నటీనటులు : సందీప్‌కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం :
కెమెరా: చోటా.కె.నాయుడు, దర్శకత్వం: ఆనంద్, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, సంగీతం: తమన్
నలుగురూ నడిచిన దారిలో వెళ్తే నలుగురితో నారాయణలా మిగులుతాం. ఏటికి ఎదురీదకపోయినా ఫర్వాలేదు కానీ, మరీ గొర్రెదాటు వ్యవహారానికి కాసింత దూరంగా మెలిగితే తప్పకుండా మంచి గుర్తింపు దక్కుతుంది. ఇప్పుడు సందీప్‌కిషన్‌కి దక్కుతున్నట్టు. సందీప్ కిషన్ తొలి సినిమా నుంచీ ఏదో ప్రత్యేకత కోసం వెంపర్లాడుతూనే ఉన్నాడు. తన మాటలోనూ, ప్రవర్తనలోనే కాదు... సినిమాల ఎంపికలోనూ ప్రత్యేకమైన స్టైల్ ను ఫాలో అవుతున్నాడు. మొహమాటానికి పోయి, అత్యాశకు పోయి వచ్చిన ప్రతి స్క్రిప్ట్ ని ఒప్పుకోవడం లేదు. ఆచితూచి మనసుకు నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. అవి కొన్ని సార్లు సత్పలితాలను ఇవ్వొచ్చు. మరికొన్ని సార్లు చేదును రుచి చూపించవచ్చు. ఇంతకీ టైగర్ సందీప్ కిషన్‌కి ఎలాంటి అనుభవాన్ని మిగిల్చింది? రివ్యూ చదవండి..
కథ :
టైగర్ (సందీప్ కిషన్). అతని ఫ్రెండ్ విష్ణు (రాహుల్ రవీంద్రన్). ఇద్దరూ అనాథాశ్రమంలో ఉంటారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. విష్ణు ఏం కావాలన్నా టైగర్ సమకూరుస్తాడు. తన ఫ్రెండ్ కోసం ఎంతదూరమైనా వెళ్లడానికి వెనకాడడు టైగర్. అంత దృఢమైన వారి బంధానికి చిన్న బ్రేక్ పడుతుంది. విష్ణు చూడ్డానికి బావుండటంతో ఓ జంట అతన్ని దత్తత తీసుకుంటుంది. దాంతో టైగర్‌కి, విష్ణుకి శారీరకంగా దూరం పెరుగుతుంది. అంతేగానీ వారిద్దరి ఫ్రెండ్‌షిప్‌కి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. విష్ణు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తుంటాడు. అక్కడికి గంగ (శీరత్) వస్తుంది. గంగది వారణాసి. కాలేజీ కాంపిటిషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన గంగకు విష్ణు నచ్చుతాడు. ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం గంగ హైదరాబాద్‌లోనే ఉంటుంది. తొలిచూపులోనే టైగర్‌కి గంగ నచ్చదు. వారిద్దరి మధ్య దూరం ఉంటుంది. ఆమె ప్రేమ వద్దని విష్ణుకి నేరుగానే చెబుతాడు. కానీ విష్ణు వినడు. పైగా ఓ సందర్భంలో వారణాసిలో ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలవుతాడు. అసలు విష్ణు వారణాసికి ఎందుకు వెళ్తాడు? తన ఫ్రెండ్‌కోసం ఎంత దూరమైనా వెళ్లే టైగర్ వారణాసికి చేరుకున్నాడా? లేదా?
గంగకి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? టైగర్ కి గంగ ముందే తెలుసా? గంగ, టైగర్‌కి ఎందుకు పడదు? వంటి వాటన్నిటికీ సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
ఫ్లస్ పాయింట్లు:
సినిమాకి స్క్రీన్ ప్లే, సందీప్ నటన, రాహుల్ పెర్ఫార్మెన్స్, సత్య కామెడీ, ఛోటా కెమెరా, తమన్ సంగీతం ప్లస్ పాయింట్లు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా టైగర్ పాత్రను, టైగర్, విష్ణు మధ్య ఉన్న స్నేహాన్ని ఎలివేట్ చేసింది తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఛోటా.కె.నాయుడు ఫోటోగ్రఫీలో ప్రతి ఫ్రేమూ రిచ్‌గా కనిపించింది. శెట్టినాణ్యమా? సరకు నాణ్యమా? అన్నట్టు ఈ సినిమాకు శెట్టి, సరకు రెండూ నాణ్యమైనవే సమకూరాయి. మంచి స్టార్ కాస్ట్ ను శెట్టిగా భావిస్తే, టెక్నీషియన్స్ ను సరకుగా భావించవచ్చు. అదీ లెక్క. రాహుల్ రొమాంటిక్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఫస్టాప్‌లో సరదా సన్నివేశాలతో పాటు రెండు ఆసక్తికరమైన విషయాలు, సెకండాఫ్‌లో ఎమోషనల్ అంశాలతో పాటు స్క్రీన్‌ప్లేకు ప్రాధాన్యతనిస్తూ ఆనంద్ దర్శకత్వం వహించిన తీరు మెప్పించింది.
మైనస్ పాయింట్లు :
హీరోయిన్ మైనస్. రన్ రాజా రన్, టైగర్ సినిమాలు బాగా ఆడటంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవచ్చేమో గానీ, ఈ సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యత లేదు. అడపాదడపా వస్తూ పోతూ కనిపిస్తుంది. పైగా తెరపై ఆమె అందంగా అభినయించిన సన్నివేశాలు కూడా ఏమీ కనిపించవు. టైటిల్ సాంగ్ అనవసరం అనిపిస్తుంది. సినిమా ఫాస్ట్ గా ఉండటంతో అదేపనిగా వెతికితే తప్ప మైనస్ లు కనిపించవు. విష్ణును దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ప్రస్తావన మరలా కనిపించదు. ఇలా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అవడమే తప్ప అదేపనిగా చెప్పదగ్గ మైనస్‌లు కనిపించవు.
చివరగా :
మనస్ఫూర్తిగా నమ్మి, త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే సత్ఫలితమే వస్తుందనడానికి టైగర్ సినిమా ఓ ఉదాహరణ. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో మురుగదాస్ స్వయంగా సాయం చేశారట. ఆనంద్ ఇంతకు మునుపు మురుగదాస్‌కు శిష్యుడు. మురుగదాస్ తానే నిర్మించాలనుకున్న కథ ఇది. అయినా తెలుగులో ఎన్వీ ప్రసాద్ మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించారు.
చివరగా... బెస్ట్ స్క్రీన్‌ప్లే ప్లస్ గుడ్ ఎమోషన్స్ టైగర్ చిత్రం
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment