది.
సత్యదేవ దర్శకత్వం గురించి..?
` కొత్త దర్శకుడు ఎలా చేస్తాడో అని చిన్న డౌట్ ఉండేది. అయితే ఆయన టేకింగ్ సూపర్. సింహాలో బాలకృష్ణగారు ఎంత కొత్తగా కనపడ్డారో ఈ సినిమాలో కూడా అలా కనపడతారు.
ఆడియో రెస్పాన్స్ ఎలా ఉంది?
` గతంలో బాలకృష్ణగారు, మణిశర్మగారి కలయికలో అనేక మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. వాటికి ఏ మాత్రం తగ్గని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ కృష్ణుడిపై ఉంటుంది. సెకండ్ సాంగ్ త్రిషపై టీజింగ్ సాంగ్ ఉంటుంది. అలాగే మూడు, నాలుగు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
బాలకృష్ణ రోల్ ఎలా ఉంటుంది?
` ఇందులో బాలకృష్ణ రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. అందులో ఒకటి నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్ రోల్. మరో రోల్ గురించి నేను చెప్పడం కంటే స్క్రీన్‌పై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
అభిమానిగా, నిర్మాతగా ‘లయన్’ ఎలాంటి ఫీలింగ్‌ను ఏర్పరిచింది?
` అభిమానిగా చాలా హ్యపీగా ఫీలయ్యాను. నిర్మాతగా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. సినిమా అవుట్‌పుట్ సూపర్‌గా ఉంది. నిర్మాతగా కూడా హ్యపీగా ఉన్నాను.
మరి విడుదల ఆలస్యం కావడానికి కారణం?
` ముందు మే 8న విడుదల చేయాలనుకున్నాం. సిజీ వర్క్ అంతా చెన్నైలో జరిగింది. ఆ వర్క్ జరిగే విషయంలో కొద్దిగా ఆలస్యం కావడం, దానివల్ల ఓవర్‌సీస్‌కి కాపీ వెళ్లడంలో డిలే అయింది. అంతే కాకుండా డి.టి.ఎస్. ఇంజనీర్ మధుసూదన్‌గారు మరణించడం ఇలా కారణాలతో సినిమా విడుదలను మే 14న విడుదల చేస్తున్నాం.
బాలకృష్ణతో పనిచేయడం ఎలా అనిపించింది?
` తొలిసారి అభిమానిగా అయన్ను కలిశాను. మొదటిసారి నలభై అయిదు నిమిషాలు మాట్లాడారు. తర్వాత సినిమాలో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడిరది. సినిమా షూటింగ్‌లో ఆయన కేర్ తీసుకుని మమల్ని నడిపించారని చెప్పాలి. ఆయన సహకారం మరువలేనిది. చాలా హ్యపీగా ఉన్నాను.
ఈ సినిమాలో హైలైట్స్?
` సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి పర్టికులర్‌గా హైలైట్స్ అని చెప్పలేం. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌లో వచ్చే ట్రైబల్ ఫైట్, క్లయిమాక్స్ చాలా సూపర్‌గా ఉంటాయి. అందరినీ అలరిస్తాయి.
నెక్స్ ట్ ప్రాజెక్ట్?
` ప్రస్తుతం బాలకృష్ణగారు 99, 100వ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన 101వ సినిమా అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను.
నటుడిగా తనకు జన్మనిచ్చిన దర్శకుడి పేరుకు` తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొన్న హీరో పేరు జత చేసి.. తన బిడ్డకు పేరు పెట్టుకొన్నాడతను!!
ఓ ప్రతిభావంతుడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ` తాను హీరోగా మొదలైన సినిమా ఆగిపోవడంతో.. సదరు దర్శకుడికి అవకాశం ఇవ్వడం కోసం తనే నిర్మాతగా అవతారం ఎత్తాడతను.
‘కృతజ్ఞత’.... మృగాల నుంచి మనుషులను వేరు చేసే ముఖ్య లక్షణాల్లో ఒకటి!
‘మానవత’.... ఇటీవలకాలంలో మనుషుల్లోంచి మాయమైపోతున్న ఓ మంచి లక్షణం!
ఆ రెండు లక్షణాల కలబోత.. ‘ధనరాజ్’ .
‘జగడం’తో నటుడిగా తనకు జన్మనిచ్చిన సుకుమార్` ‘జగడం’ టైంలో పరిచయమై, తన బ్యాడ్‌టైమ్‌లో తనకు అండగా నిలిచిన రామ్ పేర్లు జత చేసి తన కుమారుడికి ‘సుక్కురామ్’ అనే పేరు పెట్టుకొన్నాడు ధనరాజ్.
‘ఓ చచ్చినోడి ప్రేమకథ’ పేరుతో మొదలైన ఓ చిత్రం ‘సాయి అచ్యుత్ చిన్నారి’ దర్శకత్వంలో.. తను హీరోగా ఆరంభమై ఆగిపోవడంతో` తన కారణంగా ఒకరి కెరీర్ కిల్ కాకూడదనే ఉద్దేశ్యంతో.. సాయి అచ్యుత్‌ను దర్శకుడ్ని చేయడం కోసం` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రంతో నిర్మాతగా మారాడతను.
ధనరాజ్ వ్యక్తిత్వానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి.. ఈరోజున సినిమాల ద్వారా, ‘జబర్‌దస్త్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన ధనరాజ్ జీవితంలో సినిమా కష్టాలు.. సినిమాటిక్ సంఘటనలు ఎన్నో..
కొన్ని విన్నప్పుడు నిజంగానే ‘ఇవన్నీ’ జరిగాయా? అనిపిస్తుంది ఎవరికైనా!
కానీ జీవితం అంటే అంతే కదా.. ‘వాస్తవం’ ఒక్కోసారి కల్పన కంటే విచిత్రంగా ఉండడం సహజమే కదా..
ట్రూత్ ఈజ్ ఆల్వేజ్ స్ట్రెేంజర్ దేన్ ఫిక్షన్!!
మనుషుల్లో ఉండాల్సిన మరో లక్షణం`
తన ‘మూలాలు’ మర్చిపోకపోవడం!
చాలామంది, తాము కొంచెం ఒక స్థాయికి చేరుకోగానే తమ ‘మూలాలు’ ఓ మూలన మడిచి పెట్టేసి, ఎవరి మూలాన తాము పైకి వచ్చామో సైతం కప్పిపుచ్చి` అంతా ‘స్వయంకృషి’గా ‘స్వకుచమర్దనం’ చేసుకొంటారు!!
కానీ.. ధనరాజ్ అలా కాదు.
తాను ఓ హెటల్‌లో ‘సర్వర్’గా పని చేసానని చెప్పుకోవడానికి అతను ఎంత మాత్రం సిగ్గు పడడు!
కన్నీళ్లతో.. కాలే కడుపును చల్లార్చుకొంటూ` నీరసంతో కళ్లు తిరిగేలా.. నిస్సత్తువలో కాళ్లు అరిగేలా తిరిగిన రోజుల్ని మర్చిపోడు!
నిప్పుల కొలిమిలో కాల్చి.. సుతిమెత్తని సుత్తి దెబ్బలు వేయకుండా బంగారం ఆభరణంగా మారదు!!
కష్టాల కొలిమితో చెలిమి చేయకుండా మనిషి వ్యక్తిత్వం రాటుదేలదు!!
ఆశయ సాధనలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా` ఆపత్కాలంలో తనకు అండగా నిలిచినవాళ్లను మర్చిపోకుండా` ఎదిగే కొద్దీ ఒదిగిపోతూ.. తన సన్నిహితుల చిట్టాను రోజురోజుకూ పెంచుకొంటూ
వెళుతున్న ధనరాజ్` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఇంతకు మించిన ‘సక్సెస్ స్టోరి’ ఇంకేముంటుంది?
ఈ చిత్రం త్వరలో విడుదల కానుండడాన్ని పురస్కరించుకొని` తన గతాన్ని నెమరువేసుకోవడంతోపాటు` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ విశేషాలను ఆత్మీయంగా పంచుకొన్నారు ధనరాజ్. ఈరోజు (మే 7) ఆయన జన్మదినం..
అమ్మానాన్నల పెళ్లి కథ అచ్చమైన తెలుగు సినిమా కథ
మా అమ్మ (కమలమ్మ)` నాన్న (సత్యరాజ్)లది ప్రేమ వివాహం. అది కూడా కులాంతర వివాహం. మా నాన్న.. మా అమ్మావాళ్ల నాన్న దగ్గర లారీ క్లీనర్‌గా పని చేసేవారు. నాన్నది రాజుల కులం, అమ్మావాళ్లది రెడ్డి కులం. లారీ యజమాని అయిన మా తాత` తన లారీలో క్లీనర్‌గా పని చేసే మా నాన్నకు` తన కూతురునిచ్చి పెళ్లి చేసేందుకు సహజంగానే ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లోంచి పారిపోయి (లేచిపోయి) నాన్నను పెళ్లి చేసుకొంది అమ్మ. అందుకే కొన్ని సంవత్సరాలు తాతయ్యవాళ్లతో మాకు సత్సంబంధాలు లేవు. ఆ తర్వాత మెల్లగా సర్దుకుపోయారనుకోండి.
నాకు పదేళ్ల వయసులో నాన్నకు నూరేళ్లు నిండిపోయాయి
నాన్నది తాడేపల్లిగూడెం, అమ్మవాళ్లది హనుమాన్ జంక్షన్. నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్న లారీ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అందుకే నా చదువు కొన్నాళ్లు గూడెంలో` కొన్నాళ్లు హనుమాన్ జంక్షన్‌లో వానాకాలం చదువులా సాగింది. తాడేపల్లిగూడెంలో మా ఇంటి గోడకు సినిమా వాల్‌పోస్టర్లు అతికిస్తుండేవారు. వారానికోసారి మారుతుండే ఆ వాల్‌పోస్టర్స్‌ను.. సినిమా చూసినంత శ్రద్ధగా చూస్తుండేవాడ్ని. ముఖ్యంగా చిరంజీవిగారి ‘యముడికి మొగుడు’ పోస్టర్ చూశాక` మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోయాను.. ‘మన జీవితం సినిమాల్లోనే’ అని. కానీ.. అందుకోసం ఏం చేయాలి? ఎవర్ని కలవాలి? వంటివేమీ తెలియవు.
ప్రపంచాన్ని గెలిచిన పోటుగాడిలా ఫీలైపోయాను..
అమ్మకి కూడా చెప్పకుండా ఓరోజు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైద్రాబాద్‌లో వాలిపోయాను. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఫిలింనగర్ వెళ్లాలంటే ‘47 ఎఫ్’ బస్ ఎక్కాలని తెలుసుకొని, ఆ బస్సెక్కి ఫిలింనగర్‌లో పడ్డాను. ఓ రెండు రోజులు ఫిలింనగర్‌లో మన హీరోలందరి ఇళ్లు, స్టూడియోలు చూస్తూ గడిపాను. రాత్రిళ్లు ఎక్కడో ఒక చోట పడుకొనేవాడ్ని. కానీ మూడో రోజుకి` వాస్తవం తెలిసొచ్చింది. నేనెప్పుడూ నిర్ణయాలు చాలా ఫాస్ట్‌గా తీసుకొంటాను. రోజుకో పూట చొప్పున రెండ్రోజులు భోజనం చేసిన హోటల్‌లోనే మూడోసారి భోజనం చేస్తూ` నా పరిస్థితి చెప్పి, ఏదైనా పనివ్వమని అడిగాను హోటల్ యజమానిని. నేను అడిగిన వేళా విశేషం ఏంటో కానీ.. వెంటనే ఓకె అనేసాడాయన. కాకపోతే, నాలాంటి పదో తరగతి ఫెయిల్డ్ పిల్లాడికి ‘సర్వర్’ పనిగాక మరింకేముంటుంది హోటల్‌లో? ఆరోజు ప్రపంచాన్ని జయించినంత పోటుగాడిలా ఫీలైపోయాను. ‘హమ్మయ్య రేపట్నుంచి ఫుడ్డుకి, బెడ్డుకి ప్రోబ్లెం లేదు’ అన్న భావన నాకు అంతులేనంత ఉత్సాహాన్నిచ్చింది!
నా ఆశయం కోసం అపోలోలో ‘ఆయా’గా చేరింది
సర్వర్ డ్యూటి చేస్తూనే` ఏ ఆఫీస్ ఎక్కడుంది వంటి విషయాలపై ‘రెక్కీ’ చేసేవాడిని. ఓ పది రోజులు గడిచాక` మా నాన్న దగ్గర క్లీనర్‌గా పని చేసిన ఓ వ్యక్తి నేను పని చేసే ‘కాకతీయ మెస్’కు వచ్చి నన్ను చూసాడు. మరుసటిరోజు ఉదయానికి అమ్మ వచ్చి వాలిపోయింది. ‘నువ్వు కూడా లేకుండా ఒంటరిగా నేనెలా ఉండేది?’ అని మొండికేసింది. అంతేకాదు` తను నాకు భారం కాకుండా ఉండడం కోసం, నటుడు కావాలన్న నా కోరికను నెరవేర్చుకోనేందుకు నాకు చేదోడువాదోడుగా ఉండేందుకుగాను.. అపోలో హాస్పిటల్‌లో ఆయాగా చేరిపోయింది.
కన్నబిడ్డలా.. కంటికి రెప్పలా చూసుకొన్నాడాయన
సర్వర్‌గా పని చేస్తూ.. అవకాశాల కోసం అలుపు లేకుండా తిరిగే సమయంలో డ్యాన్స్ మాస్టర్ విజయ్ పరిచయమయ్యారు. ‘సూపర్‌స్టార్ ఫిలిం ఇనిస్టిట్యూట్’ పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ నడిపేవారాయన. ఆయన దగ్గర రెండేళ్లు పని చేస్తూనే` ఆయన ఆబ్సెన్స్‌లో ఇనిస్టిట్యూట్ చూసుకొనేవాడ్ని. నా అదృష్టం ఏంటంటే` నేను పని చేసిన హోటల్ యజమాని రెడ్డిగారు కూడా నన్ను ఎంతో ఆదరించేవారు. ఇక విజయ్ మాస్టరైతే` నన్ను సొంత బిడ్డలా చూసుకొనేవారు. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఉన్నప్పుడే చమ్మక్‌చంద్ర, కో`డైరెక్టర్ క్రాంతి వంటి వాళ్లతో నాకు పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయాల పుణ్యమా అని తేజగారి ‘జై’లో మొదటిసారి కెమెరా ముందుకొచ్చాను. కానీ అది ‘గుంపులో గోవింద’ లాంటి క్యారెక్టర్ . ఆ సినిమాలో నన్ను మా అమ్మ మాత్రమే గుర్తుపట్టింది. దురదృష్టవశాత్తూ నన్ను నటుడిగా మా అమ్మ చూసిన మొదటి సినిమా, చివరి సినిమా కూడా అదే!! (ఒకింత ఉద్వేగానికి లోనవుతూ) ‘జై’ టైమ్‌లోనే వేణు పరిచయమయ్యాడు.
‘జగడం’ నుంచి నా కెరీర్ ‘పరుగు’ తీసింది
‘జగడం’ సినిమాలో ‘నాంపల్లి సతి’్త క్యారెక్టర్ కోసం సుకుమార్‌గారు నన్ను ఎంపిక చేయడం నా జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమా.. నాకు తాగుబోతు రమేష్‌లాంటి మంచి ఫ్రెండ్‌ను కూడా ఇచ్చింది. ‘జగడం’లో నా క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అయిన సంతోష్ అనే ఫ్రెండ్ రిఫరెన్స్‌తో ‘పరుగు’లో అల్లు అర్జున్ ఫ్రెండ్స్‌లో ఒకడిగా ఛాన్స్ వచ్చింది. ‘పరుగు’ తర్వాత నుంచి నా కెరీర్ పరుగు తీసిందనే చెప్పాలి. ఆ తర్వాత చేసిన ‘యువత’ కూడా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ‘గోపి గోపిక గోదావరి’ సినిమాలో ఒక్క సీన్ చేయడం కోసం నన్ను పిలిపించిన పెద్ద వంశీగారు.. నా పెర్‌ఫార్మెన్స్ చూసి` నాతో చేయించిన సీన్ పొట్టి రాంబాబుతో రీషూట్ చేసి` నాకు మెయిన్ కమెడియన్‌గా ప్రమోషన్ ఇచ్చారు. నేను ‘జగడం’ చేస్తున్న టైమ్‌లోనే మరణంతో అమ్మకు ‘జగడం’ మొదలైంది. అమ్మకు క్యాన్సర్ అని తెలిసేటప్పటికి మా ఆర్థిక పరిస్థితి.. ‘రెక్కాడితే కానీ డొక్కాడని’ పరిస్థితి. ‘జగడం’ విడుదలయ్యేంతవరకు కూడా దేవుడు అమ్మను నా దగ్గర ఉంచలేదు!
అమ్మకు పెద్ద కర్మ చేయకుండానే ఆమెను పెళ్లి చేసుకొన్నాను
ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తూ, దాన్ని రన్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో` సొంతంగా ఓ ఇనిస్టిట్యూట్ పెట్టాలని ఫిక్సయి, ఫిలిం నగర్‌లో చిన్న పోర్షన్ రెంట్‌కు తీసుకొని ‘స్టార్ ఫిలిం ఇనిస్టిట్యూట్’ అనే పేరు పెట్టాను. ఇనిస్టిట్యూట్‌లో డ్యాన్స్ నేర్పడం కోసం కూచిపూడి డ్యానర్ అయిన ‘శిరీష’ అనే అమ్మాయి నెంబర్ సంపాదించి, ఆమెకు కాల్ చేసి ఆఫీసుకి రమ్మన్నాను. ఆమె ఆఫీసులోకి వచ్చిన మొదటిసారే` నా జీవితంలోకి వచ్చిన అనుభూతికి లోనయ్యాను. చెబితే.. ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగానూ ఉంటుందేమో కానీ.. మొదటి మీటింగ్‌లోనే ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్పేసాను. ‘ఇడియట్’ అని మనసులో తిట్టుకుందో, లేదో ఇప్పటికీ తెలియదు కానీ.. నావైపు కొరకొరా చూసి బయటకు వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజే అమ్మ చనిపోయింది. ఉన్న కాసిని డబ్బులు పెట్టి ఇనిస్టిట్యూట్‌కి అడ్వాన్స్ ఇచ్చాను. అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేంత స్నేహితులు అప్పటికింకా లేరు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో` చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడం వలన.. బుర్ర కూడా పనిచేయడం మానేసిన స్థితిలో` ముందు రోజు పరిచయమైన శిరీషకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఏదో ఎమోషనల్‌గా, సింపతీ కోసం అన్నట్లుగా ఆమెకు ఫోన్ చేసానే గానీ, ఆమె ఆ కష్టకాలంలో నన్ను ఆదుకుంటుందని అస్సలు అనుకోలేదు. కానీ తను మాత్రం.. తన చెవి దుద్దులు అమ్మేసి, ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టింది. కార్యక్రమం పూర్తయ్యేంతవరకు నాతోనే ఉంది. ఇటువంటి సీన్ ఏదైనా సినిమాలో అంతకుముందు నేను చూసి ఉంటే` డైరెక్టర్‌కి కొంచెం కూడా బుర్ర లేదని కచ్చితంగా అనుకొనేవాడ్ని. కానీ, అమ్మ చనిపోయిన మరుసటి రోజే` శిరీషను ‘నన్ను పెళ్లి చేసుకొంటావా?’ అని అడిగాను. ఒక్కరోజు పరిచయంతోనే.. కష్టకాలంలో నన్ను ఆదుకొన్న అమ్మాయి.. జీవితాంతం నన్ను గుండెల్లో పెట్టి చూసుకొంటుందన్న నమ్మకం నాకు కలిగింది. నేనున్న పరిస్థితుల్లో నేనడిగిన తీరు, అందులో నా నిజాయితీ శిరీషకు నచ్చాయి. అమ్మ చనిపోయిన మూడోరోజు` పెద్దమ్మతల్లి గుళ్లో.. శిరీష మెళ్లో మూడు ముళ్లు వేశాను. అలా.. అమ్మ చనిపోవడానికి ఒక రోజు ముందు నా ఆఫీసులో పరిచయమైన శిరీష` అమ్మ నా జీవితంలోంచి వెళ్లిపోయిన మూడోరోజు నా జీవితంలోకి ప్రవేశించింది. మొదట్లో మా ఆవిడ తరపువాళ్లు కూడా మా వివాహాన్ని ఆమోదించలేదు. కానీ.. ఇప్పుడు నాకున్న బంధువులంతా వాళ్లే.
‘జబర్దస్త్’ నా కెరీర్‌కి కిక్ ఇచ్చింది!!
శిరీషతో పరిచయానికి కారణమైన ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించేలోపే` ఆర్టిస్టుగా నేను చాలా బిజీ అయిపోతూ వచ్చాను. చూస్తుండగానే.. చకచకా 80 సినిమాలు పైగా చేసుకొంటూ వచ్చేసాను. ముఖ్యంగా ‘జబర్‌దస్త్’ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపు అంతా ఇంతాకాదు. సినిమాలు నన్ను ప్రతి ఊరికీ పరిచయం చేస్తే` ‘జబర్‌దస్త్’ ద్వారా ప్రతి ఇంటికీ ఫెమిలియరయ్యాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంత మందితోనో నాకు స్నేహం ఏర్పడిరది. ఇక ‘పిల్ల జమిందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల’ వంటి చిత్రాలు నటుడిగా నాకెంతగానో గుర్తింపు తెచ్చిపెట్టాయి!
‘ఓ చచ్చినోడి ప్రేమకథ’ అలా చచ్చిపోయింది
అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ` నన్ను హీరోగా ఎలివేట్ చేస్తూ` ‘ఓ చచ్చినోడి ప్రేమకథ’ అనే సినిమా మొదలై ఆగిపోయింది. సినిమా మొదలుపెట్టాక ప్రొడ్యూసర్‌కి ఏవో ప్రోబ్లెమ్స్ వచ్చాయి. నాకు పరిచయమున్న చాలా మంది ప్రొడ్యూసర్స్‌తో అచ్యుత్‌ను కలిపించాను. విన్నవాళ్లంతా ‘కథ కత్తిలా ఉంది’ అనేవాళ్లు. కానీ, నామీద కోటిన్నర పెట్టాలంటే ధైర్యం చాలేది కాదు. అలా కొన్ని ప్రయత్నాలు చేసాక, ఆ సినిమాను పక్కన పెట్టేసాం. ఆర్టిస్టుగా నేను ఫుల్ బిజీగా ఉండడంతో నాకేం ఫర్వాలేదు. కానీ, తెలిసినవాళ్లందరితోనూ ‘ధనరాజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’ అంటూ చెప్పుకొన్న అచ్యుత్ పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తే బాధేసింది. అలా అని నన్ను నేను హీరోగా పెట్టుకొని సినిమా తీయడానికి మనస్కరించలేదు. కథ`కథనాలే హీరోహీరోయిన్లుగా` అచ్యుత్‌ను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేయాలన్న సంకల్పమే` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రానికి శ్రీకారం చుట్టేలా చేసింది.
రామసత్యనారాయణగారు, ప్రసాద్‌గారు - ప్రతాప్‌గారు…
రామసత్యనారాయణగార్ని కలిసి కథను చెప్పించినప్పుడు ఆయనకు కూడా విపరీతంగా నచ్చేసింది. కానీ.. క్యాస్టింగ్, లేకుండా ఎలా? అని సంకోచిస్తున్న సమయంలో.. నేను సగం పెడతాననడంతో రామసత్యనారాయణగారికి కాన్ఫిడెన్స్ వచ్చి ఆయన ముందుకొచ్చారు. యు.ఎస్‌లో షోస్ చేయడానికి వెళ్లినప్పుడు పరిచయమైన ప్రతాప్‌గారు` ప్రసాద్‌గారు.. ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి రావాలనుకొంటున్నట్లు తెలిసింది. ఎక్స్‌పీరియన్స్ కోసం` నాతో కలవమని చెబితే, రెండో మాట లేకుండా వెంటనే వాళ్లిద్దరూ ఓకె అనేశారు. అలా నా బిడ్డ ‘సుక్కురామ్’ సమర్పణలో` భీమవరం టాకీస్ బ్యానర్‌పై` ప్రసాద్‌రెడ్డి`ప్రతాప్‌రెడ్డిగార్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ స్టార్టయ్యింది. డైరెక్టర్ అచ్యుత్` తనకిచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. అతని ప్రతిభ, అతని కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. నేను కూడా డైరెక్టర్ అడిగినవన్నీ ఇచ్చాను!
‘నన్ను ప్రేమించేవాళ్లు ఇంతమందున్నారా?’ అనిపించింది…
ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకొని పని చేసినవాళ్లు చాలా తక్కువ. నా మీద ప్రేమతో, అభిమానంతోనే అందరూ ఈ సినిమా కోసం పని చేశారు. నాతో సహా, ఈ సినిమాలో నటించిన వాళ్లంతా ఇంతకుముందు హీరోలుగా నటించినవాళ్లే కావడం గమనార్హం. నేను ‘ఎ.కె.రావు, పి.కె.రావు’లో హీరోగా నటిస్తే` విజయ్‌సాయి కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే అనిల్‌కళ్యాణ్, రణధీర్ కూడా హీరోలుగా చేసినవాళ్లే. ఇక మనోజ్ నందం గురించి చెప్పాల్సిందేముంది?
నాగబాబు అన్నయ్య నాకెంతగానో సహకరించారు…
ఈ సినిమాకి పని చేసిన మా కెమెరామెన్ శివ, మ్యూజిక్ డైరెక్టర్ బోలేశావలి, ఎడిటర్ శివప్రసాద్, ఎఫెక్ట్స్ యతిరాజ్‌గారు, డిజైనర్ వివారెడ్డి... ఇలా ఒకరని కాదు, ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. ముఖ్యంగా నాగబాబన్నయ్య నాకెంతగానో సహకరించారు. అలాగే సింధుతులానిగారు ఎం.పి క్యారెక్టర్ చేయడంతో` సినిమా రేంజ్ మరింత పెరిగింది. అలాగే, నా మాట మన్నించి హీరో తనీష్ ఈ సినిమాలో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చాడు. నా ఫ్రెండ్ తాగుబోతు రమేష్ నాకోసం ఛానల్ రిపోర్టర్‌గా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా మనోజ్‌నందం, రణధీర్, విజయ్‌సాయి, అనిల్‌కళ్యాణ్, శ్రీముఖి తదితరులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
మా ఆవిడతో అలా అబద్ధం చెప్పడం నిజమే…
నన్ను నమ్మి నాతో జీవితాన్ని పంచుకోవడానికొచ్చిన నా శ్రీమతి శిరీషకు చెప్పే ఈ సినిమా స్టార్ట్ చేశాను. కాకపోతే` నేను కోటి రూపాయలు పెట్టాల్సి ఉంటే` ‘యాభై లక్షలు మాత్రమే పెట్టాలి’ అన్న చిన్న అబద్ధం మాత్రం చెప్పాను. కానీ కోటి, కోటింబావులో అయిపోతుందనుకొన్న సినిమా కాస్తా.. కోటి డబ్బై అయ్యింది. అయితే, అది అనసరమైన ఖర్చు కాదు. చాలా క్లారిటీగా.. క్వాలిటీ కోసం మా అంతట మేం పెంచుకొన్న ఖర్చు. సినిమా అవుట్‌పుట్ బాగా వస్తోందని తెలిసాక, నేను అబద్ధం చెప్పానని తెలిసినా.. మా శిరీష నన్ను క్షమించేసింది (నవ్వుతూ..). సినిమా స్టార్ట్ చేసేముందు మా శిరీషకు నేను ఒకటే చెప్పాను. ‘సినిమాకి పెట్టిన డబ్బు మొత్తం పోయినా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొనేటప్పుడు మనమున్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్‌లోనే ఉంటాం’ అని భరోసా ఇచ్చాను. నేను సినిమా తీస్తున్నానని తెలిసి చాలా మంది నన్ను భయపెట్టారు. వద్దని వారించారు, వాదించారు! కానీ నేనొక్కటే ఆలోచించాను. తాడేపల్లిగూడెంలో హైద్రాబాద్ రైలెక్కినప్పుడు నా దగ్గరేమున్నాయ్? ఈ సినిమా కోసం నేను ఖర్చు చేసేదంతా.. ఇక్కడికి వచ్చాక నేను సంపాదించిందే కదా? రేపు ఊహించనిది ఏదైనా జరిగి.. నేను సంపాదించుకొన్న ఈ డబ్బు మొత్తం పోతుందేమో కానీ.. ఈ పదేళ్లలో నేను సంపాదించుకొన్న గుర్తింపు, పేరు, మంచితనం పోవు కదా? అందుకే, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశాను. ‘మంచి సినిమా ఫ్లాప్ అయిన సంఘటన’ మన తెలుగు సినిమా చరిత్రలోనే లేదు. నేను చాలా మంచి సినిమా తీసాననే అనుకొంటున్నాను. నా కష్టాన్ని చూసి, నాకింత మంచి జీవితాన్నిచ్చిన భగవంతుడు నాకు అన్యాయం చేయడు. నా కష్టార్జితాన్ని వెనక్కి లాక్కోడు’ అన్న నమ్మకం నాకుంది. ఆ తర్వాత అంతా ప్రేక్షక దేవుళ్ల దయ.. మా ప్రాప్తం..
ఆ ఇద్దరికీ ఆజన్మాంతం..
నేను జీవితాంతం రుణపడి ఉండాల్సిన వ్యక్తులు ఇద్దరున్నారు. వాళ్లు సుకుమార్‌గారు`రామ్‌గారు. అందుకే వాళ్లిద్దరి పేర్లు జత చేసి` మా అబ్బాయికి ‘సుక్కురామ్’ అనే పేరు పెట్టుకొన్నాను. ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రాన్ని సమర్పిస్తున్నది మా అబ్బాయి సుక్కురామ్ (మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో) కాబట్టి` పరోక్షంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నది సుకుమార్‌గారు`రామ్‌గారే…
విద్యానిర్వాణ సమర్పణలో లక్ష్మీ మంచు, అడవిశేష్ ప్రధానపాత్రధారులుగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘దొంగాట’. వంశీ కృష్ణ దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 8న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీ మంచుతో ఇంటర్వ్యూ...
ఇంత టెన్షన్ పడలేదు...
దొంగాట చిత్రం ఈ నెల 8న విడుదలవతుంది. చాలా అతృతగా ఎదురుచూస్తున్నాను. ఫుల్ ఫన్ ఫిలిం. అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్. ఫుల్ కామెడి రోల్ ను చేశాను. ఇప్పటి వరకు ఇంత కామెడి ఉన్న రోల్ నేను చేయలేదు. నా ‘గుండెల్లో గోదారి’ చిత్రానికి కూడా నేను ఇంతగా భయపడలేదు.
ఏదో పాస్ అయితే చాలనుకున్నాను...
ఈ చిత్రంలో నేను పాట పాడటానికి ప్రత్యేకంగా కారణలేవీ లేవు. ఈ సినిమాలో తొమ్మిది మంది హీరోస్‌తో చేసిన సాంగ్ ఉంది. అది పెద్ద హిట్టవుతుంది అనుకున్నాను. మంచి లిరిక్స్ కుదిరాయి. అందరూ లక్ష్మి..నువ్వు పాడితే బావుంటుందని చెప్పడంతో నేను పాడాను. నేను పాడిన పాట ఏదో పాస్ అయిపోతే చాలనుకున్నాను. అయితే నా పాటకు చాలా మంచి రెస్పాన్స్ హ్యపీగా గా ఉంది.
అదెప్పుడూ నాకు బాధ కలిగిస్తుంది...
-మన దేశంలో ఉన్న సమస్యే అది. ఎందుకంటే ఏం మాట్లాడినా నువ్వు ఆడపిల్లవి కదా అని అంటారు. అదేంటో తెలియదు కానీ ఇద్దరూ ఒకటే అని తెలిసినా అదే భావన ఇక్కడ ఇంకా ఉంది. అడపుట్టుకే తప్పు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అదే నాకు బాధను కలిగిస్తుంటుంది. ఆ ఫీల్ ను ఈ పాటలో చూపించాను. ఈ సాంగ్ లో నేను ఎక్కడా మగవాళ్లని తిట్టలేదు, విమర్శించానంతే. ‘మీరు షార్ట్ వేసుకుంటే తప్పులేదు కానీ నేను ప్యాంట్ వేసుకుంటే తప్పా..’ అనేది నా భావన.
మెసేజ్ లేకపోతే సినిమా చేయను...
-సినిమాలో కూడా నేను హీరోయిన్ రోల్ చేశాను. ఇదొక క్రైమ్ కామెడి నేపథ్యంలో సాగే సినిమా. ఆ హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేస్తారు. వారెందుకు కిడ్నాప్ చేస్తారనేదే సినిమా. సాధారణంగా నేను మెసేజ్ లేకుండా సినిమా చేయలేను. ఈ సినిమాలో కూడా హ్యుమన్ రిలేషన్స్‌కి, మనీకి ఉన్న సంబంధాన్ని హార్ట్ టచింగ్ మెసేజ్‌తో చూపించాం.
నిర్మాతగా చాలా సంతృప్తినిచ్చిన చిత్రం...
-సినిమా తీయడంలో తప్పు ఉండదు. బడ్జెట్ విషయంలోనే తప్పు ఉంటుంది. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందుకు కారణం ఉంది. నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా ఝుమ్మందినాదంను రాఘవేంద్రరావుగారితో చేశాను. ఆయనకున్న అనుభవంతో సినిమా తీయడం ఇంత సులభమా అని అనిపించేతలా సులువుగా సినిమాని పూర్తి చేసేశారు. తర్వాత చేసిన ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’, ‘గుండెల్లో గోదారి’ చిత్రాలకు నిర్మాతగా ఏం కావాలంటే అది సమకూర్చాను. అయితే బడ్జెట్‌లో లిమిటేషన్స్ పెట్టుకుని ఉండాల్సింది. కానీ నేనది చేయలేదు.. అదే నేను చేసిన పెద్ద తప్పు. కానీ ఈ సినిమా విషయంలో నేను, వంశీ కృష్ణ ఎక్కడ ఏ సీన్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాలను డిస్కస్ చేసుకుని చేశాం. ఒక నిర్మాతగా నాకు చాలా సంతృప్తినిచ్చిన చిత్రమిది. అనుకున్న బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేసేశాం.
ఆయన డైరెక్ట్ చేయనని చెప్పారు...
-ఓ సందర్భంలో ఓ హై టెన్షన్ పాయింట్ తట్టింది. నేను, మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన వంశీకృష్ణ ఈ కథను రామ్ గోపాల్ వర్మగారితో డైరెక్ట్ చేయడానికి డెవలప్ చేశాం. రామ్‌గోపాల్‌వర్మ దగ్గరకే తీసుకెళ్లాం. అయితే కథ విన్న ఆయన కథ చాలా బావుంది. కానీ నేను ఈ జోనర్‌లో సినిమా చేయను అన్నారు. నేనెంతో ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. అయితే ఈ స్టోరిపై వంశీకృష్ణకి పూర్తి అవగాహన ఉండటంతో తననే డైరెక్ట్ చేయమని అన్నాను. తను కూడా ఒప్పుకున్నాడు.
ఆయనో గ్రేట్ డైరెక్టర్...
-రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. చాలా జీనియస్, గ్రేట్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. వరల్డ్ సినిమాలో మన ఇండియన్ సినిమా విలువని పెంచిన గొప్ప దర్శకుడు. సౌండిరగ్, లైటింగ్ ఇలా చాలా టెక్నికల్ విషయాలు పరంగా సినిమాలో ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు.
క్రెడిట్ నాకే సొంతం...
-సెకండాఫ్ లో నా బర్త్ డే సందర్భంలో ఈ నైట్ కి నువ్వే హీరో..అంటూ సాగే సాంగ్ ను డిఫరెంట్ గా చేయాలనుకున్నాం. అప్పుడు తొమ్మిది మంది హీరోలతో చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ విషయంలో నేను దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలి. నేను అడగ్గానే అందరూ హీరోలు నా మీద నమ్మకంతో ఒప్పుకుని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ క్రెడిట్ నాకే సొంతం
వంశీకృష్ణ చాలా ఫోకస్ డ్ పర్సన్...
-వంశీకృష్ణ చాలా ఫోకస్‌డ్ పర్సన్. గౌతమ్‌మీనన్ దగ్గర ఘర్షణ సినిమా నుండి ఏ మాయా చేసావే వరకు పనిచేశాడు. అదీ కాకుండా నాతోనే తను తొలి సినిమా చేయాలనుకున్నాడు. ఆ కోరిక ఈ విధంగా నేరవేరింది.
అవన్నీ రూమర్స్...
-మనోజ్ పెళ్లిలో రజనీకాంత్ గారు డ్యాన్స్ చేస్తారనే వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలు. ఆ విషయాన్ని మేం ఎక్కడా కన్ ఫర్మ్ చేయనప్పుడు ఎలా రాసేస్తారు. ఎందుకంటే రజనీకాంత్‌గారితో నాన్నగారికి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. నా పెళ్లికి, విష్ణు పెళ్లికి కూడా ఆయన వచ్చారు. అప్పుడు రాని ఈ వార్తలు ఇప్పుడెలా వస్తున్నాయో తెలియడం లేదు. మనోజ్ పెళ్లి పనులను నాన్నగారు దగ్గరుండి చూసుకుంటున్నారు. మేమైతే ఈ సమ్మర్‌లో ఏదైనా డెస్టినేషన్‌కి వెళ్లి అక్కడ పెళ్లి చేసేద్దామని చెప్పినా నాన్న వినలేదు. అన్నీ సంప్రదాయబద్ధంగా జరగాలని పట్టుబట్టి దగ్గరుండి చూస్తున్నారు.
విద్యానిర్వాణతో ఎంజాయ్ చేస్తున్నాను...
-నేను చాలా ఎక్స్ ప్రెసివ్. నా కుమార్తె విద్యానిర్వాణతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తను ఇప్పడు టచ్ చేస్తున్నా కలుగుతున్న ఫీలింగే వేరు. మాటల్లో చెప్పలేనిది.
నెక్స్ ట్ ప్రాజెక్ట్?
-తరుణ్ భాస్కర్ అనే కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాను. తను గతంలో చాలా షార్ట్ ఫిలింస్ చేశాడు. ఫార్ట్ ఫిలిం చూసి నచ్చడంతో తనతో మాట్లాడి సినిమా చేస్తున్నాను. ఆ చిత్రం జూన్ నుండి ప్రారంభమవుతుంది.