నటీనటులు : సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి ముదివాడ, ప్రగతి, సిధ్ తదితరులు
సాంకేతిక వర్గం :
కెమెరా మెన్: విజయ్ సి.చక్రవర్తి, సంగీతం:మిక్కీజే.మేయర్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: సాయికిరణ్ అడివి
దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకునే సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. తాజాగా ఆయన ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాయికిరణ్ అడవితో రూపొందించిన సినిమాయే కేరింత. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కేరింత ప్రేక్షకుడికి మంచి అనుభూతినిచ్చిందా? చూద్దాం...
కథ :
రెండేళ్ళ కాలంలో ఆరుగురు ఫ్రెండ్స్ జీవితాల్లో వచ్చిన మార్పు, వాటి చుట్టూ తిరిగే పరిస్థితుల కథే కేరింత. జై (సుమంత్) తాను సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచాలనుకునే వ్యక్తిత్వం ఉన్న యువకుడు. సిద్ధు (విశ్వనాథ్), నూకరాజు (పార్వతీశం), ప్రియ (తేజస్విని), భావన (సుకృతి) అతడి బెస్ట్ ఫ్రెండ్స్. సాధారణంగా సాగిపోయే వారి జీవితాల్లో ప్రేమ అనే ఫీలింగ్ ఓ అందమైన కేరింతకు జీవం పోస్తుంది. జై, తొలిచూపులోనే మనస్విని (శ్రీ దివ్య)ని ప్రేమిస్తాడు. భయపడుతూ ప్రతీ పనినీ చేసే పరిస్థితుల్లో బతికే సిద్ధూ ప్రియను కూడా అలాంటి పరిస్థితుల మధ్యే ప్రేమిస్తాడు. తన గమ్యమేంటో తెలియని నూకరాజు, భావన ద్వారా తన గమ్యాన్ని తెలుసుకుని ఆమెను ఆరాధిస్తాడు. మరి చివరికి ఈ కథలన్నీ ఎక్కడికి చేరాయి? వారి ప్రేమ నిజంగానే కేరింతలు కొట్టిందా? అన్నది మిగతా కథ.
ఫ్లస్ పాయింట్లు:
ప్రేమకథల్లోని ఎమోషన్‌ను సినిమాటిగ్గా కాకుండా సహజంగా తెరపై చూపించాలని దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. ఒకరితో ఒకరికి సంబంధమున్న ఆరుగురి జీవితాల్లో వచ్చే మార్పే ఓ సినిమా కథగా చెప్పడమంటే సులువుగా కనిపించే కష్టమైన పని. ఆ విషయంలో స్క్రీన్‌ప్లేలోని కొన్ని అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవటంలో సక్సెస్ అయ్యింది. అన్ని ప్రేమకథలూ విఫలమవుతున్నట్టు కనిపించే పరిస్థితుల్లో అన్నింటిలో ‘నువ్వెవరో తెలియదే?’ అనే కామన్ పాయింట్‌ను, అన్ని ప్రేమకథలూ కలిసిపోతాయనకునే పరిస్థితుల్లో ‘నువ్వెవరూ?’ అనే కామన్ పాయింట్‌ను సినిమాకు సరిగ్గా కనెక్ట్ చేయడం ఆకట్టుకుంటుంది. సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్విని, సుకృతి, విశ్వనాథ్, పార్వతీశం ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి. ఒక్కో పాత్రకూ ఒక్కో మూడ్ ఉండడం, ఆ మూడ్‌ను ఎవ్వరికి వారుగా సరిగ్గా పట్టుకోవడంతో సినిమా చూస్తున్నంతసేపు పాత్రలే కనిపిస్తాయి తప్ప నటీనటులు కనిపించరు. ముఖ్యంగా సుమంత్, శ్రీదివ్య, తేజస్విని మినహా మిగతా ముగ్గురూ కొత్తవారైన చాలా బాగా చేశారు. మిక్కీ జే.మేయర్ సంగీతం ఆకట్టుకుంది. విజయ్ కెమెరా పనితనం ఈ చిత్రానికి పెద్ద ఫ్లస్ పాయింట్. ఉన్న లోకేషన్లను చాలా బాగా చూపించాడు.
మైనస్ పాయింట్లు :
ఎంత లవ్ సబ్జెక్ట్ అయినా, మాస్ సబ్జెక్ట్ అయినా ఫన్ లేకపోతే సినిమా చాలా కష్టమే. ఈ విషయంలో ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా మిగిలింది. బలవంతంగా ఇరికించాల్సిన అవసరం లేకున్నా ఈ కథలో, సన్నివేశాల్లో ఫన్‌కి చాలా స్కోప్ ఉంది. ఎమోషనల్‌గా సాగే ఇలాంటి సినిమాను బలమైన సన్నివేశాలతో పాటు కొంత ఫన్‌ను జతకలిపి చెబితే ప్రేక్షకుడు ఎంత బాగా కనెక్ట్ కాగలడనే విషయాన్ని ఇదివరకు చాలా సినిమాలే ఋజువు చేశాయి. ఆ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ఇక కథను హ్యాపీ డేస్ తరహాలో ఆసక్తికరంగా కాకుండా సాదాసీదాగా నడిపించడం కూడా మైనస్ పాయింటే. పోనీ సెకండాఫ్ మొదలైన తర్వాతైనా కథ ఆసక్తిగా నడుస్తుందా అంటే అదీ లేదు. వెరసి ఈ చిత్రం ఓవరాల్ గా ప్రేక్షకులకు బోర్ కొట్టించక మానదు.
చివరగా :
గత చిత్రాల్లో అందమైన భావోద్వేగాలను అంతే అందంగా చూపించిన సాయికిరణ్ అడవి ఈ చిత్రంతో విఫలమయ్యాడనే చెప్పొచ్చు. ఓ సాదాసీదా కాలేజీ బ్యాగ్రౌండ్ తీసినప్పటికీ శేఖర్ కమ్ములను మరిపించ లేకపోయాడు. అయితే కొంచెం కూడా రొమాంటిక్ టచ్ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కింటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం బాగానే నచ్చోచ్చు. కానీ, యూత్ సాదా సీదా ఫార్ములా చిత్రాలను ఇష్టపడటం కష్టమే.
చివరగా... హ్యాపీడేస్ పార్ట్ -2. కానీ, కంటెంట్ లేదు. తాజాదనం కోసం వెళ్లితే మాత్రం కష్టమే.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment