నటీనటులు : శ్రేయాన్ కపూర్ (తొలిపరిచయం), ప్రగతి చౌరస్య, ముకేష్ రుషి, కోటా శ్రీనివాస రావు, అభిమన్యు సింగ్, సప్తగిరి తదితరులు
సాంకేతిక వర్గం :
సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, నిర్మాత, దర్శకత్వం : వాసు మంతెన
స్టార్ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ ను హీరోగా పరిచయం చేస్తూ వాసు మంతెన అనే దర్శకుడు నిర్మించిన చిత్రమే ‘బస్తీ’. ఈ చిత్ర ఆడియోకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హజరు కావటంతో కాస్త ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లయ్యిందిది. వాస్తవిక ప్రేమకు అద్దంపట్టే సినిమా అన్న ప్రచారంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ తెలుగు అమితాబ్ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకున్నాడో చూద్దాం...
కథ :
అమ్మిరాజు (ముఖేష్ రుషి), భిక్షపతి (కోట శ్రీనివాసరావు) అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇరు వర్గాల పెద్దలు గొడవలన్నింటికీ స్వస్తి పలికి జీవిస్తుంటారు. ఈ క్రమంతో భిక్షపతి కొడుకు భవాని (అభిమన్యు సింగ్) మళ్లీ ఆ ఘర్షణలను రెచ్చగొడుతూ ఉంటాడు. భవానీకి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో అమ్మిరాజు, భవానీ చెల్లెలు స్రవంతి (ప్రగతి చౌరస్య)ను కిడ్నాప్ చేస్తాడు. స్రవంతి కిడ్నాపైన సమయంలోనే అమెరికా నుండి విజయ్ (శ్రేయాన్) తన ఇంటికి వస్తాడు. విజయ్ తండ్రి వెంకటపతి నాయుడు చనిపోయిన తర్వాత వెంకటిపతి నాయుడు సామ్రాజ్యాన్ని, విజయ్ బాధ్యతలనూ చూసుకుంటుంటాడు. అమ్మిరాజును అన్నయ్య అంటూ పిలిచే విజయ్, తమ ఇంట్లో కిడ్నాప్‌కు గురైన స్రవంతిని అనుకోకుండా చూస్తాడు. స్రవంతి ఆ ఇంట్లో ఉండే కొద్ది రోజులకే ఆమెతో పరిచయం కలగడం, ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగిపోతాయి. వెంకటిపతి నాయుడు తనకు తండ్రిలాంటి వారని, ఆయన కొడుకు విజయ్ సంతోషమే తనకు ముఖ్యమని చెప్పే అమ్మిరాజు, విజయ్ స్రవంతిల ప్రేమ కోసం భిక్షపతిని కలుస్తాడు. అక్కడి నుంచి భవానీ రాక్షసుడిగా మారి ఘోరాలు చేస్తాడు. మరి ఆ ప్రేమ జంట ఏమౌతారు. పెళ్లి పీటలు ఎక్కుతారా? అన్నదే కథ...
ఫ్లస్ పాయింట్లు:
రెండు వర్గాల మధ్యన గొడవలు, కక్ష సాధింపు చర్యల కోసమే కాకుండా కేవలం ప్రేమకథ చుట్టూనే సినిమాను చెప్పే ప్రయత్నం చేయడం పెద్ద ఫ్లస్. రెండు వర్గాల ఆలోచనా విధానాన్ని చెప్పడమే తప్ప ఎక్కడా అనవసరమైన యాక్షన్ అంశాలను జోడించకపోవడం అభినందనీయం. సినిమా నిడివి కూడా తక్కువ ఉండటం కూడా అడ్వాంటేజ్. చెప్పే పాయింట్ చాలా చిన్నదైనా దాన్ని అంతే చిన్నగా చెప్పేసి మరీ బోర్ కొట్టించే సన్నివేశాలను పెట్టకపోవడం ఫర్వాలేదనిపిస్తుంది. ఇక శ్రేయాన్‌కిది మొదటి సినిమా అయినా ఫర్వాలేదనిపించాడు. లుక్స్ పరంగా బాగున్నాడు. క్లైమాక్స్ లో బాగానే ఆకట్టుకుంటాడు. ప్రగతి చూడటానికే కాదు నటనలోనూ ఆకట్టకుంది. ఇక హీరో ఫ్రెండ్‌గా నటించిన ‘అలా మొదలైంది’ ఫేం స్నిగ్ధ తన స్టైల్ యాక్టింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేసింది. టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
మైనస్ పాయింట్లు :
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఎన్నోసార్లు మనం చూసి ఉన్న రొటీన్ ప్రేమకథను అంతే రొటీన్ స్క్రీన్‌ప్లేతో నడిపించడంతో ఈ సినిమా అలా అలా సాగిపోతుందే తప్పా ఎక్కడా ఎగ్జైట్ చెయ్యదు. ప్రేమకథలోని ఇన్నోసెన్స్, రొమాన్స్ ఈ సినిమాలో దాదాపుగా లేదు. దీంతో ఇటు యాక్షన్ సినిమాలా కాక, అటు ప్రేమకథలా కాక మధ్యలో ఆగిపోతుందీ సినిమా! ఫస్టాఫ్ కొంతమేర బాగుందనిపించినా, సెకండాఫ్ మొదలైన కొద్ది సేపటికే సినిమా దాదాపుగా దారి తప్పిపోయింది. తమకు ఎదురైన కొన్ని అడ్డంకులను దాటుకొని ఓ ప్రేమజంట ప్రయాణం ఎటు సాగిందనేది సెకండాఫ్ ప్రధాన అంశం. అసలైన విషయాన్ని పక్కనపెట్టి సెకండాఫ్‌లో ఏమేం చేయాలో అర్థం కాక.. ఆలీ, సప్తగిరి ట్రాకులను పెట్టారు. అవి సినిమాతో సంబంధం లేనివే కాక బోరీంగ్‌గానూ ఉన్నాయి. ఇక హీరోయిన్ బాగానే ఉన్న జంట చూడటానికి బాగా లేదు.
చివరగా :
ప్రేమకథల్లోని భావోద్వేగాలను సరిగ్గా పట్టుకునే కథలకు ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. ఈ అంశాన్ని పట్టుకొనే రకరకాల నేపథ్యాల నుంచి, రకరకాల ప్రేమకథలతో సినిమాలు పుట్టుకొస్తూనే ఉంటాయ్! తాజాగా ఆ జాబితాలోకి వచ్చి చేరిన సినిమా ‘బస్తీ’. రెండు వైరి వర్గాల్లోని వయసుకొచ్చిన పిల్లలు ప్రేమలో పడడం, ఆ ప్రేమకు పెద్దల దగ్గర్నుంచి ఇబ్బందులెదురవడమనే సాదాసీదా కథతో వచ్చిన ‘బస్తీ’ సినిమాలో ఫస్టాఫ్, కొన్ని నవ్వించే సన్నివేశాలు అనుకూలించే అంశాలు. ఇక ఇప్పటివరకూ ఎన్నోసార్లు చూసి ఉన్న కథనే మళ్ళీ అంతే పాత ఫార్మాట్‌లో చెప్పడం, బలమైన సన్నివేశాలు పెద్దగా లేకపోవడం లాంటివి ప్రతికూల అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదరణకు నోచుకోవాలంటే కేవలం ప్రేమకథైతే సరిపోదన్న సత్యం తెలిసిన సినిమాలు ఆ కోణంలోనూ ఆలోచింది కొత్తదనాన్ని ఆపాదించుకొని ఆకట్టుకుంటాయి. ఇది అందులో విఫలమయ్యింది.
చివరగా... అలాంటి కొత్తదనమేమీ లేని సాదాసీదా ప్రేమకథే.. ‘బస్తీ’. భరించటం కష్టమే.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment