నటీనటులు : సుధీర్‌బాబు, నందిత, చైతన్యకృష్ణ, ప్రగతి, పోసాని కృష్ణమురళి, గిరిబాబు, విక్రమ్ సహిదేవ్, యాని తదితరులు ఇతర పాత్రధారులు
సాంకేతిక వర్గం :
సంస్థ: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్. సమర్పణ: లగడపాటి రామానాయుడు, కెమెరా: కె.ఎస్.చంద్రశేఖర్, ఎడిటింగ్: రమేష్ కొల్లూరి, సంగీతం: హరిగౌర, నిర్మాత: లగడపాటి శిరీష, శ్రీధర్, దర్శకత్వం: ఆర్.చంద్రు
ప్రేమ కథలు ఎన్ని సార్లు తెరకెక్కినా ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తూనే ఉంటాయి. తరాలు మారినా మారని భావం ప్రేమ. అందుకే అప్పుడప్పుడూ ప్రేమకథలు ట్రెండ్ సెట్టర్లు అవుతాయి. ఈ మధ్య కన్నడలో అలా ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఛార్మినార్. ఆ కథ ఆధారంగా తెలుగులో రూపొందిన సినిమా కృష్ణమ్మకలిపింది ఇద్దరినీ. సుధీర్‌బాబు, నందిత ఇద్దరికీ ఇంతకు ముందు మంచి హిట్ సినిమా ఉంది. అదే ప్రేమకథా చిత్రమ్. తాజాగా ఇదే జంటతో తెరకెక్కిన సినిమా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఇక చదవండి...
కథ :
సినిమా కృష్ణాపురంలో మొదలవుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళం గురించిన చర్చలతో మొదలవుతుంది. కృష్ణ (సుధీర్‌బాబు) అమెరికాలో ఉంటాడు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనాలని వస్తాడు. దారిలో అతనికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. కృష్ణ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచీ రాధ (నందిత)ను ఇష్టపడతాడు. ఆమె దృష్టిని ఆకర్షించాలని బాగా చదువుతాడు. అక్కడ ఆమెకు తన ప్రేమను చెప్పలేకపోతాడు. ఆ తర్వాత కాలేజీలోనూ అంతే. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత హైదరాబాద్‌లో రాధను కలుసుకుంటాడు. ఆమె తన కుటుంబ పరిస్థితుల కారణంగా షాప్‌లో పనిచేస్తుంటుంది. అప్పుడూ తన ప్రేమను చెప్పలేకపోతాడు. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ కృష్ణ తన ప్రేమను రాధకు చెప్పాడా? లేదా? ఎప్పుడు చెప్పాడు? చెప్తే ఏమైంది? చెప్పకపోతే ఏం జరుగుతుంది? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఫ్లస్ పాయింట్లు:
ఇన్నాళ్లు వెరైటీ పాత్రలు చేసిన సుధీర్‌కు లవర్‌బాయ్ గా ఈ సినిమా కొత్తగా ఉంది. దాదాపు మూడు రకాల గెటప్‌లలో కనిపిస్తాడు సుధీర్. నందిని కూడా స్కూల్ డ్రస్సులోనూ, ఇతర గెటప్పుల్లోనూ కనిపిస్తుంది. ఇద్దరి జంటా మరో సారి చూడముచ్చటగా ఉంది. ప్రేమ కథలకు సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. అలాంటి మంచి సంగీతం ఈ సినిమాకు కూడా కుదిరింది. ముందే పాటలు హిట్ కావడం కూడా ప్లస్ అయింది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, లొకేషన్లు ఇట్టే ఆకట్టకుంటాయి. డైలాగులు కూడా అక్కడక్కడా హత్తుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. లగడపాటి శ్రీధర్ తనయుడు కూడా సినిమాలో బాగా చేశాడు. యాని తనదైన బాణీలో బాగా నటించింది. మిగిలిన పాత్రధారులు కూడా వారి పరిధి మేర చక్కగా నటించారు.
మైనస్ పాయింట్లు :
కాలేజీ గెటప్‌లో సుధీర్ స్టైల్ కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. కొంచెం తగ్గి ఉంటే బావుండేదని అనిపించింది. ఎడిటింగ్ బాలేదని చెప్పాలి. స్లో నెరేషన్ కన్నడ సినిమాలకు సరిపోతుందే తప్ప అందరికీ సరిపోదు. అందుకే కొన్ని సన్నివేశాలను కట్ చేసి ఉంటే బావుండేదనిపిస్తుంది. ఫైట్లు సినిమాలో ఏదో కమర్షియల్ కోసం పెట్టినట్టే ఉన్నారు. కానీ అవి పంటికింద రాయిలా అనిపించాయి. నందిత కొన్ని సందర్భాల్లో అతిగా స్పందించినట్టు అనిపించింది.
చివరగా :
ప్రేమకథలు ఏమాత్రం బావున్నా వాటిని యువత మహరాజపోషకులై పోషిస్తుంది. సుధీర్‌బాబు ఈ సినిమాతో యువతకు దగ్గరవుతారన్నది నిజం. కన్నడ సినిమాలు మనకు సెట్ కావని అంటారు. కానీ తీసే విధానంగా తీస్తే, కొంచెం మార్పులతో తీస్తే తప్పకుండా మన ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే విషయాన్ని ఈ సినిమా స్పష్టం చేసింది. చంద్రు దర్శకత్వ ప్రతిభ బావుంది. సినిమాలోని ఎమోషన్‌ను బాగా క్యారీ చేశాడు. మనుషులందరికీ ఎక్కడో ఓ చోట ప్రేమ అనే పదంతో పరిచయం ఉండే ఉంటుంది. దాని గురించిన కథతో సినిమా తీయడమే చంద్రు బలం.
చివరగా... ఫీల్ గుడ్ మూవీ. ఎమోషనల్ ప్రేమకథలను ఇష్టపడేవారికి మంచి ట్రీట్ ఈ సినిమా.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment