బాహుబలి: ది బిగినింగ్

July 10, 2015 | 10:13 AM | 69 Views
Rating :
బాహుబలి: ది బిగినింగ్

నటీనటులు : ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తనికెళ్ల భరణి, అడవి శేష్, రోహిణి తదితరులు....

సాంకేతిక వర్గం :

విఎఫ్ఎక్స్ సూపర్ విజన్ : శ్రీనివాస్ మోహన్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్,  సంగీతం : ఎం.ఎం కీరవాణి, నిర్మాత : శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని, దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి

తెలుగువారు  సగర్వంగా కాలర్ ఎగరేసుకునే రోజు రానే వచ్చింది. బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. విన్నా ఇదే మాట. భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా ఉంటుందని చెప్పుకొస్తున్న చిత్రం ప్రేక్షకుల ముందుకురానే వచ్చింది. మొట్టమొదటిసారిగా భారీ బడ్జెట్ తో, హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి – ది బిగెనింగ్’గురువారం అర్థరాత్రి నుంచే హంగామా ప్రారంభించింది. సక్సెస్ ను ఇంటిపేరుగా మార్చుకున్న రాజమౌళి మూడేళ్ల శ్రమ. ప్రధాన తారాగణంతో పాటు వందల మంది టెక్నిషియన్స్, వేల మంది జూనియర్ ఆర్టిస్టుల కష్టం తెర మీదకు వచ్చేసింది. ఎప్పుడూ లేని విధంగా దేశంలోనే ఓ చిత్రం నాలుగు ప్రధాన భాషల్లో ఒకేసారి విడుదల కావటం విశేషం. మరి ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి తీసిన ‘బాహుబలి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది... ఎలా ఉందో రివ్యూలోకి వెళ్దాం...

కథ :

బిగినింగ్ లోనే శివగామి (రమ్యకృష్ణ) పొత్తిళ్ళలో ఓ బిడ్డని ఎత్తుకుని పారిపోతూ... ఓ భారీ జలపాతంలో పడిపోతుంది. తను చనిపోయి ఆ బిడ్డని కాపాడుతుంది. ఇక ఆ బిడ్డ నది ప్రవాహాంలో కొట్టుకుంటూ అంబలి అనే గూడెంకు చేరతాడు. అక్కడ ఆటవిక తెగకి చెందిన రోహిణి ఆ బిడ్డకి శివుడు (యంగ్ ప్రభాస్) అని పేరుపెట్టి సాకుతుంది. ఆ తర్వాత పెరిగి పెద్దయిన శివుడు అనుకోకుండా ఆవంతిక (తమన్నా) ను చూసి ప్రేమలో పడతాడు. కానీ, ఆమెకో లక్ష్యం ఉంటుందని తెలుసుకొని తాను సహాయం చేస్తానంటాడు. ఆ ప్రయత్నంలోనే మాహిష్మతి రాజ్యాన్ని చేరుకుంటాడు. అక్కడ తన గతాన్ని తెలుసుకుంటాడు. అసలు ఆవంతిక లక్ష్యం ఏమిటీ? శివుడు ఎవరు? బాహుబలి కథేంటి?

ఫ్లస్ పాయింట్లు:

రోమాలు నిక్కబొడుచుకునేలా ఓ సీన్ రావటం రాజమౌళి సినిమాళ్లో ప్రత్యేకత. కానీ, ఈ చిత్రంలో అలాంటివి బోల్డెన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్న వార్ (యుద్ధం) ఎపిసోడ్ చాలా బాగా ఎలివేట్ చేసాడు. పూర్తి చిత్రంతో మీకు రెండున్నర గంటల కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయం. ప్రధానంగా 8 పాత్రలు వీటితోపాటు సపోర్టింగ్ పాత్రలను అద్భుతంగా మలిచాడు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యారాజ్ ఇలా పోటీ పడి నటించారు. ఇదంతా ఒక ఎత్తయితే... మాహిష్మతి, మంచు ఎపిసోడ్స్ మరో ఎత్తు. శివుడుగా ప్రభాస్ ఇంట్రడక్షన్ దగ్గరి నుంచి ప్రతి పాత్ర పరిచయం ప్రేక్షకుల చేత విజిల్ కొట్టిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాహుబలి ప్రభాస్ ఓ అద్భుతం. పోటీగా బల్లాలదేవ రానా, శివగామి పాత్రలో రమ్యకృష్ణ. సుమారు 30 నిమిషాల పాటు సాగే వార్ ఎపిసోడ్ ఆడియన్స్ మతి పోగొడుతుంది. యుద్ధంలో ప్రభాస్, రానా, సత్యరాజ్ లు రాక్షస సైన్యంతో పోరాడే సీన్లు మరియు వారి పై షూట్ చేసిన సన్నివేశాలతో రోమాలు నిక్కబోడుచుకుంటాయి. అసలు మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అన్న ఫీలింగ్ కలుగుతుంది. బుల్ ఫైట్ తో రానా ఇంట్రడక్షన్ అదుర్స్. ఇక హీరోయిన్ల పాత్ర గురించి చెప్పాలంటే గ్లామర్ పోస్టర్లతో ఆకట్టుకున్న ‘అవంతిక’ తమన్నా చిత్రంలో మాత్రం ఓ యోధురాలి పాత్రలో నటించింది. తమన్నా చేసిన స్టంట్స్, కత్తి యుద్దాలు కచ్చితంగా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి. ‘దేవసేన’గా అనుష్క – దేవసేనగా అనుష్క కనపడేది చాలా తక్కువ టైం. అది కూడా మీరు ట్రైలర్ లో చూసిన లుక్ లో ఓ ఖైదీగా కనిపిస్తుంది. కానీ తను మొదటి సారి నోరు తెరిచి కట్టప్పతో మాట్లాడే సీన్స్ మాత్రం సూపర్బ్. ‘శివగామి’గా రమ్యకృష్ణ – ది పవర్ అఫ్ విమెన్ ని చూపే పాత్ర శివగామి. ఒక రాజ్యాన్ని తన ఆధీనంలో సమర్ధవంతంగా నడిపించగల సత్తా ఉన్న రాణిలా రమ్యకృష్ణ నటన, ఆ పాత్రలోని రౌద్రం అందరినీ కట్టిపడేస్తుంది. శివగామి పాత్రని రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. ప్రతి సీన్ లోనూ సూపర్బ్ ఎమోషన్స్ ని చూపారు. ‘కట్టప్ప’గా సత్యరాజ్ నమ్మిన బంటుగా , సైన్యాధిపతిగా కట్టప్ప పాత్రలో కనిపిస్తారు. ఎమోషన్స్ చూపించడంలో ది బెస్ట్ అని కట్టప్ప పాత్రతో మరోసారి మెప్పించాడు. 60 ఏళ్ళ వయసులో కూడా శివుడితో చేసిన ఫైట్, స్టంట్స్ చూసి కచ్చితంగా షాక్ అవుతారు. యువహీరోలకు దీటుగా కత్తి తిప్పుతూ చేసిన స్టంట్స్ వాహ్ అనిపిస్తాయి. ఇక కన్నింగ్ మంత్రి పాత్రలో ‘బిజ్జలదేవ’గా నాజర్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. నాజర్ ఒక చెయ్యి లేని అవిటివాడిగా నెగటివ్ ఎమోషన్స్ ని బాగానే చూపించాడు. ‘కాలకేయ’గా ప్రభాకర్ – ఓ కౄరమైన ఆటవిక తెగకి చెందిన రాజుగా ప్రభాకర్ నటించాడు. కాలకేయగా ప్రభాకర్ రూపమే ఆడియన్స్ ని భయపెట్టేలా ఉంటుంది. దానికి తోడు ఇతని చేత చెప్పించిన కిలికి భాష డైలాగ్స్ లో ఇంటెన్స్ కనిపించడం తన విలనిజాన్ని మరింత పెంచేలా ఉంటుంది. ఇక మిగతా వారిలో అతిధి పాత్రలో మెరిసిన సుధీప్ అస్లామ్ ఖాన్ పాత్రలో మెప్పించాడు. ఆటవిక ప్రాంతానికి చెందిన లేడీ పాత్రలో రోహిణి నటన బాగుంది. భళ్లాలదేవ దగ్గర ఉండే ఓ యువరాజు అయిన భద్ర పాత్రలో అడవి శేష్ లుక్ బాగుంది. భళ్లాలదేవ కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడే అడవి శేష్ నెగటివ్ షేడ్స్ బాగా చూపించాడు. తనికెళ్ళ భరణి ఓకే. ‘మనోహరి’ సాంగ్ లో కనిపించిన నోర ఫతేహి, స్కార్లెట్ విల్సన్ లు ఆకట్టుకున్నారు. టెక్నికల్ డిపార్ట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. విఎఫ్ఎక్స్ సూపర్ విజన్ శ్రీనివాస్ మోహన్, ఫైట్స్  పీటర్ హెయిన్స్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్  సాబు సిరిల్ ఇలా ఎవరికీ వారు విజృంభించేశారు. 

మైనస్ పాయింట్లు :

దేనికైనా ఎన్ని ఫ్లస్ లు ఉంటాయో... అన్ని మైనస్ లు ఉంటాయి. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా వచ్చిన బాహుబలి సినిమాలోనూ కొన్ని మైనస్ లు ఉన్నాయి. సినిమా మొత్తం చూశాక అబ్బే అంత గొప్పగా  ఏం లేదే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా సాధాసీదా రివెంజ్ స్టోరీ కాబట్టే. ఎమోషన్స్ కోసం రాసుకున్న కొన్నిసీన్లు కథను స్లోగా నడిపిస్తాయి. వీటివల్లే సినిమా రన్ లెన్త్ కూడా ఎక్కవయ్యిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన కామెడీ, బొరింగ్ సీన్లు చాలానే ఉన్నాయి. సెకండాఫ్ కూడా మంచి బ్లాక్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత స్పీడ్ ని సడన్ గా తగ్గించేసాడు. ముఖ్యంగా ఐటెం సాంగ్ తో పెద్ద లాభమేమి లేదు. అన్నిటికంటే మించి క్లైమాక్స్ ఏదో అసంపూర్తిగా ముగించేసినట్టు ఉండడం ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది.

చివరగా :

భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి అందరినీ సంతృప్తి పరిచే సూపర్బ్ గ్రాఫికల్ విజువల్ వండర్ గా నిలిచిపోవటం ఖాయం. ఒక్క మంచు ఎపిసోడ్ చాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి విజువల్ వండర్ ను  మునుపెన్నడూ చూడలేదని చెప్పవచ్చు. స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎమోషన్స్ కి గ్రాండ్ విజువల్స్ తోడవడం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ప్రధాన పాత్రలు నటనతో ప్రాణం పోస్తే..., అతని టెక్నికల్ టీం టాలెంట్ తో సినిమాని విజువల్ వండర్ గా మార్చారు. అయితే కథా పరంగా మాత్రం కంటెంట్ లేదనేది సత్యం. అక్కడక్కడా బాగా సాగదీశాడు. కానీ, రెండున్నరేళ్ళ పాటు కష్టపడి ఇలాంటి గొప్ప విజువల్ మూవీని తీసిన జక్కన్న టీంకి హ్యాట్సాఫ్.

 

చివరగా... అంచనాలను తగ్గించుకొని ఫ్యామిలీతో  వెళ్లి చూడండి... ఫస్టాఫ్ ఏమో గానీ సెకండ్ ఆఫ్ స్టోరీని, గ్రాండ్ గ్రాఫికల్ విజువల్ వండర్ ని ఎంజాయ్ చెయ్యటం ఖాయం.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు