కొరియర్ బాయ్ కళ్యాణ్

September 18, 2015 | 02:04 PM | 7 Views
Rating :
కొరియర్ బాయ్ కళ్యాణ్

నటీనటులు : నితిన్, యామి గౌతమ్, అశుతోష్ రాణా, నాజర్, హర్షవర్ధన్, సురేఖా వాణి, సప్తగిరి, రాజేష్ , రవిప్రకాష్ తదితరులు

సాంకేతిక వర్గం :

మాటల సహకారం: హర్షవర్ధన్, కోన వెంకట్, ఛాయాగ్రహణం: సత్య పొన్మార్, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా, నిర్మాతలు: గౌతమ్ మీనన్, వెంకట్, రేష్మ, రచన, దర్శకత్వం: ప్రేమ్ సాయి

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి వరుస హిట్స్ తో ఫాంలోకి వచ్చిన నితిన్ ఆ తర్వాత హర్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం తో కాస్త తగ్గాడు. సినిమాలు సో సోగా ఆడినా అవి నితిన్ కి పెద్దగా పేరు తేలేకపోయాయి. అలాంటి నితిన్ తో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందింది. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయి దీనిని తెరకెక్కించాడు. ప్రీమియమ్ రష్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. అదే కొరియర్ బాయ్ కళ్యాణ్. కానీ, ఏమైందో తెలీదు కానీ చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోలేదు. చివరికి అన్ని కుదిరి వినాయకచవితి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా ఏమేర ఆకట్టుకుందో  చూద్దాం..

కథ :

బీఏ ఫెయిలై ఏ ఉద్యోగమూ దొరక్క సాదాసీదా జీవితం గడిపే ఓ యువకుడు కళ్యాణ్ (నితిన్). ఉద్యోగాల వేటలో ఉండగా ఓ రోజు కావ్య (యామి గౌతమ్) ను చూసి ఫ్లాటయిపోయి లవ్ లో పడిపోతాడు. ఆ అమ్మాయి కోసమే ఓ కొరియర్ కంపెనీలో బాయ్‌గా చేరతాడు. తర్వాత తన టాలెంట్ తో ఎలాగోలా అమ్మాయిని లవ్ లోకి దించుతాడు మన హీరో.  కట్ చేస్తే.. విదేశాల్లో ఓ పెద్ద డాక్టర్ అయిన మన విలన్(అశుతోష్ రానా), తన స్వలాభం కోసం ఒక పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధనలో తమ లాభం కోసం ఇండియాలోని కొన్ని ఆసుపత్రుల్లో తన సీక్రెట్ ప్లాన్‌ను అమలుచేస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డు బాయ్ హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు. దాన్ని అందజేసే బాధ్యత  కళ్యాణ్ కి అందుతుంది. ఆ కొరియర్ మనోడి జీవితాన్ని దారుణంగా మలుపు తిప్పుతుది. ఇంతకీ ఆ కొరియర్ చేరాల్సిన చోటుకు చేరిందా? చేరే క్రమంలో వచ్చే ట్విస్ట్ ఏంటన్నది కథ...

ఫ్లస్ పాయింట్లు:

కొత్తదనమున్న కథను మేజర్ ఫ్లస్ పాయింట్. హాలీవుడ్ తరహాలో ఓ వెరైటీ పాయింట్ ను బేస్ చేసుకుని దర్శకుడు ఎంచుకున్న కథనం హైలెట్స్. ఓ కొరియర్ చుట్టూ కొనసాగే సస్పెన్స్ ఎలిమెంట్‌తో కథను తిప్పడం బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. హీరో నితిన్ పాత్ర కాస్త ఢిపరెంట్ గా ఉంది. కానీ, అమ్మాయి వెంట పడే పాత్రలో అక్కడక్కడా గత ఛాయలను గుర్తు తెచ్చాడు. కానీ, ఓవరాల్‌గా మంచి క్యారెక్టర్ ను చేశాడు. కళ్యాణ్‌గా నితిన్ నటన చాలా బాగుంది. చలాకీతనం చూపుతూనే, సీరియస్ సన్నివేశాల్లోనూ బాగా మెప్పించాడు. ఇక యామి గౌతమ్‌ అందం విషయంలో వంక పెట్టలేం. ఉన్నంతలో బాగా నటించింది. ఇక నాజర్, అశుతోష్ రానాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శక, రచయిత ప్రేమ్ సాయి గురించి చెప్పుకుందాం. కథగా ఒక కొత్త అంశాన్ని చెప్పాలన్న విషయంలో ప్రేమ్ సాయి మంచి మార్కులే కొట్టేస్తాడు. కార్తీక్, అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ బాగుంది. బంగారమా పాట బాగుంది. సందీప్ చౌతా అందించిన బ్యాక్‌గ్రౌడ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. చాలాచోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టింది. ఇక సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. నిర్మాత గౌతమ్ మీనన్ కావటంతో ప్రోడక్షన్ వాల్యూస్ బాగా మెయింటెన్ చేశాడు. నటుడు, రైటర్ హర్షవర్థన్, కోనవెంకట్ మాటల సహకారం సినిమాకు చాలా ఫ్లస్ అయ్యాయి.

మైనస్ పాయింట్లు :

డిఫరెంట్ కథను సినిమాగా చెప్పేందుకు కావాల్సినంతగా కథను విస్తరించకపోవడం గురించి చెప్పుకోవాలి. కథ చాలా కొత్తదే అయినా, సింగిల్ పాయింట్ కావడంతో సబ్‌ప్లాట్స్‌పై ఆధారపడి సినిమాను అర్థవంతంగా చెప్పాల్సిన ప్రయత్నంలో స్క్రీన్‌ప్లేలోని తప్పిదాలు కనిపిస్తాయి. ఇక పాటలు వినడానికి, చూడడానికి బాగున్నా కూడా మిస్ ప్లేస్ అయ్యాయి. ఇక కొన్ని విషయాల్లో డీటైలింగ్ ఇచ్చినా చాలావరకూ త్వరత్వరగా అర్థాంతరంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మరికొంత డీటైలింగ్ ఇచ్చి, అనవసరమైన పాటలను తీసేసి, ఇదే కథను ఏమాత్రం ఆసక్తికరంగా చెప్పినా కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా ఎక్కడో ఉండేది. ఇవన్నీ మిస్ అవ్వడం చేతే ఎటూపోని ఒక సాదాసీదా సినిమాగా నిలిచింది. అయితే అనవసర అంశాల జోలికి పోకుండా నేరుగా చెప్పాలనుకున్న విషయాన్నే చెప్పేస్తే దర్శకుడిగా ప్రేమ్ సాయి ఒక మార్క్ చూపెట్టగలిగేవాడేమో!

చివరగా :

తెలుగు సినిమాల్లో ప్రయోగాలు ఎప్పుడో కానీ కనబడవు. అలాంటి పరిస్థితుల్లో ఓ సరికొత్త ప్రయోగం పేరుతో ప్రచారం పొందుతూ వచ్చిన సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ఓ సరికొత్త కథ, దానిచుట్టూ అల్లుకున్న ఆసక్తికర బ్యాక్‌డ్రాప్, నితిన్ లాంటి హీరో ఈ ప్రయోగం చేయడంతో పాటు తన పాత్రను బాగా పండించడం వంటి విషయాలన్నీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అయితే అదే టైంలో ప్రయోగాత్మకంగా ఏ సినిమా చేయాలన్నా బలమైన కథతో పాటు అంతకుమించి కథనంలో ఆసక్తికర అంశాలు ఉండాలి. పాటలు, కామెడీ లాంటి అంశాల జోలికి పోకుండా సబ్జెక్ట్ నే పట్టుకోవాలి. కానీ కొరియర్ లో అవి మిస్సయ్యాయి.

చివరగా... ప్రయోగాత్మక అంశాలు పుష్కలంగా ఉన్న ఓ ఆర్డినరి కొరియర్. ఆకట్టుకున్న కథనం ఉన్నా... ఆకర్షించటం కొంచెం కష్టం



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు