దొంగాట

May 08, 2015 | 05:46 PM | 26 Views
Rating :
దొంగాట

నటీనటులు : లక్ష్మీ మంచు, అడవిశేష్, ప్రభాకర్, బ్రహ్మానందం, మధునందన్, పృథ్వి, ప్రగతి తదితరులు

సాంకేతిక వర్గం :

సంస్థ; మంచు ఎంటర్ టైన్మెంట్ ప్రై. లిమిటెడ్, నిర్మాత; మంచు లక్ష్మి, కెమెరా; సామల భాస్కర్

సినిమా కుటుంబంలో పుట్టి పెరిగిన వనిత లక్ష్మీ మంచు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని ఆమె పేరు మీదే ఓ బ్యానరే ఉంది. అలాంటిది ఇప్పుడు తన కూతురు విద్యా నిర్వాణ సమర్పణలో ఓ సినిమాను నిర్మించారు లక్ష్మీ మంచు. ఆ సినిమా దొంగాట. ఇప్పటిదాకా నిర్మాతగా భారీ ప్రయోగాలు చేసిన లక్ష్మీ పరిమిత బడ్జెట్ లో ప్రస్తుతం నడుస్తున్న థ్రిల్లింగ్ ట్రెండ్ లో ఓ కథను ఎంపిక చేసుకుని దొంగాట అని పేరు పెట్టారు. ఆ దొంగాటను ఎవరు ఎవరితో ఆడారు? ప్రేక్షకులతో సినిమా రూపకర్తలు ఆడలేదు కదా?.... ఇలాంటి అంశాలతో ఈ రివ్యూ...

కథ :

శ్రుతి (లక్ష్మీ మంచు) సినిమా నటి. ఆమెను ఓ ముగ్గురు కిడ్నాప్ చేస్తారు. ఆ ముగ్గురే వెంకట్ (అడవి శేష్), విజ్జు (మధునందన్), ప్రభాకర్. శ్రుతిని విజ్జు తన బాస్ ఇంట్లో దాచి పెడతాడు. ఆమెను విడిపెట్టాలంటే  పది కోట్లు డిమాండ్ చేస్తారు ఆ ముగ్గురు. డబ్బు సంపాదించడానికి దగ్గరి దారి కిడ్నాప్ అన్నది వాళ్ల ఆలోచన. వారి ప్లాన్ నెరవేరిందా? ఇంతకీ ఆ ముగ్గురు శ్రుతినే ఎందుకు కిడ్నాప్ చేశారు? శ్రుతికి ఆ ముగ్గురితో ఏమైనా సంబంధం ఉందా? నిజానికి దొంగాట ఆడింది ఎవరు? ఎందుకోసం? ప్రేక్షకులందరూ అనుకున్నట్టు ఆ ముగ్గురే నేరస్తులా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కథలో పృథ్వి, బ్రహ్మి ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగిందో కూడా ఆసక్తికరమే.

ఫ్లస్ పాయింట్లు:

లక్ష్మీ మంచు సినిమా అనగానే ముందు గుర్తుకొచ్చేది పబ్లిసిటీ. సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేయడంతో సినిమాకు తొలి గుర్తింపు వచ్చింది. లక్ష్మీ మంచు నటన చాలా బావుంది. నిర్మాతగా కూడా ఆమె ఆ కథకు కావాల్సినంత మేరకు ఖర్చు పెట్టారు . మంచి పాత్ర పడితే అడివిశేష్ తనదైన శైలితో తప్పకుండా ఆకట్టుకుంటాడని మరో సారి నిరూపించిన సినిమా ఇది. నటీనటులందరూ తమ పాత్రల్లో చక్కగా నటించారు. వారి పరిధి మేరకు నటించి మంచి మార్కుల్ని సంపాదించుకున్నారు. పరిశ్రమలో ఉన్న పరిచయాలతో ఓ పాటలో మిగిలిన స్టార్స్ ను నటింపజేయడం లక్ష్మీ మంచు క్రెడిటే. ఆ పాటతో పాటు లక్ష్మీ పాడిన పాట కూడా బావుంది. కెమెరా పనితనం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకునేలా తెరకెక్కించారు. సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దిట్ట అని ఇంకోసారి నిరూపించుకున్నారు. దర్శకుడు తన తొలి వెంచర్ తో పాస్ మార్కుల్ని తెచ్చుకున్నారనే చెప్పాలి.

మైనస్ పాయింట్లు :

వంశీకృష్ణకు దర్శకుడిగా ఇది తొలి సినిమా. దాంతో సినిమా చిత్రీకరణలో కాసింత తొట్రు పాటు కనిపించింది. సినిమా హిట్ కావాలంటే కొన్ని ఫార్ములాలు ఉండాలనుకున్నారేమో. తొలి సగంలో అంతా రొటీనే అనిపించేలా చిత్రీకరించారు. ఈ తరహా థ్రిల్లింగ్ కథలను ఎంపిక చేసుకున్నప్పుడు కాసింత స్పీడ్ చాలా అవసరం. కామెడీ, అక్కడక్కడా డైలాగు చమక్కులు కూడా అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఆ విషయంలో వంశీ మరికాసింత దృష్టి పెట్టి ఉంటే బావుండేది. రెండు పాటలు మినహా మిగిలినవి పెద్దగా ఆకట్టునేలా లేవు. ఎడిటింగ్ విషయంలోనూ ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది.

 

చివరగా :

లక్ష్మీ మంచు ఫైట్స్ చేస్తే కొత్తగానే ఉంటుంది. కానీ కథ, కథనం డిమాండ్ చేయకుండా ఫైట్లు చేయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గట్టు ఉండదు. ఇలాంటి విషయాల్లో దర్శకుడు మరికాసింత శ్రద్ధ తీసుకుని ఉంటే బావుండేది. తొలి సగం కూడా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏ సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా. ఈ తరహా సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య తరచూ చూస్తున్నారు కాబట్టి ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించి ఉంటే బావుండేది.

బాటమ్ లైన్; దొంగాట ఒక్కసారి ఆడొచ్చు.. అదేనండీ చూడొచ్చు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు