సర్దార్ గబ్బర్ సింగ్

April 09, 2016 | 01:52 PM | 7 Views
Rating :
సర్దార్ గబ్బర్ సింగ్

నటీనటులు : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ ఖేల్కర్, ముఖేష్ రుషి, ఊర్వశి, బ్రహ్మానందం, ఆలీ, నర్రా శీను, కబీర్ సింగ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, సుమన్ శెట్టి తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: శరత్ మరార్-సునీల్ లుల్లా, కథ-స్క్రీన్ ప్లే: పవన్ కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ)

దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో హీరోగా వచ్చిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. పదేళ్ల తర్వాత పవన్ కి హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ చిత్ర ప్రేరణతో స్వయంగా పవన్ కళ్యాణ్ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అందించగా, పవర్ ఫేం  బాబీ దర్శకత్వం వహించాడు. ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం ఫలితం ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :

అనగనగా ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దులో రతన్ పూర్ అనే ఓ గ్రామం. అక్కడ భైరవ్ సింగ్(శరద్ ఖేల్కర్) అనే ఓ దుర్మార్గుడు ప్రజలను హింసిస్తుంటాడు. అంతేకాదు ఆ ఊరి రాజసంస్థానాధీశుడిని, అతని భార్యను చంపేస్తాడు. అనంతరం అతని కన్ను రాజకుమారి అర్షి దేవి(కాజల్ అగర్వాల్) మీద పడుతుంది. రాజకుటుంబానికి విధేయుడైన హరినారాయణ (ముఖేష్ రుషి) ఆ ఊరిని, రాజకుమారిని కాపాడేందుకు సీఐ సర్దార్ ను (పవన్ కళ్యాణ్) అక్కడికి రప్పిస్తాడు. వచ్చి రాగానే భైరవ్ సింగ్ ను, అతని మనుషుల్ని ఓ ఆట ఆడేసుకుంటాడు. అంతేకాదు అదే క్రమంలో అర్షి దేవికి దగ్గరవుతాడు. ఇది చూసి మండిపోయిన భైరవ్ సింగ్ సర్దార్ పై నిందలు వేయిస్తాడు. మరి సర్దార్ వాటన్నింటి నుంచి ఎలా బయటపడ్డాడు. రాజకుమారిని ఎలా దక్కించుకున్నాడు? సింపుల్ గా ఇదే కథ...

ఫ్లస్ పాయింట్లు:

ఈ చిత్రానికి వెన్నెముక, కెప్టెన్ ఆఫ్ ది షిప్, అన్నీ పవనే. ప్రత్యేకంగా తన అభిమానులు తన నుంచి ఏం ఏం కోరుకుంటారో అవన్నింటినీ అందించాడు. ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఎండ్ టైటిల్ కార్డు పడేదాకా ఒకే లెవల్ ఎనర్జీని మెయింటెన్ చేశాడు. కాస్టూమ్స్ విషయంలో ఈసారి స్పెషల్ కేర్ తీసుకున్నట్లు కనిపించింది. కాజల్ విషయానికొస్తే రాజకుమారిగా ఆకట్టుకుంది. పరిమితమైన పాత్రే అయినప్పటికీ రొమాన్స్ విషయంలో పవన్ తో బాగానే చేసింది. ఇక వీరి తర్వాత విలన్ శరద్ ఖేల్కర్ గురించి చెప్పుకొవాలి. లింప్ సింక్ కుదరకపోయనప్పటికీ మొదటి చిత్రంలోనే క్రూరంగా, రాజసంగా బాగానే నటించాడు. ముకేష్ రుషి, ఊర్వశి తమ తమ పాత్రల్లో అలరించారు.

                              టెక్నికల్ అంశాల విషయానికొస్తే... ఆర్థర్ విల్సన్ ఛాయాగ్రహణం చాలా బాగా వచ్చింది. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ అద్భుతమనే చెప్పాలి. విల్సన్ తన కెమెరాపనితనంతో రతన్ పూర్ సెట్ ను చాలా నేచురల్ గా చూపించాడు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవీ మ్యూజిక్ పరంగా జస్ట్  ఓకే అనిపించాడు. ముఖ్యంగా తౌబా, ఓ పిల్ల పాటలు వినడానికే కాదు స్క్రీనింగ్ కూడా కుదిరాయి.

మైనస్ పాయింట్లు :

ఈ చిత్రానికి ప్రధాన మైనస్ 2 గంటల 45 నిమిషాల నిడివి. పోనీ కథ ఏమన్నా బాగుందా అంటే అది పాతదే. ఇంట్రడక్షన్ సీన్ దగ్గరి నుంచి క్లైమాక్స్ దాకా అంత గబ్బర్ సింగ్ ను చూసినట్లే అనిపించడం ఖాయం. కావాలని ఇరికించిన డాన్స్ ఎపిసోడ్ ఇందుకు నిదర్శనం. వీణ స్టెప్పు లోనైతే పవన్ మరీ ఎబ్బెట్టుగా అనిపించాడు. ఫస్టాఫ్ అంతా పవన్ ఎంటర్ టైన్ మెంట్ తోనే గడిచిపోవటంతో, సెకండాఫ్ లోనైనా ప్రధాన కథ మొదలవుతుందని ఫీలయ్యే జనాలకి ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఎదురవుతుంది. పాత్రలన్నీ ఒక్కొక్కటిగా వచ్చిపోవటం, సంబంధం లేని సంఘటనలు జరగటం వెరిసి ప్రేక్షకుల్లో పెద్ద కన్ఫ్యూజనే క్రియేట్ చేశాడు దర్శకుడు బాబీ. పోనీ కథలో ట్విస్ట్  లు ఏమన్నా ఉన్నాయా లేవు. హీరో తన మీద పడ్డ మచ్చలను ఎలా పరిష్కరించాడో చూపకుండా, నేరుగా విలన్ ని తుద ముట్టించడం, ఆపై  క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగిసిపోతుంది.  కథ, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పవన్ దారుణంగా ఫెలయ్యాడు. ఎడిటింగ్ పరంగా గౌతంరాజు చేసిన తప్పులు క్లియర్ గా తెలిసిపోతాయి. సెకండాఫ్ లో అయితే మరీను. సంగీతం విషయానికొస్తే... బహుశా దేవీ-పవన్ కాంబోలో వచ్చిన ఆల్బమ్స్ లో ఇదే వీక్ అనిపిస్తుంది. పాటలన్నీ బిలో యావరేజ్ గానే ఉన్నాయి. పైగా అన్ని మిస్ ప్లేస్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఏదో మొక్కుబడిగా కొట్టినట్లు అనిపించకమానదు.

చివరగా :

గబ్బర్ సింగ్ లో ఉండే ఎంటర్ టైన్ మెంట్ పవన్ అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తెగ నచ్చింది. కానీ, ఇక్కడ కథ, కథనం లేకపోవటంతో ప్రేక్షకుడు ఇబ్బందికి గురవుతాడు. రెండు గంటల నలభై ఐదు నిమిషాలు కేవలం పవన్ తోనే సినిమా నడపాలనుకోవటం నిజంగా దారుణం. ఈ విషయంలో పవన్ కూడా కాంప్రమైజ్ కాకపోవటం విశేషం. కంటెంట్ విషయంలో కూడా శ్రద్ధ కనబరిచి, ఎడిటింగ్ దగ్గరుండి చూసుకుని ఉంటే సినిమా అవుట్ పుట్ ఇంకా బాగా వచ్చి ఉండేది. ఇక బాబీ తూతు మంత్రంగా దర్శకుడిగా ఉన్నాడే తప్ప వ్యవహారం అంతా పవన్ దేనని అర్థమైపోతుంది. కథ లేకపోగా, ఓ దశలో గబ్బర్ సింగ్ నే రీకాప్ వేశారా అన్న ఫీలింగ్ కలగక మానదు.  

చివరగా... సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే. ఎంటర్ టైన్ మెంట్ కోసం వెళ్లే సగటు ప్రేక్షకుడికి మాత్రం కాస్త నిరాశే.    ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు