నటీనటులు : నారా రోహిత్, నందిత, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అజయ్, రవిబాబు, శ్రీముఖి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శీను, షకలక శంకర్, సత్యం రాజేష్, ధన్య బాలకృష్ణ, మధునందన్ తదితరులు
సాంకేతిక వర్గం :
ఛాయాగ్రహణం: వసంత్, మాటలు: కృష్ణచైతన్య, సంగీతం: శ్రావణ్, నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పవన్ సాధినేని
తెలుగులో ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్నాడు నారా రోహిత్. రెండు వారాల గ్యాప్ లో మరో చిత్రంతో మన ముందుకు వచ్చేశాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో పరిచయమై మెప్పించిన దర్శకుడు పవన్ సాదినేనిల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
తన మేనత్త పెళ్ళి వేడుకలో పుట్టిన సావిత్రి (నందిత)కి చిన్నప్పట్నుంచే పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టం. పెళ్ళి చేసుకోవాలన్నది ఆమె జీవితాశయం. తన అక్క గాయత్రి (ధన్య బాలకృష్ణ) పెళ్ళి అయిపోతే తానూ పెళ్ళి చేసుకోవచ్చని కలలు గనే సావిత్రి, అక్కకు ఇష్టం లేకున్నా ఆమె పెళ్ళి జరిగేందుకు తోడ్పడుతుంది. అంతగా పెళ్ళిని ఇష్టపడే సావిత్రికి ఓ మొక్కుపై షిర్డీకి వెళ్ళే క్రమంలో రైలులో రిషి (నారా రోహిత్) అనే ఓ డాక్టర్ పరిచయమవుతాడు.
వీరిద్దరూ షిర్డీకి వెళ్ళే ఈ ప్రయాణంలోనే కొన్ని అనుకోని పరిస్థితుల్లో దగ్గరవుతారు. అయితే సావిత్రి మాత్రం రిషిపై ఉన్న ప్రేమను బయటపెట్టకపోగా, తనకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎటువైపు సాగింది? పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టం ఉన్న సావిత్రి, రిషి ప్రేమను అర్థం చేసుకుందా? వీరిద్దరికి ఏయే పరిస్థితులు అడ్డొచ్చాయి? లాంటి ప్రశ్నలకు సమాధానమే సావిత్రి మిగతా కథ.
ఫ్లస్ పాయింట్లు:
‘సావిత్రి’కి మేజర్ హైలైట్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఆలోచనతోనే నడిచే ప్రధాన గురించి చెప్పుకోవాలి. పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టముండే ఓ కొత్తదనమున్న పాత్రకు ఓ ప్రేమకథను జోడించి చెప్పిన కథ బాగుంది. నారా రోహిత్ ఎప్పట్లానే తనదైన డైలాగ్ డెలివరీతో బాగా నటించాడు. ఓవైపు కామెడీ పండిస్తూనే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌తో కట్టిపడేశాడు. హీరోయిన్ క్యారక్టరైజేషన్‌లో మొదట్నుంచీ, చివరివరకూ వచ్చే మార్పులను చాలా బాగా చూపించారు. ఇక ఆ పాత్రలో నటించిన నందిత కూడా సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా సరదాగా కనిపిస్తూ, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్‍లో కట్టిపడేసే నటనతో నందిత చాలా బాగా నటించింది. ఇక మురళీ శర్మ, అజయ్, ధన్యా బాలకృష్ణన్, రవిబాబు, మధు.. ఇలా నటీనటులంతా తమ పాత్ర పరిధిమేర బాగా నటించారు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... . కృష్ణ చైతన్య అందించిన సంభాషణలు, పవన్ నెరేషన్‌కు ప్రధాన బలంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఏ. వసంత్ అందించిన సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కి తగ్గట్టుగా చాలా బాగుంది. శ్రవణ్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.
మైనస్ పాయింట్లు :
సెకండాఫ్‌లో వచ్చే ప్రధాన ట్విస్ట్ మినహాయిస్తే, ప్రీ క్లైమాక్స్ వరకూ ఆకట్టుకునే సన్నివేశాలేవీ పెద్దగా లేకపోవడం గురించి చెప్పుకోవాలి. ఈ సమయంలో సినిమా చాలా నెమ్మదిగా నడిచినట్లు కనిపించడంతో పాటు బోరింగ్‌గా కూడా తయారైంది. మసాలా కోసం ఇంట్రడక్షన్ సాంగ్, కొన్ని అనవసరమైన లెంగ్తీ ఫైట్స్, అర్థం లేని కామెడీ లాంటివి సినిమా ఫ్లోను చాలాచోట్ల దెబ్బతీశాయి. ఇక హీరో, హీరోయిన్ల ట్రాక్ కూడా కొన్నిచోట్ల క్లారిటీ లోపించింది.
చివరగా :
ఒక కొత్త ఆలోచనతో, ఓ కమర్షియల్ కథను చెప్పడానికి చేసిన పవన్ చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ప్రధాన కథలో మంచి ఫన్ ఉంది. కొత్తదనం ఏంటంటే హీరోయిన్ పాత్రకుండే ఓ విచిత్రమైన ఆలోచనా విధానంతో ఆ కథ చెప్పడం. ఈ విషయాన్నే మేజర్ హైలైట్‌గా చేసుకున్న ఈ సినిమాలో నటీనటుల ప్రతిభ, క్లైమాక్స్‌లో వచ్చే మంచి ఎమోషనల్ సీన్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.
చివరగా... పెళ్ళి పిచ్చి అన్న కొత్త కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సావిత్రి. వీకెండ్ సరదాగా చూసేయొచ్చు.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment