భమ్ భోలేనాథ్

March 30, 2015 | 04:25 PM | 89 Views
Rating :
భమ్ భోలేనాథ్

నటీనటులు : నవదీప్, నవీన్ చంద్ర, పూజా జావేరి, పోసాని కృష్ణమురళి, ప్రదీప్ మాచిరాజు, కిరీటీ,పంకజ్ కేసరి, ప్రవీణ్, నవీన్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం: ధరణి కే భరణ్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత: సిరువురి రాజేష్ వర్మ, కథ, స్ర్కీన్ ప్లే, సంభాషణలు, దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు

విభిన్న తరహా కథనంతో కార్తీకేయ లాంటి చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ కమ్ రైటర్ గా పనిచేసిన కార్తీక్ వర్మ దండు తొలిప్రయత్నంలోనే మంచి పేరు సంపాదించాడు. ఇక గత కొన్నేళ్లుగా సక్సెస్ మోహం ఎరుగని నవదీప్, అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్రలతో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడంటే దానిపై కాస్త అనుమానం నెలకొంటుంది. అంతేకాదు చిన్న చిత్రంగా వచ్చి ఇది గట్టెక్కుతుందా అన్న సందేహాల నడుమ విడుదలయ్యింది. కామెడీ థ్రిల్లర్, డ్రగ్స్ నేపథ్యంలో చేసిన ప్రయోగమే భమ్ భోలేనాథ్ . మరీ ఈ ఇద్దరు హీరోలకు ఈ చిత్రం హిట్ ఇచ్చిందా? దర్శకుడిగా కార్తీక్ తొలిప్రయత్నం సక్సెస్ అయ్యిందా?...

కథ :

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరో విష్ణు (నవదీప్) ఉద్యోగవేటలో తిరుగుతూ ఉంటాడు. తనను ప్రేమించిన శ్రీలక్ష్మి ని (పూజా జావేరి) ను పెళ్లిచేసుకునేందుకు తన తంటాలు పడుతుంటాడు. ఈ ప్రయత్నంలో దొంగనోట్ల వ్యాపారం చేసే విలన్ వసూల్ రాజా(పంకజ్ కేసరి) చేతిలో చిక్కుకుంటాడు. మరోకథలో డాన్ అవ్వాలనే లక్ష్యంతో కృష్ణ (నవీన్ చంద్ర) అనే దొంగ తన స్నేహితుడి(ప్రవీణ్) సాయంతో అపురూపమైన వస్తువులను దొంగతనం చేస్తుంటాడు. వాటిని తనను చిన్నప్పటి నుంచి పెంచిన వ్యాపారవేత్త(పోసాని క్రుష్ణ మురళి)కు అమ్మి సొమ్ముచేసుకుంటాడు. ఇక డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ ఇద్దరు యువకులు (యాంకర్ ప్రదీప్, కిరిటీ) తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఓ ఫ్లాట్ లో సహజీవనం చేస్తుంటారు. అనుకొని కొన్ని సంఘటనలు వారి జీవితాలను మలుపుతిప్పుతాయి. ఈ క్రమంలో చివరకు వారంతా విలన్ డెన్ లోకి ప్రవేశిస్తారు. అసలు వారంతా అక్కడికి ఎలా, ఎందుకు చేరుకుంటారు?... హీరో తన ప్రేమను జయిస్తాడా? విలన్ చేతి నుంచి ఎలా తప్పించుకుంటాడు? డాన్ అవ్వాలన్న కృష్ణ కల నెరవేరుతుందా అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

ముందుగా చెప్పుకోవాల్సింది చిత్రంలో హీరోల గురించి వారిద్దరు తమ తమ రోల్స్ లో అద్భుతంగా నటించారు. నవదీప్ తన బాడీ లాంగ్వేజ్ టోటల్ గా మార్చి బాగా నటించాడు. ఇక నవీన్ చంద్ర మాస్ తరహా పాత్రలో జీవించేయటం అందాల రాక్షసి లో చూశాం. ఇందులో కూడా అదే రీతిలో కానిచ్చాడు. ఇక హీరోయిన్ పూజా పరిధి మేర నటించింది. ఇక వీళ్ల తర్వాత చెప్పుకోవాల్సింది ప్రదీప్, కిరిటీ ల గురించి. డ్రగ్స్ అలవాటు పడిన పాత్రలో వీరిద్దరు చించేశారు. వారిద్దరి గర్ల్ ఫ్రెండ్స్ పాత్రలో ప్రచీ, శ్రీయాలు ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే పియాతూ సాంగ్ థియేటర్ ను నవ్వులతో నింపేస్తుంది. యాంకర్ గా పాపులర్ అయిన ప్రదీప్ వెండితెరపై కూడా అదే రీతిలో ఎంటర్ టైన్ చేశాడు. ఓకానోక స్టేజీలో హీరోలకంటే వీరిద్దరిదే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలుగా అనిపించక మానదు. హీరోయిన్ తండ్రిగా విలువైన వస్తువులను కొని, అమ్మే పాత్రలో పోసాని కవ్విస్తాడు. నవీన్ చంద్ర స్నేహితుడి పాత్రలో ప్రవీణ్, నవదీప్ స్నేహితుడిగా ఆకలితో అల్లలాడిపోయే పాత్రలో నవీన్ ఆకట్టుకుంటారు. ఇక ఇళయరాజా పిచ్చి ఉన్న విలన్ గా పంకజ్ కేసరి ఓకే. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నవదీప్ పూజా మధ్య వచ్చే నీతో... సాంగ్, టైటిల్ సాంగ్ లు ఆకట్టుకుంటాయి. కెమెరా మెన్ భరణి కే ధరణ్ పనితనం బాగుంది. దర్శకత్వం పరంగానే కాదు డైలాగుల్లో కూడా కార్తీక్ తన ప్రతిభను చాటాడు. దొబ్బేస్తే దొంగతనం... అదే దొరికితే అద్రుష్టం లాంటి కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్లు :

ఎంటర్ టైన్ తో లాగించేద్దామనుకున్నప్పటికీ కథనం కాస్త మనీ చిత్ర తరహాలో అనిపిస్తుంటుంది. ముఖ్యంగా నవీన్ చంద్ర లాంటి స్కోప్ ఉన్న నటుడిని పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. పైసా, ప్రతినిధి లాంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి అందించిన సంగీతం వేస్టయ్యింది. ఎవరూ దొరకనట్లు ఎంపిక చేసిన పంకజ్ కేసరి విలన్ గా విఫలమయ్యాడు. థర్టీ ఇయర్స్ ప్రుథ్వీ, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లను వాడుకోలేదు. ఫిష్ వెంకట్ ది రెగ్యూలర్ కామెడీనే. క్లైమాక్స్ ను కూడా సాదాసీదాగానే ముగించేశాడు.

చివరగా :

పూర్తిస్థాయి ఎంటర్ టైన్ మెంట్ తో చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ వర్మ ఆ ప్రయోగంలో సక్సెస్ అయ్యాడు. ట్విస్ట్ లతో కూడి ఉండటం మూలంగా ముఖ్యంగా యూత్ కి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. పోటీగా పెద్ద చిత్రాలేవీ విడుదల కాకపోవటం, అందులో రెండు అనువాద చిత్రాలే కావటం ఈ చిత్రానికి అదనపు బలాలు.

చివరగా... టెంపర్ తర్వాత సరైన చిత్రాలు లేవని ఫీలవుతున్న తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం కాస్త రిలీఫ్ ఇస్తుందనే చెప్పొచ్చు. కానీ ఫ్యామిలీస్ ను ఆకట్టుకోవటం కాస్త కష్టమే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు