బ్రూస్ లీ - ది ఫైటర్

October 16, 2015 | 10:52 AM | 10 Views
Rating :
బ్రూస్ లీ - ది ఫైటర్

నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్భంద, నదియా, రావు రమేష్, పవిత్రలోకేష్, సంపత్ రాజ్, అరుణ్ విజయ్, బ్రహ్మానందం, తదితరులు

సాంకేతిక వర్గం :

సంభాషణలు: కోన వెంకట్, శీనువైట్ల,  ఆర్ట్: నారాయణరెడ్డి, ఎడిటర్:  ఎం.అర్ వర్మ, యాక్షన్: అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, విజయ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస, సంగీతం : ఎస్ఎస్ థమన్, బ్యానర్ : యూనివర్సల్ మీడియా, నిర్మాత : డీవీవీ దానయ్య, దర్శకత్వం : శ్రీను వైట్ల

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రూస్ లీ-ది ఫైటర్. అయితే వీరిద్దరి చిత్రం అనే కన్నా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ పైనే ఈ సినిమా గురించి హైప్ అంతా నెలకొంది. మగధీర లో ఓ చిన్న బిట్ లో మెరిసిన చిరు దాదాపు 6 ఏళ్ళ తర్వాత స్క్రీన్ పై అది కూడా తనయుడి చిత్రంలో మరో సారి అతిధి పాత్రలో కనిపించనున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో... చిరు స్క్రీన్ పై ఎలా మెరిశాడో... వివరాలు తెలియాలంటే... చలో రివ్యూ...

కథ :

కార్తీక్(రామ్ చరణ్) కు కుటుంబమే ప్రపంచం. అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్ర రావు(రావు రమేష్), అక్క (కృతి కర్భంద)లతో హ్యాపీగా అతని జీవితం సాగిపోతూ ఉంటుంది. బ్రూస్ లీని తన రోల్ మోడల్ గా భావిస్తూ చిన్నప్పటి నుంచీ ఫైట్లు, ఫీట్లు చేస్తూ పెరుగుతాడు. అదే క్రమంలో జీవనాధారం కోసం సినిమాలలో స్టంట్ మాస్టర్ గా, సినీ హీరోలకి డూప్ గా పనిచేసే కార్తీక్ తన ఫ్యామిలీ జోలికి ఎవడన్నా వస్తే వాడి బెండు తీస్తాడు. అలాంటి మన కార్తీక్ ని ఓ రోజు పోలీస్ డ్రెస్ లో చూసిన వీడియో గేమ్ డెవలపర్ రియా(రకుల్ ప్రీత్ సింగ్) ఫ్లాటైపోతుంది. అతన్ని ఓ సూపర్ హీరో గా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తూ ఉంటుంది. పోలీస్ పిచ్చిలో చేసే కొన్ని పనుల వల్ల సమస్యల్లో పడితే, ఆమెను బ్రూస్ లీ ఆదుకుంటాడు. ఆ టైంలోనే దీపక్ రాజ్(అరుణ్ విజయ్) మనుషులను పలు సార్లు కొట్టి వారితో వైరం పెంచుకుంటాడు.

                        మరోవైపు బ్రూస్ లీ తండ్రి పనిచేసే వసుంధర లాబ్స్ కంపెనీ అధినేత దంపతులు జయరాజ్(సంపత్ రాజ్)-వసుంధర(నదియా)లు కృతిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అక్కడ బ్రూస్ లీ కి పెద్ద షాక్ తగులుతోంది. ఆ షాక్ నుంచి తేరుకున్న బ్రూస్ లీ కుటుంబం కోసం ఏంచేస్తాడు? మంచి అనే ముసుగులో ఉన్న జయరాజ్ గుట్టును ఎలా బయటపెడతాడు. వారి బారినుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు. చివరికి చిరు బ్రూస్ లీ కి ఎలా సాయం చేసాడు? అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

బ్రూస్ లీ మెయిన్ కంటెంట్ విషయానికొస్తే... కథ పాతదే అయినప్పటికీ స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లే ఆసక్తి మొదలౌతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మొదటి 30 నిమిషాల కథ ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది. ఇక చివరి 20 నిమిషాలు సూపర్బ్.

నటీనటుల విషయానికి వస్తే.. చెర్రీ చాలా స్టైలిష్ గా కనిపించాడు. లుక్, మానరిజమ్స్, స్టైల్, టోటల్ డిఫరెంట్ గా అనిపించే యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. చరణ్ అక్కడక్కడా చేసిన కామెడీ యాంగిల్ ఆకట్టుకుంటుంది. కుటుంబం కోసం తాపత్రయపడే కుర్రాడి పాత్రలో ఎమోషన్ ను బాగా పండించాడు. డాన్స్ లో యాజ్ యూజ్ వల్ గా చించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్రెజన్స్ ఇచ్చింది. చాలా క్యూట్ గా, చాలా అందంగా, మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తుంది. రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరింది. చరణ్ సిస్టర్ పాత్రలో కృతి కర్బంధ బబ్లీ బబ్లీగా కనిపించి మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. రావు రమేష్, పవిత్రా లోకేష్, సంపత్ రాజ్ లు మంచి నటనని కనబరిచారు. శీను వైట్ల కామెడీ అంశానికొస్తే... డైరెక్టర్ గా జయప్రకాశ్ రెడ్డి, హీరోగా బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి కాసేపు నవ్వించారు. ప్రారంభంలో తండ్రి కొడుకుల మధ్య సెటైరికల్ సీన్స్ బాగా నవ్విస్తే, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

ఇక బ్రూస్ లీ లో ఎన్ని ఎలిమెంట్స్, ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉన్నప్పటికీ పెద్ద ఫ్లస్ మాత్రం చిరు రీఎంట్రీనే.  అతిథి పాత్రే అయినా, కనిపించింది ఐదు నిమిషాలే అయినా డల్ గా సాగుతున్న సినిమా ఫలితాన్ని మార్చాడనటంలో ఎలాంటి సందేహం లేదు.  యంగ్ ఏజ్ లో కొదమసింహం లాంటి సినిమాల్లో లాగా రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్ లో కనిపించి అందరినీ థ్రిల్ చేసాడు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్, పెర్ఫార్మన్స్, స్టంట్స్, డైలాగ్స్ థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ చేత గోలలు, విజిల్స్ వేయిస్తాయి. ఆ ఫీల్ తోనే ఆడియన్స్ థియేటర్ బయటకి వచ్చేలా చేస్తుంది.

టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఇంత లిమిటెడ్ టైంలో తను ఇచ్చిన అవుట్ పుట్ సింప్లీ సూపర్బ్. నటీనటులని సరికొత్తగా చూపించాడు. విజువల్స్ పరంగా బ్రూస్ లీ మోస్ట్ కలర్ఫుల్ ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. తమన్ అందించిన పాటలు పెద్ద హిట్, విజువల్స్ పరంగా ఇంకా పెద్ద హిట్. ఇక నేపధ్య సంగీతం పరంగా కూడా ప్రతి సీన్ కి న్యాయం చేసాడు. మెయిన్ గా చిరు ఎపిసోడ్ కి కంపోజ్ చేసిన బిట్ సాంగ్ అండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ ఎం.అర్ వర్మ 80% సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల అతను చేసిన షార్ప్ ఎడిటింగ్ అదిరింది. మెయిన్ గా చిరు ఎపిసోడ్ ని చాలా బాగా చేసాడు. నారాయణరెడ్డి ఆర్ట్ చాలా బాగుంది. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, విజయ్, వెంకట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్లు :

పాత్రలను కొత్తగా రూపుదిద్దినా...  మూల కథ మాత్రం చాలా చాలా పాతది. రైటర్స్ ద్వయం కోన వెంకట్ అండ్ గోపి మోహన్ లు కలిసి ఆ కథను పాత పద్ధతిలోనే రూపొందించారు. సో... ఓవరాల్ గా ఆడియన్స్ కి శ్రీను వైట్ల కొత్త కథ చెప్పాడు అనే ఫీలింగ్ అయితే ఉండదు. సిస్టర్ సెంటిమెంట్ బేస్ గా వచ్చిన చిత్రం అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీల్ ను ఇవ్వలేకపోయాడు. ఇక సెకండాఫ్ పరమ బోరింగ్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ దాకా చిత్రం ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతూ ఉంటుంది. సెకండాఫ్ మొత్తాన్ని కామెడీ పెట్టి ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నప్పటికీ అది కాస్త విఫలమయ్యింది.

బ్రహ్మానందం కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంతే కాదు చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది. సెకండాఫ్ లో హీరోయిన్ పాటల కోసం తప్ప ఇంకెక్కడా పెద్దగా కనిపించదు. అలాగే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన టిసిక చోప్రా చేత చేయించిన పాత్ర చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక విలనిజం కూడా పెద్దగా పండలేదు. స్క్రీన్ ప్రెజంటేషన్ కి అరుణ్ విజయ్ ఓకే కానీ, అతని దర్శకుడు బాగా వాడలేదు. దీనివల్ల విలనిజం ఎలివేట్ కాలేదు. సెకండాఫ్ కనీసం ఒక 15 నిమిషాలు తగ్గించినా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. ఎడిటింగ్ లో 20 శాతం మైనస్ అదే.

చివరగా :

మెగా అభిమానుల దాహం తీర్చే సినిమా బ్రూస్ లీ. 6 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తెరపై కనిపించనున్నాడు అన్న ఆశతో థియేటర్ కి వచ్చే అభిమానులను ఏ మాత్రం నిరాశపరచని చిత్రమిది. రొటీన్ కథ, కథనాలే అయినా అభిమానులను, మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు కూడా ఇందులో ఉండడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. సినిమా వేగంగా మొదలవ్వడం, రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు, ఇంటర్వల్ బ్లాక్, చిరు గెస్ట్ రోల్ సినిమాకి హైలైట్స్ గా నిలవటంతో సెకండాఫ్ డ్రా బ్యాక్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దసరా పండగతోపాటు మెగా అభిమానుల పండగ ఈ చిత్రమని చెప్పుకోవచ్చు.

చివరగా... ఫుల్లీ లోడెడ్ యాక్షన్ ఎంటైర్ టైనర్ బ్రూస్ లీ – ది ఫైటర్. ముఖ్యంగా మాస్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చుతుందనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఓకే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు