తుంటరి

March 11, 2016 | 05:07 PM | 0 Views
Rating :
తుంటరి

నటీనటులు : నారా రోహిత్, లతా హెగ్డే, కబీర్ దుహన్ సింగ్, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అలీ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం: పళని కుమార్, మాటలు: లక్ష్మీభూపాల్ - శ్రీకాంత్ రెడ్డి, సంగీతం : సాయి కార్తీక్, బ్యానర్ : శ్రీ కీర్తీ ఫిలింస్, నిర్మాత : అశోక్, నాగార్జున, దర్శకత్వం : కుమార్ నాగేంద్ర

సినిమా సినిమాకి సంబంధం లేకుండా సక్సెలతో దూసుకెళ్తున్నాడు నారా రోహిత్. రెండు వరుస ఫ్లాపులతో ఉన్నాడు డైరక్టర్ నాగేంద్ర. అయితే కేవలం సక్సెస్ కోసం తుంటరి అనే చిత్రాన్ని సేఫ్ గా తీశానని ప్రకటించాడు కుమార్ నాగేంద్ర. అందుకే సొంత కథతో కుస్తీలు పడకుండా, తమిళంలో సైలెంట్ హిట్ అయిన మాన్ కరాటే అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాడు. ప్రముఖ దర్శకుడు మురగదాస్ దీనికి కథ అందించడం విశేషం. మరి మాస్ గెటప్ లో తుంటరిగా నారా రోహిత్ ఎలా ఆకట్టుకున్నాడు. దీంతోనైనా కుమార్ కు సక్సెస్ దక్కిందా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :

ఓపెనింగ్ సీన్ లో ఉద్యోగం కోల్పోయిన ఓ  సాప్ట్ వేర్ ఉద్యోగుల బృందం సరదా కోసం ఓ హిల్ స్టేషన్ కు వెళతారు. అక్కడ వాళ్లకు ఓ సన్యాసి కనిపించి తనకు భవిష్యత్తు తెలుసనీ, ఓ న్యూస్ పేపర్ చూపిస్తాడు. అది నాలుగు నెలల తర్వాత రాబోయేది. అందులో రాజు అనే వ్యక్తి బాక్సింగ్ పోటీల్లో 5కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంటాడని ఉంటుంది. దీంతో ఆ రాజును వెతుక్కుంటూ వెళ్ళిన ఆ ఉద్యోగులు చివరికి అతన్ని వైజాగ్ లో కనుక్కుని అతన్ని బాక్సింగ్ పోటీలకు ఒప్పిస్తారు. అల్లరి చిల్లరగా తిరిగే రాజు (నారా రోహిత్) ఎలా బాక్సింగ్ పోటీలకు ఒప్పుకుంటాడు? మధ్యలో ప్రేమ వ్యవహారం, ఆపై సినిమాలో అనుకోని ఓ  ట్విస్ట్... చివరికి అతను పోటీలో గెలుస్తాడా? అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

కథ బాగుండి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా అనిపిస్తుంది. ఒక కల్పిత కథను నిజ జీవితానికి కనెక్ట్ చేసి చెప్పిన విధానం బాగుంది. ఇక నారా రోహిత్ విషయానికొస్తే కాస్త లావుగా ఎబ్బెట్టుగా అనిపించినప్పటికీ, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడి పాత్రలో అతడి నటన అద్భుతంగా ఉంది. సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో నవ్వించేందుకు అతడు చేసిన ప్రయత్నం బాగుంది.

వెన్నెల కిషోర్, షకలక శంకర్ తమదైన కామెడీని పండించారు. హీరోయిన్ లతా హెగ్డే తన మొదటి సినిమాలో తన పరిధికి తగ్గట్టు బాగానే నటించింది. ఇక విలన్ కబీర్ సింగ్ దుహ పాత్ర అంత పెద్దది కాకపోయినప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం మెప్పించాడు. సినిమాలోని ఆఖరి 20 నిముషాల బాక్సింగ్ సీక్వెన్స్ బాగా పండింది. కామెడీ రెఫరీగా అలీ కామెడీ కొంతవరకూ వర్కవుటైంది.

టెక్నికల్ గా... సాయి కార్తీక్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. వైజాగ్, దాని పరిసర ప్రాంతాలను సినిమాటోగ్రాఫర్ అందంగా చూపించాడు. డైలాగులు ఫన్నీగా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

మైనస్ పాయింట్లు :

రెండు గంటల రన్నింగ్ టైంలో వచ్చే 5 పాటలు టూ మచ్ అనిపిస్తాయి.  సెకండ్ హాఫ్ సినిమా క్లైమాక్స్ వరకూ ఎలాంటి లక్ష్యమూ లేకుండా సాగదీసినట్టు వెళుతూ బోర్ కొట్టిస్తుంది. ప్రధానంగా హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన రొమాంటిక్ కెమిస్ట్రీ అనేది ఎక్కడా కనిపించదు. దీంతో సెకండ్ హాఫ్ బోరింగా అనిపిస్తుంది. పైగా క్లైమాక్స్ లో వచ్చే బాక్సింగ్ సన్నివేశాలు బాగానే ఉన్నా అంత సీరియస్ మోడ్ లో కాస్త కామెడీగా, సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఇక కుమార్ నాగేంద్ర దర్శకత్వ విషయానికొస్తే రీమేక్ ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడినప్పటికీ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.

చివరగా :

ఎప్పుడూ కాస్త సీరియస్ పాత్రలను ఎంచుకునే నారా రోహిత్, మొదటిసారి ఎంటర్టైనింగ్ పాత్రను ఎంచుకుని ఆ పాత్రలోనూ మెప్పించగలనని తుంటరి సినిమాతో ఋజువు చేశాడు. అయితే కీలకమైన సెకండాఫ్ సిల్లీగా మార్చటంతో  దర్శకుడు నిర్లక్ష్యం చేసినట్లు అనిపిస్తుంది.  వెరసి తుంటరి ఓహోగా లేకపోయినా ఓ మోస్తరుగా అలరిస్తాడు.

చివరగా...  వీకెండ్ టైంపాస్ కోసం ఈ ‘తుంటరి’ని ఓ లుక్కెయొచ్చు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు