నటీనటులు : ఛార్మి, సత్య, అజయ్ ఘోష్, రామ్, బ్రహ్మానందం, సంపూర్ణేష్‌బాబు, వంశీ, పాండి తదితరులు
సాంకేతిక వర్గం :
సంస్థ: సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై లిమిటెడ్, శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్, సమర్పణ: చార్మి కౌర్, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సీవీరావు, సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: పి.జి.విందా, పాటలు: భాస్కరభట్ల, సహ నిర్మాత: బి.ఎ.రాజు
కథ: మల్లాది, దర్శకత్వం: పూరి జగన్నాథ్
జ్యోతిలక్ష్మీ అనే సినిమాను పూరి జగన్నాథ్ తీస్తున్నారట. అందులో ఛార్మి హీరోయిన్ అట అనే వార్త లీక్ కాగానే ఊహాగానాలు మొదలయ్యాయి. అలనాటి శృంగారతార జ్యోతిలక్ష్మీకి సంబంధించిన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందనే వార్తలు గుప్పుమనడంతో ప్రాజెక్ట్ కు అమాంతం క్రేజ్ వచ్చేసింది. వీటన్నిటికీ ప్లస్ పాయింట్‌గా ఛార్మి సమర్పిస్తోందనే వార్త. జ్యోతిలక్ష్మీ పుట్టినరోజునే ఈ సినిమా విడుదలవుతోందనే విషయం నిలిచాయి. అంతగా ఎక్స్ పెక్టేషన్స్ ను రేకెత్తించిన జ్యోతిలక్ష్మీ అందరికీ పసందుగా అనిపించిందా, నీరుగార్చిందా తెలుసుకోవాలంటే చదివేయండి...
కథ :
జ్యోతిలక్ష్మీ (చార్మి) వేశ్య. ఆమె కోసం ఎందరో విటులు వస్తూపోతూ ఉంటారు. వేశ్యావాటికలో ఉన్న ఆమెను ఒక రోజు సత్య (సత్య) చూస్తాడు. ఆమె కోసం అప్పటినుంచీ ఆ వేశ్యాగృహానికి రాకపోకలు సాగిస్తుంటాడు. ఎలాగోలా జ్యోతిలక్ష్మీతో తన ప్రేమను చెబుతాడు. ఇలాంటి వారు చాలా మందే ఉంటారులే అని అనుకుంటుంది జ్యోతిలక్ష్మీ. కానీ నిదానంగా అతని ప్రేమలోని నిజాయతీని గ్రహిస్తుంది. ఓ శుభోదయాన ఆమెను వేశ్యావాటిక నుంచి దూరంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు సత్య. వారిద్దరూ ఒక సారి నారాయణ పట్వారి కంట్లో పడతారు. అక్కడి నుంచి సత్యకు ఇబ్బందులు మొదలవుతాయి. నారాయణపట్వారి తన బలగంతో సత్యను చంపించాలనుకుంటాడు. అతని కోరిక నెరవేరిందా? అసలు నారాయణ పట్వారి ఎవరు? వీరి కాపురంతో అతనికేం పని? సత్య ఇబ్బందుల పాలైతే జ్యోతిలక్ష్మీ ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివి? వాటిని అబలగా చూస్తూ ఉండిపోయిందా? సబలగా ధైర్యంగా ఎదుర్కొందా? అనేది సినిమా సారాంశం.
ఫ్లస్ పాయింట్లు:
జ్యోతిలక్ష్మీ అనే టైటిలే సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్. ఆ తర్వాతది ఈ సినిమాలో ఛార్మి టైటిల్ పాత్ర పోషించడం. మంచి ఫిజిక్‌తో పాటు మంచి నటనా కౌశలాన్ని కనబరిచింది ఛార్మి. కొన్ని చోట్ల హావభావాలు కాసింత అతిగా అనిపించినా ఓవరాల్‌గా చూస్తే ఛార్మి బాగా నటించింది. మరీ ముఖ్యంగా సన్నివేశాలకు అనుగుణంగా ఆయా సందర్భాల్లో ఆమె నటించిన తీరు ప్రశంసనీయం. ఛార్మికి ఈ సినిమాకు అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. పాటలు రెండు, మూడు బావున్నాయి. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్, ఫస్టాప్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు బావున్నాయి. పూరి మార్కు డైలాగులు కూడా అక్కడక్కడా వినిపించాయి. ఛార్మి బుల్లెట్ నడిపించిన తీరుకు థియేటర్లలో సందడి కనిపించింది. సత్య కొత్త నటుడైనా చాలా బాగా నటించాడు. అజయ్ ఘోష్ కి అవకాశం దొరికితే ఎంత మంచి నటను కనబరుస్తాడో మరో సారి రుజువైంది. బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు కనిపించగానే ఎప్పటిలా పెదాలు నవ్వుతో విచ్చుకుంటాయి.
మైనస్ పాయింట్లు :
మంచి కథను చెప్పాలన్నది అందరికీ నచ్చే అంశమే. కానీ పూరి తాను తీసుకున్న పాయింట్‌ను ఇంకాస్త డీప్‌గా చెప్పాల్సింది. బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామని ఉన్నారు కానీ, సినిమాలో వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదన్నది వాస్తవం. అలాగే క్లైమాక్స్ కూడా కాసింత పేలవంగానే అనిపించింది. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని సోసోగానే ఇచ్చాడు. ఏదేమైనా ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా లేదు. ఒక వర్గానికి పరిమితమయ్యేలా అనిపిస్తోంది. తొలి సగంలో ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బావుండేది.
చివరగా :
ముందు నుంచీ ఈ సినిమా గురించి ఛార్మి చెబుతున్నది ఒక్క విషయమే. తనకు కొంచెం డబ్బులు, మంచి పేరు వస్తే చాలు అని. ఛార్మి మాట ఇప్పటికే నిజమైపోయింది. సినిమా విడుదలకు ముందే క్రేజీ బిజినెస్ జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఛార్మి నటనకు మంచి పేరు వస్తోంది. అవార్డు కూడా రావచ్చని నమ్మకం. 37 రోజుల్లో ఈ సినిమాను తీసిన పూరి జగన్నాథ్ ఫాస్ట్ ను కూడా మెచ్చుకుని తీరాలి. అంతా బావుంది కానీ పక్కాగా పూరి స్టైల్ సినిమా జ్యోతిలక్ష్మీ అని చెప్పుకునేలా ఎక్కడా లేదు. ఆ ఊసులు ఏమీ ఇందులో కనిపించవు.
చివరగా... వన్ అండ్ ఓన్లీ ఛార్మి ఒన్ ఉమెన్ షో జ్యోతిలక్ష్మీ... టైటిల్ ఊహించి వేరే ఎక్స్ పెక్ట్ చేస్తే కష్టమే.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment